అటు రెడ్యా.. ఇటు దొంతి
ఒకే రోజు పార్టీ మారిన ఎమ్మెల్యేలు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో మొదటి నుంచి దూరంగా ఉంటున్న మాధవరెడ్డి.. పొన్నాలతో సంబంధం లేకుండానే కాంగ్రెస్‌లో చేరారు. ఢిల్లీలో ఏఐ సీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీలను మంగళవారం ఆయన కలిశారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, పరిశీలకుడు కుంతియా.. మాధవరెడ్డిని కాంగ్రెస్ అగ్రనేతల వద్దకు తీసుకెళ్లారు. అంతకుముందు దిగ్విజయ్‌సింగ్ కాంగ్రెస్ కండువా కప్పి మాధవరెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. మాజీ మంత్రులు బస్వరాజు సారయ్య, పోరిక బలరాంనాయక్, మాజీ ఎంపీ జి.వివేక్, పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనుగాల వెంకట్రాంరెడ్డిలు ఢిల్లీలో మాధవరెడ్డి వెంట ఉన్నారు.
పీఏసీ చైర్మనా? డీసీసీ అధ్యక్ష పదవా?
మాధవరెడ్డి తెలంగాణ శాసనసభలో ఏకైక స్వతంత్ర ఎమ్మెల్యే. కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుసగా పార్టీని వీడుతున్న నేపథ్యంలో దొంతి మాధవరెడ్డి హస్తం పార్టీలో చేరడం చర్చనీయాం శంగా మారింది. కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పార్టీలో చేరిన మాధవరెడ్డికి ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉందని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వకుంటే.. డీసీసీ అధ్యక్ష పదవిని మళ్లీ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ను వీడే సమయంలో తనకు ఉన్న హోదాను మళ్లీ ఇవ్వాలని మాధవరెడ్డి పట్టుదలగా ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్న మాధవరెడ్డి.. తనకు టిక్కెట్ నిరాకరించి, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌లో చేరడం చర్చనీయాంశంగా మారింది.
‘పొన్నాల’తో దూరమే..
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు, డీసీసీ మాజీ అధ్యక్షుడు మాధవరెడ్డికి మొదటి నుంచి అంతరం ఉంది. ‘దొంతి’ ప్రస్తుత కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డికి దగ్గరగా ఉంటున్నారు. సాధారణ ఎన్నికల ముందు వరకు మాధవరెడ్డి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. కాంగ్రెస్ అధిష్టానం సాధారణ ఎన్నికల్లో ఆయనకు నర్సంపేట ఎమ్మెల్యే టిక్కెట్ ప్రకటించింది. తెలంగాణ ఉద్యమంలో పని చేసిన సంఘాల నాయకులు అవకాశం అంటూ ఒక్క రోజులోనే ఆయన స్థానంలో కత్తి వెంకటస్వామికి నర్సంపేట కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఇచ్చారు.
పొన్నాల లక్ష్మయ్య కారణంగానే తనకు ఖరారైన టిక్కెట్‌ను తొలగించారని మాధవరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఇదే సమయంలో ‘పొన్నాల’ ఎన్నికల్లో ఓడిపోయారు. టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు పలువురు అప్పుడే దొంతి మాధవరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన టీఆర్‌ఎస్‌లో చేరలేదు. అనంతరం జరిగిన జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో మాధవరెడ్డి కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యుల క్యాంప్ నిర్వహించారు.
కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన క్యాంపులో పార్టీ సభ్యులు ఎలా ఉంటారనే ఉద్దేశంతో కొందరు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ సభ్యుల మద్దతుతో టీఆర్‌ఎస్ జెడ్పీ చైర్మన్ పదవి దక్కించుకుంది. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య మాధవరెడ్డి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించలేదని హస్తం పార్టీ నేతలు చెబుతుంటారు. మాధవరెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపలేదు. కాంగ్రెస్ జిల్లాలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే రెడ్యానాయక్ టీఆర్‌ఎస్‌లో చేరుతుండడంతో ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు మాధవరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు.
కారెక్కిన రెడ్యానాయక్, కవిత..
డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కాంగ్రెస్‌తో సుధీర్ఘ అనుబంధాన్ని తెంచుకున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో రెడ్యానాయక్‌కు, మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవితకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాల కాంగ్రెస్ నేతలు వీరితోపాటే కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. డోర్నకల్ నియోజకవర్గంలో రెడ్యానాయక్‌తో సమానంగా సత్యవతిరాథోడ్‌కు అవకాశాలు కల్పిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ చెప్పారు.
రెడ్యానాయక్, సత్యవతిరాథోడ్ కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధికి, టీఆర్‌ఎస్ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపెల్లి రవీందర్‌రావు, జిల్లా ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, ఎమ్మెల్యేలు బానోత్ శంకర్‌నాయక్, దాస్యం వినయభాస్కర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, అరూరి రమేశ్, డోర్నకల్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ నేతలు సత్యవతి రాథోడ్, నూకల నరేశ్‌రెడ్డి తదితర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అమెరికాలో ‘కడియం’
వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం ముఖ్య కార్యవర్గ సమావేశం ఈ నెల 14, 15వ తేదీల్లో వర్జీనియాలో జరగనుంది. కడియం శ్రీహరి ఈ సమావేశాల్లో పాల్గొంటారు. తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం వచ్చే ఏడాది జులైలో అమెరికాలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. సీఎం కేసీఆర్ ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని కడియం తెలిపారు. బహిరంగ సభ ఏ విధంగా నిర్వహించాలనేది 14, 15వ తేదీల్లో జరిగే సమావేశాల్లో చర్చించనున్నారు.