తుపాకితో కాల్చుకుని.. మాజీ ఎంపీ ఆత్మహత్య
రాజ్యసభ మాజీ సభ్యుడు ఎన్. రాజేంద్రన్ కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని కోవిల్పట్టిలో జరిగింది. కోవిల్పట్టి బస్టాండుకు సమీపంలోని ఏడో నెంబర్ జాతీయ రహదారిపై ఆయన కారు కనిపించింది. కారు ముందుసీట్లు రెండూ రక్తసిక్తమై ఉన్నాయి. పక్కనే రివాల్వర్ కూడా దొరికింది. ఆ దారిలో వెళ్లేవాళ్లకు రక్తసిక్తమైన కారు కనిపించడంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి, అక్కడ కారు అద్దాలు పగలగొట్టి రాజేంద్రన్ మృతదేహాన్ని కోవిల్పట్టి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
రాజేంద్రన్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ఆయనకు ఒక ఫంక్షన్ హాలు, బస్సు సర్వీసు వ్యాపారాలున్నాయి. అయితే, కొడుకు కారణంగా వ్యాపారంలో నష్టాలు వచ్చాయని, దాంతో కోడలి ఇంట్లో గొడవలు జరిగాయని చెబుతున్నారు. గడిచిన వారం రోజులుగా ఆయన ఆందోళనగా కనిపిస్తున్నారని, ఇంట్లో దీపావళి పండగ కూడా చేసుకోలేదని స్థానికులు తెలిపారు. బుధవారం సాయంత్రం 5.20 గంటల సమయంలో తన అసిస్టెంట్ గణేశన్‌తో ఫోన్లో మాట్లాడారని, తాను ఒంటరిగా కారులో వెళ్తున్నట్లు చెప్పారని, కొద్దిసేపటికే విగతజీవిగా మారారని అంటున్నారు. రాజేంద్రన్‌ది కచ్చితంగా ఆత్మహత్యేనని, ఇందులో వేరే కోణాఉల ఏవీ లేవని జిల్లా ఎస్పీ అశ్విన్ కొ ట్నిస్ తెలిపారు. కణతమీద రివాల్వర్ పెట్టుకుని కాల్చుకున్నారని, దాంతో రివాల్వర్ ఎడమవైపు నుంచి బయటకు వచ్చిందని వివరించారు. రాజేంద్రన్‌కు ప్రోస్టేట్ గ్రంధికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు ఆయన వైద్యుడు చెప్పారు. అన్నాడీఎంకే తరఫున 1995 నుంచి 2001 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాజేంద్రన్.. తర్వాత డీఎంకేలో చేరారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.