doctor certificate
-
రోగాలను బట్టి పీజీ మెడికల్ సీట్లు!
సాక్షి, హైదరాబాద్: ఆయా ప్రాంతాల్లో వ్యాధులు.. రోగుల సంఖ్య..అందుతున్న వైద్య సేవలను బట్టి మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు కేటాయించాలని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిర్ణయించింది. అంటే ఏ ప్రాంతంలో ఎలాంటి రోగాలున్నాయో, ఆయా ప్రాంతాల్లోని మెడికల్ కాలేజీలకు ఆయా స్పెషాలిటీల్లో పీజీ మెడికల్ సీట్లు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ మేరకు కొత్త పీజీ మెడికల్ ముసాయిదాను విడుదల చేసింది. దీని ప్రకారం.. మెడికల్ కాలేజీలో సంబంధిత స్పెషాలిటీ వైద్యంలో ఔట్ పేషెంట్ (ఓపీ)ల సంఖ్య 50కి తగ్గకుండా ఉంటేనే రెండు ఎండీ లేదా ఎంఎస్ సీట్లను ఎన్ఎంసీ మంజూరు చేస్తుంది. ఉదాహరణకు ఒక మెడికల్ కాలేజీకి రెండు పీడియాట్రిక్ సీట్లు కావాలంటే సంబంధిత కాలేజీలో రోజుకు చిన్న పిల్లల ఓపీ కనీసం 50 ఉండాలి. ఒక ఆపరేషన్ థియేటర్ 24 గంటలు పనిచేస్తేనే రెండు పీజీ అనస్తీషియా సీట్లు ఇస్తారు. వారానికి 20 ప్రసవాలు జరిగితేనే రెండు గైనిక్ సీట్లు ఇస్తారు. ఇక సంబంధిత స్పెషాలిటీలో అదనంగా మరో సీటు కావాలంటే 20 శాతం ఓపీ పెరగాలి. సూపర్ స్పెషాలిటీకి సంబంధించి రెండు సీట్లు కేటాయించాలంటే ఆయా సూపర్ స్పెషాలిటీ విభాగంలో రోజుకు 25 ఓపీ ఉండాలి. పడకల్లో 75% ఆక్యుపెన్సీ ఉండాలి ఎన్ఎంసీ మరికొన్ని కొత్త నిబంధనలను కూడా ముసాయిదాలో చేర్చింది. మెడికల్ కాలేజీల్లోని స్పెషాలిటీ పడకల్లో 75 శాతం ఆక్యుపెన్సీ ఉండాలి. అల్ట్రా సౌండ్లు రోజుకు 30 జరగాలి. 10 సీటీ స్కాన్లు చేయాలి. రోజుకు మూడు ఎంఆర్ఐ స్కాన్లు తీయాలి. రోజుకు 15 శాతం మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించాలి. గతంలో ఇలాంటి నిబంధనలు లేవు. సంబంధిత స్పెషాలిటీలో నిర్ణీత ఓపీ సంఖ్యతో సంబంధం లేకుండా మౌలిక సదుపాయాలు, సర్జరీలు, అన్ని రకాల ఓపీలు, ఐపీలు, బ్లడ్ బ్యాంకు నిర్వహణ, సీటీ స్కాన్, ఎంఆర్ఐ యంత్రాలు ఉన్నాయా లేవా? వంటివి మాత్రమే చూసి సీట్లు ఇచ్చేవారు. ఇప్పుడు ప్రధానంగా ఓపీని ప్రామాణికంగా తీసుకొని ఇవ్వాలని నిర్ణయించారు. ఐసీఎంఆర్ ఆన్లైన్ కోర్సులు చదవాలి ఎండీలో కొత్తగా 3 కోర్సులను ఎన్ఎంసీ చేర్చింది. ప్రజా రోగ్యం, బయో ఫిజిక్స్, లేబొరేటరీ మెడిసిన్లను ప్రవేశపెట్టింది. అలాగే సూపర్ స్పెషాలిటీలో ఉండే చిన్న పిల్లల గుండె, రక్తనాళాల కోర్సులను ఎత్తివేసి, సాధారణ గుండె, ఛాతీ, రక్తనా ళాల సర్జరీలో చేర్చింది. సూపర్ స్పెషాలిటీలో ఉన్న ఛాతీ శస్త్రచి కిత్స కోర్సును ఎత్తివేసి సాధారణ గుండె శస్త్రచికిత్సలో కలి పేసింది. అలాగే 11 పోస్ట్ డాక్టర్ సర్టిఫికెట్ కోర్సులు ప్రవేశపె ట్టింది. అవయవ మార్పిడి అనెస్తీషియా, పీడియాట్రిక్ ఎండోక్రైనాలజీ, లేబొరేటరీ ఇమ్యునాలజీ, న్యూక్లియర్ నెఫ్రాలజీ, రీనాల్ పెథాలజీ, గ్యాస్ట్రో రేడియాలజీ, రక్తమార్పిడి థెరపీ, పెయిన్ మేనేజ్మెంట్, హిమటో ఆంకాలజీ, పీడియాట్రిక్ ఈ ఎన్టీ, స్పైన్ సర్జరీ కోర్సులు ప్రవేశపెట్టారు. పీజీ అయిపో యిన వారు ఈ కోర్సులను చేసే సదుపాయం కల్పించారు. ప్రతి పీజీ విద్యార్థి మొదటి ఏడాది ఐసీఎంఆర్ నిర్వహించే ఆన్ లైన్ కోర్సులు తప్పనిసరిగా చదవాలి. ఈ ముసాయిదా లోని అంశాలపై అభ్యంతరాలను 15లోగా తెలియజేయాలన్నారు. ఇలా అయితేనే ఉపయోగం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు దాదాపు అన్ని జిల్లాలకు విస్తరించాయి. అందువల్ల ఆయా మెడికల్ కాలేజీల్లో పీజీ మెడికల్ సీట్లను స్థానిక రోగాలను బట్టి కేటాయిస్తేనే ఉపయోగం ఉంటుంది. ఎన్ఎంసీ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో శాస్త్రీయ మైనది. ఆయా ప్రాంతాల రోగులకు సంబంధిత వైద్యం అందుబాటులోకి వస్తుంది. – డాక్టర్ కిరణ్ మాదల,ఐఎంఏ సైంటిఫిక్ కన్వీనర్, తెలంగాణ -
బూస్టర్‌కు డాక్టర్ సర్టిఫికెట్ అక్కర్లేదు
న్యూఢిల్లీ: అరవై ఏళ్లు పైబడి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు బూస్టర్ డోసు (ప్రికాషన్ డోసు)ను తీసుకొనేటపుడు.. తమ ఆరోగ్య స్థితిని తెలియజేయడానికి ఎలాంటి డాక్టర్ సర్టిఫికెట్‌ను చూపించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది. 15–18 ఏళ్ల మధ్యనున్న టీనేజర్లకు కోవిడ్–19 వ్యాక్సినేషన్, వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసు ఇచ్చేందుకు వీలుగా జరుగుతున్న ఏర్పాట్లపై రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ మంగళవారం వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించారు. టీనేజర్లకు వ్యాక్సినేషన్ జనవరి 3 నుంచి ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. అలాగే బూస్టర్‌డోసును జనవరి 10 తేదీ నుంచి ఇస్తారు. ఈ రెండు కేటగిరీల్లో వారికి విధివిధానాలను వివరిస్తూ రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు లేఖ రాశారు. అందులోని ముఖ్యాంశాలు... ► 60 ఏళ్లు పైబడి అనారోగ్య సమస్యలున్న వారు బూస్టర్ డోసు కోసం డాక్టర్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన/ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ► వీరు బూస్టర్ తీసుకొనే ముందు తమ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవాలి. ► ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందిని కూడా ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా పరిగణిస్తారు. వీరు కూడా బూస్టర్ డోసుకు అర్హులు. అందరిలాగే రెండోడోసు తీసుకున్న 9 నెలలు/ 39 వారాల తర్వాత బూస్టర్ తీసుకోవచ్చు. ► టీనేజర్ల కోసం ప్రత్యేకంగా కొన్ని టీకా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఇప్పుడున్న టీకా కేంద్రాల్లో కొన్నింటిని టీనేజర్ల కోసమే ప్రత్యేకంగా ఎంపిక చేసే అవకాశం రాష్ట్రాలకు ఉంది. ► వయోజనులకు టీకాలు వేస్తున్న రెగ్యులర్ కేంద్రాల్లోనూ టీనేజర్లు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. వారికి ప్రత్యేక క్యూలైన్‌ను ఏర్పాటు చేయాలి. కోవాగ్జిన్, కోవిషీల్డ్‌లు మిక్స్ కాకుండా ఉండేందుకే ఈ ఏర్పాటు. ► టీనేజర్లు జనవరి 1 నుంచి కోవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదా 3వ తేదీ నుం చి నేరుగా కేంద్రాలకు వెళ్లి అన్సైట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తొలిడోసు తీసుకొన్న 28 రోజుల తర్వాత రెండోడోసు తీసుకోవచ్చు. ► టీనేజర్లకు ఇవ్వడానికి ప్రస్తుతం ఒక్క కోవాగ్జిన్ మాత్రమే అందుబాటులో ఉన్నందువల్ల... దీని సరఫరా షెడ్యూల్‌ను రాష్ట్రాలకు త్వరలో కేంద్రం తెలియజేస్తుంది. -
డాక్టరు పట్టాకు రూ. 25 వేలు?
ఒంగోలు సెంట్రల్: ఒంగోలు రిమ్స్‌లో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పాస్ అవ్వాలంటే కనీసం రూ. 25 వేలు ఇవ్వాలంటూ సర్జరీ విభాగంకు చెందిన ప్రొఫెసర్ బేరం పెట్టాడు. దీంతో విద్యార్థులు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, హెల్త్ యూనివర్సిటీ అధికారులు, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే డైరెక్టర్ దృష్టికి కూడా వెళ్లడంతో గురువారం విద్యార్థులను పిలిపించి విచారణ నిర్వహించారు. ఈ నెల 16 నుంచి ఫైనల్ ఇయర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. దీంతో ప్రొఫెసర్ బేరాలకు దిగాడు. గతంలో మాదిరిగా రూ. 10 వేలు ఇస్తే కుదరదని రూ. 25 వేలు చెల్లించాల్సిందేనని పట్టు బట్టాడు. ఎగ్జామినర్లకు వసతి, భస, భోజనం, విందు వంటి ఖర్చులకు ఈ డబ్బు వాడతామని చెప్పాడు. ఇదే వ్యవహారంలో గతంలో రూ. 10 వేలు చొప్పున వసూలు చేసిన రిమ్స్ అధికారులు ఏకంగా భారతీయ వైద్య మండలి అధికారుల విచారణనే ఎదుర్కొనాల్సి వచ్చింది. అయినప్పటికీ ప్రొఫెసర్ల తీరు మారలేదు. కాగా రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మస్తాన్ సాహెబ్‌కు విషయం తెలియడంతో విద్యార్థులతో మాట్లాడారు. అయితే ఈ విషయాన్ని బహిర్గతం చేసేందుకు విద్యార్థులు భయపడినట్లు సమాచారం. డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు: డాక్టర్ మస్తాన్, రిమ్స్ డైరెక్టర్ రిమ్స్‌లో ఎంబీబీఎస్ విద్యార్థులు ఎవరికీ డబ్బు చెల్లించాల్సిన అవసరంలేదు. బాగా చదువుకుని పరీక్షలు రాయాలి. ఎవరైనా ఇలాంటి వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఓ ప్రొఫెసర్‌పై ఆరోపణలు రావడంతో విద్యార్థులను విచారించాం. ఓ హోటల్‌తో ఎంఓయూ ఒంగోలు నగరం 60 అడుగుల రోడ్డులోని ఓ హోటల్‌తో ఎంఓయూ కుదుర్చుకున్నట్లు రిమ్స్ డైరెక్టర్ తెలిపారు. రిమ్స్‌కు వచ్చే ఎక్స్టర్నల్ ఎగ్జామినర్లు ఈ హోటల్లో బస చేయవచ్చని, దీనికి సంబంధించిన బిల్లులను రిమ్స్ నుంచి చెల్లిస్తామన్నారు. విద్యార్థుల మీద భారం పడకూడదని ఈ నిర్ణయిం తీసుకున్నట్లు తెలిపారు. -
ఏ సర్టిఫికేట్స్ లేకుండానే పీఎఫ్ విత్ డ్రా
న్యూఢిల్లీ : నాలుగు కోట్ల మంది ఈపీఎఫ్ సభ్యులకు రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అనారోగ్యం పాలైనప్పుడు చికిత్సకు అవసరమయ్యే నగదు కోసం ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్ లేకుండానే ఈపీఎఫ్ అకౌంట్ నుంచి ఫండ్స్ విత్ డ్రా చేసుకోవచ్చని ఈపీఎఫ్ఓ పేర్కొంది. దివ్యాంగులు కూడా పరికరాలు కొనుక్కోవడానికి ఎలాంటి మెడికిల్ సర్టిఫికేట్ ఇవ్వాల్సినవసరం లేదని, నగదు విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 1952ను సవరించినట్టు ప్రకటించింది. ఇన్నిరోజులు అనారోగ్యం పాలైనప్పుడు చికిత్స కోసం, అంగవైకల్యం వారు పరికరాలు కొనుకునేందుకు ఈపీఎఫ్ ఫండ్ విత్ డ్రాకు పలు సర్టిఫికేట్లు సమర్పించాల్సి ఉండేది. ప్రస్తుతం కాంపొజిట్ ఫామ్ తో సెల్ఫీ డిక్లరేషన్ ఇచ్చి ఈపీఎఫ్ అకౌంట్ నుంచి నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 1952లోని క్లాస్ 68-జే, 68-ఎన్ లకు కార్మిక మంత్రిత్వ శాఖ సవరణ చేసిందని, నాన్-రిఫండబుల్ అడ్వాన్సులను వైద్య చికిత్స కోసం తీసుకునేలా అవకాశం కల్పిస్తున్నట్టు ఓ సీనియర్ అధికారి చెప్పారు. ప్రస్తుతం పేరా 68-జే కింద వైద్య చికిత్స కోసం ఈపీఎఫ్ సభ్యులు అడ్వాన్స్ ను కోరవచ్చు. అదేవిధంగా పేరా 68-ఎన్ కింద అంగవైకల్యం కలవారు పరికరాలు కొనుక్కునేందుకు నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. 2017 ఏప్రిల్ 25న చేపట్టిన సవరణతో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ నోటిఫికేషన్ జారీచేసిందని అధికారి పేర్కొన్నారు.