మృత్యు రహదారులకు అడ్డుకట్ట... ‘రోడ్డు సేఫ్టీ’
సందర్భం
దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంత విస్తృత పరిమాణంతో కేంద్రప్రభుత్వం రోడ్డురవాణా, భద్రతా చట్టం 2015పై బిల్లును ప్రవేశపెట్టింది. గత నెల చివర్లో దేశవ్యాప్తంగా రవాణా ఆపరేటర్లు ఈ బిల్లుకు వ్యతిరేకంగా తీవ్ర నిరసన తెలిపినా ప్రజా భద్రత దృష్ట్యా ఈ బిల్లుపై జాతీయస్థాయిలో చర్చ జరగవలసిన అవసరం ఉంది.
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రోడ్డురవాణా, భద్రతా చట్టం 2015 పేరిట ఒక బిల్లును ప్రవే శపెట్టింది. దీనికి ప్రతిస్పంద నగా ఏప్రిల్ 30న లారీ, ఆటో డ్రైవర్ యూనియన్లతోపాటు దేశవ్యాప్తంగా రవాణా ఆపరే టర్లు నిరసన ప్రదర్శనలు నిర్వ హించారు. దేశంలో జరుగుతు న్న రోడ్డు ప్రమాదాలను నిత్యం పరిశీలిస్తున్న ప్రజలు భారతీయ వాహన చట్టాలను సవరించాల్సిన అవసర ముందని భావిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, ప్రమాద క్లెయిమ్లు తదితరమైన ఘటనలపై కోర్టు కేసులు పెరిగి పోతున్నాయి. టోల్ చార్జీలపై ప్రజా నిరసన కారణంగా పలు రాష్ట్రాల్లో బహుళ పన్నుల విధానాన్ని రద్దు చేయా లని డిమాండ్ చేస్తున్నారు. పెరుగుతున్న రవాణా అవస రాలు, రవాణా మౌలిక సౌకర్యాల అవసరం కారణంగా దేశవ్యాప్తంగా రోడ్ నెట్వర్క్ల విస్తరణకు, నిర్వహణకు ప్రైవేట్ పెట్టుబడే పరిష్కారమని కేంద్రం భావిస్తోంది. దీనికి సంబంధించి చట్టాల్లో మార్పు తీసుకువస్తానని బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసింది.
ఈ నేపథ్యంలో రోడ్డు రవాణా, భద్రతా చట్టం 2015ను ప్రతిపాదించారు. ఇది 350 పేజీల భారీ డాక్యు మెంట్. రోడ్డు రవాణాకు సంబంధించిన ప్రతి అంశాన్ని దీంట్లో పొందుపర్చారు. ఈ చట్టం కింద ఇన్ని నిబంధన లను ఏర్పర్చవలసిన అవసరం ఉందా అన్న ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఈ చట్టం కింది సాధికారిక వ్యవస్థ లను ప్రతిపాదించింది. 1. జాతీయ రహదారి భద్రత, వాహన క్రమబద్ధీకరణ అథారిటీ. 2. జాతీయ రోడ్డు రవాణా, బహుళ నమూనా సమన్వయ అథారిటీ.
వీటిలో మొదటిది ప్రధానంగా వాహనాలకు సం బంధించింది. రెండోది రహదారులు మినహా రవాణా మౌలిక సౌకర్యాల వ్యవస్థకు సంబంధించింది. డ్రైవింగ్ లెసైన్స్, మోటార్ వెహికల్ రిజిస్ట్రేషన్లు, బీమా, ఉత్పత్తి దారుల నుంచి వెహికల్ సమాచారం, పర్మిట్లు, రోడ్ ప్రమాదాలు, నేరాలు, జరిమానాలు వంటి వాటికి సం బంధించి జాతీయ ఏకీకృత వ్యవస్థను కూడా ఈ బిల్లు ప్రతిపాదించింది. రాష్ట్రాల మద్య సమాచార పంపకంలో అంతరాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న సమస్యల కారణంగా ఇది సరైన చర్యే. అయితే దీనికి సమాచారా న్ని రూపొందించి, అందించే వ్యవస్థను, యంత్రాంగాన్ని ఏర్పర్చుకోవడం అవసరం.
అయితే, ఈ బిల్లు మొత్తం మీద క్రమబద్ధీకరణ సం స్థలను కేంద్రీకరించాలని చూస్తోంది. ఇది కేంద్ర-రాష్ట్ర సమన్వయాన్ని, సమాచార పంపకాన్ని, సంస్థల మధ్య సహకారాన్ని ఈ చట్టం ప్రతిపాదించడం లేదు. కేంద్రీ కరణ అనేది అవినీతికి రాచమార్గం కల్పిస్తుంది. దేశవ్యా ప్తంగా నెలకొన్న పలు రహదారి సమస్యలకు ఇది పరి ష్కారం చూపదు కూడా.
2005 జనవరి 13న నాటి ప్రధాని నేతృత్వంలో ఉన్న, మౌలిక సౌకర్యాల కల్పనపై కేబినెట్ కమిటీ ఆదే శాల మేరకు రోడ్డు భద్రత, నిర్వహణపై ఒక నిపుణుల కమిటీ ఏర్పడింది. రోడ్డు భద్రత విషయంలో వివిధ దేశాల్లో అత్యున్నత స్థాయిలో రాజకీయ చిత్తశుద్ధి ఉం దని ఈ కమిటీ తన అధ్యయనంలో కనుగొంది. రోడ్డు భద్రతకు సంబంధించిన అన్ని అంశాల పరిష్కారానికి పూర్తి బాధ్యత వహించే ఏకైక సంస్థ ఏ దేశంలోనూ లేదని ఆ అధ్యయనం తెలిపింది. రోడ్డు ప్రమాదాలకు చెందిన నేరస్థ స్వభావాన్ని నివారించాలని, నిబద్ధ హైవే పోలీసును, రోడ్డు భద్రత నిధిని, సమర్థ నిర్వహణను కమిటీ ప్రతిపాదించింది.
అయితే ప్రస్తుత ప్రతిపాదిత బిల్లులో మెడికో- లీగల్ కేసుల సమస్యను ఏమాత్రం ప్రస్తావించలేదు. జాతీయ రహదారులపై కీలకమైన ఆ గంట సమయం లో తీసుకోవలసిన తక్షణ చర్యలను నిర్వచించినప్పటికీ ఇతర రహదారుల ఊసు ఈ బిల్లులో లేదు. పైగా ప్రమా దకరమైన వస్తువులను, సరకులను తీసుకువెళుతున్న పెట్రోలియం, రసాయనాల టాంకర్లకు పబ్లిక్ లయబి లిటీ ఇనూరెన్స్ యాక్ట్ 1991 కింద బీమా సౌకర్యం కల్పించాలని ప్రస్తుత బిల్లు ప్రతిపాదించిందే కానీ అలాంటి వాహనాలు కలిగిస్తున్న ప్రమాదాల బారిన పడిన ప్రజలను గాలికొదిలేసింది. పైగా వాహనాల నుం చి వచ్చే వాయు, శబ్ద కాలుష్యం గురించి పేర్కొనడమే తప్ప, సహజ వనరులను దెబ్బతీస్తున్న వాహనాల కాలు ష్యం గురించి ప్రస్తావించలేదు.
ఈ బిల్లుపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. ప్రధానంగా నిరక్షరాస్యులు నడుపుతున్న సరుకు రవా ణా రంగానికి సంబంధించి ఈ బిల్లు మరింత స్పష్టతను ఇవ్వాల్సి ఉంది. భారతీయ ఆర్థికవ్యవస్థలో ప్రాధాన్యం ఉన్న ఈ రంగాన్ని అహేతుకమైన రీతిలో ఇబ్బంది పెట్ట కూడదు. అదే సమయంలో ఉద్యోగాల కల్పనకు వీలు కల్పిస్తున్న ఏక వాహన యజమానులు, చిన్న స్థాయి రవాణాదారులకు భద్రతకు ఈ బిల్లు హామీ ఇవ్వాలి. పైగా ప్రభుత్వ నిధులపై భారాన్ని తగ్గించాలి కూడా.
(వ్యాసకర్త ప్రభుత్వ విధాన నిపుణులు)
ఈమెయిల్: nreddy.donthi@gmail.com