donti madhava reddy
-
ఏఐసీసీ మీటింగ్.. పీసీసీపై ఎమ్మెల్యే ఫైర్
-
ఏఐసీసీ మీటింగ్.. పీసీసీపై ఎమ్మెల్యే ఫైర్
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని గాంధీభవన్‌లో నేడు ఏఐసీసీ కార్యదర్శుల సమావేశం కొనసాగుతోంది. మూడు విడతలుగా ముగ్గురు ఏఐసీసీ సెక్రటరీల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. పార్లమెంట్ ఇంచార్జ్‌లు, అసెంబ్లీ ఇంచార్జ్‌లు, డీసీసీ అధ్యక్షులు, కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు, సీనియర్ నేత జానారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఏఐసీసీ సమావేశంలో ముందస్తు ఎన్నికలు, పార్టీ బలోపేతం, శక్తి యాప్‌లపై తీవ్రంగా చర్చించారు. ఈ సమావేశ తీరుపై టీ కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏఐసీసీ సమావేశానికి సీనియర్లు, సిటింగ్ ఎమ్మెల్యేలు హాజరుకాలేదని సమాచారం. టీపీసీసీపై నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఫైర్ అయ్యారు. అంతేకాక కత్తి వెంకటస్వామిని నర్సంపేట కాంగ్రెస్ నేతగా పరిచయం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం నాలుగు వేల ఒట్లు తెచ్చుకొని నేతను నాతో సమానమైన హోదా కల్పిస్తారా అని మాధవ రెడ్డి మండిపడ్డారు. మాధవ రెడ్డి ఆగ్రహంతో పీసీసీపైకి దూసుకెళ్లారు. నీ వల్లె పార్టీ నాశనం అవుతుందని అంటూ తీవ్ర పీసీసీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి మాట్లాడుతూ.. కొత్తగా నియమితులైన ముగ్గురు సహాయ ఇంచార్జీలకు పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించామన్నారు. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా పార్టీ పరిస్థితిని సమీక్షించామని తెలిపారు. బూత్, మండల, జిల్లా కమిటీలను జూలై 10లోపు పూర్తి చేయాలని నిర్ణయించాం. జూలై 1 నుంచి 15లోపు సహాయ ఇంచార్జీలు వారికి కేటాయించిన జిల్లాలో సమావేశాలు నిర్వహిస్తారు. క్షేత స్థాయి పార్టీ పరిస్థితులపై నేతల అభిప్రాయం పీసీసీ తీసుకుందన్నారు. మరో మూడు నాలుగు రోజులు సహాయ ఇంచార్జ్‌లు వారికి కేటాయించిన నియోజకవర్గ నేతలతో సమాలోచనలు చేస్తారు. మీటింగ్‌కు హాజరుకాని సీనియర్లు పెళ్ళిళ్ళ కారణంగా రాలేకపోతున్నామని పీసీసీకి వివరణ ఇచ్చారని తెలిపారు. -
గెలుపు మాదే
నర్సంపేట : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియాగాంధీ ప్రధాన కారణం అనే భావన ప్రజల్లో బలంగా ఉంది. రానున్న రోజుల్లో ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టం కడతారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 8 చోట్ల భారీ మెజార్టీతో గెలు స్తుంది. మరో నాలుగింట్లో గట్టి పోటీ ఇస్తుంద ని ఏఐసీసీ సభ్యుడు, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ఏఐసీసీ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత మాధవరెడ్డి నర్సంపేటకు మొదటిసారి వచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. కాంగ్రెస్‌పై విశ్వాసం పెరిగింది సోనియాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల కోరికను తీర్చింది. గత ఎన్నికల సమయంలో సోనియాగాంధీ కృషిని ప్రజలు గ్రహించకుండా తీర్పును ఇవ్వడంతో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. హామీలను అమలు చేయకపోవడంతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోయి, కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం పెంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పడతారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నరు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తోంది. బంగారు తెలంగాణగా మారుస్తామంటూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకెళ్తున్నారు. ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించడం లేదు. అప్పులు తీసుకువచ్చి కోట్ల రూపాయలను దండుకుంటున్నారు. కానీ, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం లేదు. కాంగ్రెస్ బలోపేతానికి కృషి సీనియర్ల సహకారంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ముందుకుసాగుతా. 38 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా. సీనియర్ నాయకులు, కింది స్థాయి నాయకులు, కార్యకర్తలతో కలసి గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తా. గొంతు నొక్కుతున్నారు.. సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపారు. నర్సంపేట నియోజకవర్గ ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తే ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అని గొంతు నొక్కేస్తోంది. ఎలాంటి తప్పు చేయకుండానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది. సమస్యలను ప్రస్తావించకుండా గొంతు నొక్కేసే ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణం పాఠం చెప్పే సమయం సైతం ఆసన్నమైంది. నర్సంపేట అభివృద్ధికి ప్రత్యేక కృషి.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష బలంగా ఉంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండడంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయా ంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు సమానంగా నిధులు కేటాయించారు. కానీ, ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం నిధులు సక్రమంగా మంజూరు చేయకపోవడంతో నియోజకవర్గ అభివృద్ధి ఇబ్బందిగా మారింది. వచ్చిన కొద్దిపాటి నిధులను నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కేటాయిస్తూ అభివృద్ధి చేస్తున్నా. రాజకీయ కోణంలో ప్రతిపక్ష పార్టీలకు ని«ధుల కేటాయింపులో పక్షపాతం చూపిస్తున్నరు. నాడు ఉద్యమం గుర్తు లేదా? 1969లో తెలంగాణ ఉద్యమం బలంగా వచ్చింది. ఆ తర్వాత 1977లోనే రాజకీయాల్లోకి వచ్చి కేసీఆర్ మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. పదవి కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్లిన కేసీఆర్‌కు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలనేది గుర్తులేదు. పదవి ఊడిపోయిన తర్వాత రాజకీయంగా భవిష్యత్ లేదనే కారణంతోనే తెలంగాణ రాష్ట్రం కావాలని నినాదంతో ఉద్యమం చేపట్టారు. అయితే 1977లో ఎందుకు ఉద్యమించలేదు. కేవలం కేసీఆర్ ఉద్యమిస్తేనే కాదు, అన్ని కుల సంఘాలు, అన్ని రాజకీయా పార్టీలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమించాయి. సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే నేడు తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోంది. -
అటు రెడ్యా.. ఇటు దొంతి
ఒకే రోజు పార్టీ మారిన ఎమ్మెల్యేలు సాక్షి ప్రతినిధి, వరంగల్ : నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో మొదటి నుంచి దూరంగా ఉంటున్న మాధవరెడ్డి.. పొన్నాలతో సంబంధం లేకుండానే కాంగ్రెస్‌లో చేరారు. ఢిల్లీలో ఏఐ సీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీలను మంగళవారం ఆయన కలిశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్, పరిశీలకుడు కుంతియా.. మాధవరెడ్డిని కాంగ్రెస్ అగ్రనేతల వద్దకు తీసుకెళ్లారు. అంతకుముందు దిగ్విజయ్‌సింగ్ కాంగ్రెస్ కండువా కప్పి మాధవరెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. మాజీ మంత్రులు బస్వరాజు సారయ్య, పోరిక బలరాంనాయక్, మాజీ ఎంపీ జి.వివేక్, పరకాల నియోజకవర్గ ఇన్చార్జి ఇనుగాల వెంకట్రాంరెడ్డిలు ఢిల్లీలో మాధవరెడ్డి వెంట ఉన్నారు. పీఏసీ చైర్మనా? డీసీసీ అధ్యక్ష పదవా? మాధవరెడ్డి తెలంగాణ శాసనసభలో ఏకైక స్వతంత్ర ఎమ్మెల్యే. కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుసగా పార్టీని వీడుతున్న నేపథ్యంలో దొంతి మాధవరెడ్డి హస్తం పార్టీలో చేరడం చర్చనీయాం శంగా మారింది. కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పార్టీలో చేరిన మాధవరెడ్డికి ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉందని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వకుంటే.. డీసీసీ అధ్యక్ష పదవిని మళ్లీ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ను వీడే సమయంలో తనకు ఉన్న హోదాను మళ్లీ ఇవ్వాలని మాధవరెడ్డి పట్టుదలగా ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్న మాధవరెడ్డి.. తనకు టిక్కెట్ నిరాకరించి, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌లో చేరడం చర్చనీయాంశంగా మారింది. ‘పొన్నాల’తో దూరమే.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు, డీసీసీ మాజీ అధ్యక్షుడు మాధవరెడ్డికి మొదటి నుంచి అంతరం ఉంది. ‘దొంతి’ ప్రస్తుత కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డికి దగ్గరగా ఉంటున్నారు. సాధారణ ఎన్నికల ముందు వరకు మాధవరెడ్డి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. కాంగ్రెస్ అధిష్టానం సాధారణ ఎన్నికల్లో ఆయనకు నర్సంపేట ఎమ్మెల్యే టిక్కెట్ ప్రకటించింది. తెలంగాణ ఉద్యమంలో పని చేసిన సంఘాల నాయకులు అవకాశం అంటూ ఒక్క రోజులోనే ఆయన స్థానంలో కత్తి వెంకటస్వామికి నర్సంపేట కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఇచ్చారు. పొన్నాల లక్ష్మయ్య కారణంగానే తనకు ఖరారైన టిక్కెట్‌ను తొలగించారని మాధవరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఇదే సమయంలో ‘పొన్నాల’ ఎన్నికల్లో ఓడిపోయారు. టీఆర్ఎస్ ముఖ్య నేతలు పలువురు అప్పుడే దొంతి మాధవరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన టీఆర్ఎస్లో చేరలేదు. అనంతరం జరిగిన జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో మాధవరెడ్డి కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యుల క్యాంప్ నిర్వహించారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన క్యాంపులో పార్టీ సభ్యులు ఎలా ఉంటారనే ఉద్దేశంతో కొందరు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ సభ్యుల మద్దతుతో టీఆర్ఎస్ జెడ్పీ చైర్మన్ పదవి దక్కించుకుంది. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య మాధవరెడ్డి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించలేదని హస్తం పార్టీ నేతలు చెబుతుంటారు. మాధవరెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపలేదు. కాంగ్రెస్ జిల్లాలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే రెడ్యానాయక్ టీఆర్ఎస్లో చేరుతుండడంతో ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు మాధవరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. కారెక్కిన రెడ్యానాయక్, కవిత.. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కాంగ్రెస్‌తో సుధీర్ఘ అనుబంధాన్ని తెంచుకున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో రెడ్యానాయక్‌కు, మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవితకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాల కాంగ్రెస్ నేతలు వీరితోపాటే కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. డోర్నకల్ నియోజకవర్గంలో రెడ్యానాయక్‌తో సమానంగా సత్యవతిరాథోడ్‌కు అవకాశాలు కల్పిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ చెప్పారు. రెడ్యానాయక్, సత్యవతిరాథోడ్ కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధికి, టీఆర్ఎస్ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపెల్లి రవీందర్రావు, జిల్లా ఇన్చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, ఎమ్మెల్యేలు బానోత్ శంకర్‌నాయక్, దాస్యం వినయభాస్కర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, అరూరి రమేశ్, డోర్నకల్ నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడ్, నూకల నరేశ్‌రెడ్డి తదితర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికాలో ‘కడియం’ వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ముఖ్య కార్యవర్గ సమావేశం ఈ నెల 14, 15వ తేదీల్లో వర్జీనియాలో జరగనుంది. కడియం శ్రీహరి ఈ సమావేశాల్లో పాల్గొంటారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వచ్చే ఏడాది జులైలో అమెరికాలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. సీఎం కేసీఆర్ ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని కడియం తెలిపారు. బహిరంగ సభ ఏ విధంగా నిర్వహించాలనేది 14, 15వ తేదీల్లో జరిగే సమావేశాల్లో చర్చించనున్నారు.