న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్ భారీ విస్తరణ దిశగా అడుగులేస్తోంది. నూతన మాల్స్ ఏర్పాటు ద్వారా రిటైల్ విభాగాన్ని అయిదేళ్లలో రెండింతలకు చేయాలని లక్ష్యంగా చేసుకుంది. రిటైల్ రంగంలో ప్రస్తుతం సంస్థ ఖాతాలో 42 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 8 మాల్స్, షాపింగ్ సెంటర్స్ ఉన్నాయి. 30 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో అన్ని విభాగాల్లో కలిపి 150కిపైగా ప్రాజెక్టులను సంస్థ ఇప్పటికే పూర్తి చేసింది.
అద్దె కింద 4 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంది. 21.5 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో గృహ, వాణిజ్య భవనాల నిర్మాణానికి అవసరరమైన స్థలం కంపెనీ చేతిలో ఉంది. గృహ, కార్యాలయ ప్రాజెక్టులను సైతం కొత్తగా అభివృద్ధి చేస్తామని డీఎల్‌ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్ వాటాదార్లకు ఇచ్చిన సందేశంలో వెల్లడించారు.
‘ఆఫీస్, మాల్స్ అద్దె వ్యాపారం క్రమంగా సాధారణ స్థితికి వస్తోంది. షాపింగ్ మాల్స్‌లో కస్టమర్ల రాక మహమ్మారి పూర్వ స్థాయికి స్థిరంగా చేరుతోంది’ అని వివరించారు. కాగా, నూతన బుకింగ్స్ 2021–22లో రెండింతలై రూ.7,273 కోట్లు నమోదైంది. గురుగ్రామ్, గోవాలో రెండు షాపింగ్ మాల్స్ నిర్మాణానికి రూ.2,000 కోట్లు పెట్టుబడి చేస్తున్నట్టు కంపెనీ ఈ ఏడాది మార్చిలో ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment