అన్ని వర్గాలకు దగా
చేవెళ్ల: టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. చేవెళ్లలో గురువారం నియోజకవర్గస్థాయి పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ప్రభుత్వ దిష్టిబొమ్మలు కాల్చాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే 2013-14కు చెందిన రుణాలనే మాఫీ చేస్తామని ప్రకటించడం అన్యాయమన్నారు.
దీంతో రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. దళితులకు మూడెకరాల భూమి, మైనార్టీలు, ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్లు, పేదలందరికీ అన్ని హంగులతో మంచి ఇళ్లు, లక్షలోపు వ్యవసాయ రుణాలు, నాణ్యమైన విద్యుత్ సరఫరా అంటూ ఊరించి మోసం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ శాసనసభా పక్షనేత జానారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ పూర్వవైభవాన్ని సంతరించుకుంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రజలకు ప్రలోభాలు, మభ్యపెట్టడంతోనే టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
మాజీ హోంమంత్రి పి.సబితారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే యాదయ్య పార్టీ మారినంత మాత్రాన కార్యకర్తలు, నాయకులు అధైర్యపడవద్దని చెప్పారు. కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లలిత, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.