‘పురం’లో నీటిసమస్య పరిష్కారమే లక్ష్యం
హిందూపురం అర్బన్ : హిందూపురంలో తాగునీటి సమస్య పరిష్కారమే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ డైరెక్టర్ (డీఎంఏ) కన్నబాబు తెలిపారు. హిందూపురంలో నెలకొన్న తాగునీటి సమస్య, కూరగాయల మార్కెట్ నిర్మాణ విషయమై కన్నబాబు సోమవారం ప్రత్యేక పరిశీలనకు వచ్చారు. ముందుగా కూల్చివేసిన కూరగాయల మార్కెట్ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పరిగి రోడ్డులోని పీఏబీఆర్ పంపింగ్ కేంద్రం వద్దకు వెళ్లారు. తర్వాత మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని కౌన్సిల్ హాల్లో అధికారులు, చైర్పర్సన్, కౌన్సిలర్లతో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాగునీటి సమస్యకు నిధుల కొరత లేదన్నారు. అదనంగా బోర్లు ఫ్లషింగ్, కొత్తబోర్లు వేయడానికి డీఎంఏ నిధుల కింద రూ.16 లక్షలు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఈవేసవిలో హిందూపురంలో నీటి సమస్య ఉండకూడదన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. వచ్చే ఏడాదిలోపు గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి రూ.250 కోట్లతో కొత్త పైపులైన్ ఏర్పాటు చేస్తున్నారు. తొలివిడతలో రూ.160 కోట్లు, రెండోవిడతలో రూ.90 కోట్లు విడుదలవుతాయన్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీల్లో ఆదాయాన్ని మరింత పెంచుకోవడంపై ప్రపంచబ్యాంకు సహకారంతో ప్రత్యేక సర్వే జరుపుతున్నామన్నారు.
ఇందులో భాగంగా వాటర్ ఏటీఎంలు ఏర్పాటు చేసి కార్డు ద్వారా ప్రతి ఇంటికీ 40 లీటర్ల శుద్ధిజలం అందిస్తామని చెప్పారు. అలాగే నూతన కూరగాయల మార్కెట్ నిర్మాణానికి త్వరలోనే ఎమ్మెల్యే బాలకృష్ణ చేత శంకుస్థాపన చేయిస్తామన్నారు. నాలుగు అంతస్తుల్లో నిర్మాణం జరుగుతుందన్నారు. ఇందుకోసం రూ.23 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే పీఏ వీరయ్య, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ ఫయాజ్ అహ్మద్, ఏడబ్ల్యూఈ లోక్నాథ్, మున్సిపల్ ఎస్ఈ ఇమాం, తహసీల్దార్ విశ్వనాథ్, మున్సిపల్ వైస్ చైర్మన్ రాము, ఇంజినీర్ రమేష్, టీపీఓ తులసీరాం, కౌన్సిలర్లు పాల్గొన్నారు.