దళారుల గుప్పిట్లో నేపాల్ వలసదారులు
నేపాల్ భూకంపం ఇంకా అక్కడ ప్రజలను పీడకలలా వెంటాడుతూనే ఉంది. గత ఏడాది ఏప్రిల్ 25న సంభవించిన భూకంప
ప్రకంపనలు వారిని వీడటం లేదు. ఈ ఘటనలో దాదాపు 9,000మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.అయితే
భూకంపంలో సర్వం కోల్పోయి...తినేందుకు తిండిలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భారత్‌లోని పంజాబ్ కు వలస వచ్చినవారిని
స్థానిక దళారులు బానిసలుగా మార్చి అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నారు.ముఖ్యంగా పదేళ్లలోపు చిన్నారులను బ్రిటీష్
కుటుంబాలకు వీరిని బానిసలుగా విక్రయిస్తున్నారు.
'రండి..నేపాలీలు మంచి పనిమంతులు. చక్కని,రుచి కరమైన వంటలు తయారు చేస్తారు.ఇంటి పనులు నేపాలీలు చేసినంత
చక్కగా మరెవ్వరూ చేయలేరు. వీరిని ఇంగ్లండ్‌లోని మీ ఇంటికి తీసుకువెళ్లండంటూ' దళారులు.. చిన్నారులను విక్రయానికి
పెడుతున్నారు. ఓ బాలుడిని బ్రిటన్‌కు పంపేందుకు దళారులకు సుమారు రూ.5లక్షలు ముడుతుంది.కాగా కొనుగోలు చేసిన
చిన్నారిని తీసుకెళ్లేందుకు మిగిలిన ఖర్చులన్నీ కొనుగోలుదారే భరించాల్సి ఉంటుంది.
నేపాలీ వలసదారుల అక్రమ రవాణాపై హోం శాఖ కార్యదర్శి థెరిస్పా స్పందిస్తూ.. వలసదారుల అక్రమ రవాణాపై విచారణ
జరపాల్సిందిగా జాతీయ నేర పరిశోధనా సంస్థను ఆదేశాలు ఇచ్చారు.పిల్లల సంరక్షణకు ప్రభుత్వం గత ఏడాది తీసుకువచ్చిన మోడరన్
స్లేవరీ యాక్ట్‌ను ఆయన ప్రస్తావిస్తూ ఈ చట్టం కింద నేరం రుజువైతే నిందితులకు జీవత ఖైదు పడుతుందన్నారు.