రాజకీయాలు మాని అభివృద్ధికి సహకరించండి
లింగాలఘణపురం : పదేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అభివృద్ధిని పట్టించుకోని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు వంద రోజుల టీఆర్‌ఎస్ పాలనపై విమర్శలు గుప్పించ డం విడ్డూరంగా ఉంది.. రాజకీయాలు మాని అభివృద్ధికి కలిసి రావాలని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తాటికొండ రాజయ్య హితవు పలికారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే సూర్యుడిపై ఉమ్మి వేసినట్లేనని అన్నారు. సోమవారం నెల్లుట్ల సమీపంలోని ఎన్‌ఎంఆర్ గార్డెన్‌లో పార్టీ మండల స్థాయి విస్తృత స్థాయి సమావేశం అనంతరం ప్రజాప్రతినిధుల పౌరసన్మానం జరిగింది.
కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డిప్యూటీ సీఎం రాజయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అంకిత భావంతో కృషి చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాల కాలంలో పంటలు నష్టపోయిన రైతులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.480కోట్లు విడుదల చేసిందని, 40లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తోంద ని చెప్పారు. స్వరాష్ట్రం కోసం బలైన అమరుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇచ్చి ఆదుకోవడంతోపాటు దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేసి వారి అభ్యున్నతికి తోడ్పాటునందిస్తోందని వివరించారు.
ఆటో డ్రైవర్లు, ఇతర రవాణా టాక్సీలకు రూ.80కోట్లు మాఫీ, దళితులు, మైనారిటీల వివాహాలకు కల్యాణలక్ష్మి పేరుతో రూ.51వేయి అందజేత, విదేశా ల్లో చదువుకుంటున్న దళితులకు రూ.10 లక్షలు ఆర్థిక సాయం ఇవన్నీ అబద్దాలుగా కనిపిస్తున్నాయా అని ప్రతిపక్ష పార్టీల నాయకులను ప్రశ్నించారు. కేసీఆర్ పాలన చూసి ప్రధానమంత్రి మోడీ మెచ్చుకుంటుంటే కనిపించడంలేదా అని అన్నారు. గవర్నర్ అధికారాలపై సుప్రీం కోర్టుకు వెళ్లింది టీఆర్‌ఎస్ పార్టీయేనని, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు నోరు మెదపలేదని విమర్శించారు.
తెలంగాణ అస్థిత్వం కోసం పోరాడే ఏకైక పార్టీ టీఆర్‌ఎస్.. పార్టీని విమర్శిస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. మండల కన్వీనర్ ఉపేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ పద్మ, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునిత, జనగామ మునిసిపల్ చైర్మన్ ప్రేమలతారెడ్డి, ఎంపీపీ శిరీష, జెడ్పీటీసీ సభ్యుడు రంజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.