Dora movie
-
నయనకే విలనయ్యా!
లేడీసూపర్‌స్టార్ నయనతారకే తాను విలన్ అయ్యానన్న ఆనందంలో మునిగి తేలుతున్నాడు వర్ధమాన నటుడు షాన్. ఈయన నిజంగా చాలా లక్కీఫెలోనే అనాలి. తొలి చిత్రంలోనే బాలీవుడ్ భామ ఇషా తల్వార్‌కు లవర్‌గానూ, ఆ తరువాత ఇంగ్లిష్ బ్యూటీ ఎమీజాక్సన్‌కు బాయ్‌ఫ్రెండ్‌గా నటించాడు. ఇటీవల నయనతారకు విలన్ అయ్యాడు. ఇంకా ఆయనకు గుర్తింపు రాక ఏమవుతుంది. అలా పలువురి ప్రశంసలు అందుకుంటున్న వర్ధమాన నటుడు షాన్ తన గురించి తెలుపుతూ కోవై జిల్లా, పొల్లాచ్చిలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన తాను నటనపై ఇష్టంతో ఆ దిశగా పయనం సాగించానన్నాడు. అలా దర్శకుడు మిత్రన్ జవహర్‌ను కలిసి అడిషన్లో సెలెక్ట్ అయి ఒరు కాదల్ కథై చిత్రం ద్వారా నటుడిగా పరిచయం అయ్యానని తెలిపాడు. అందులో నటి ఇషా తల్వార్ ప్రేమికుడిగా నటించానని అన్నాడు. ఒరు కాదల్ కథై చిత్రంలో నటించిన వేళా విశేషం కావచ్చు ఆ చిత్ర విడుదలకు ముందే ధనుష్ కథానాయకుడిగా నటించిన తంగమగన్ చిత్రంలో ఎమీజాక్సన్‌కు బాయ్‌ఫ్రెండ్‌గా నటించే అవకాశం వచ్చిందన్నాడు. ఆ చిత్రం తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందని చెప్పాడు. ఆ తరువాత డోరా చిత్రంలో నయనతారకు విలన్‌గా నటించే లక్కీఛాన్స్ వచ్చిందన్నాడు. డోరా చిత్రంలో పవనశర్మగా ప్రధాన విలన్ పాత్రలో నటించడం చాలా మంచి అనుభవంగా పేర్కొన్నాడు. నయనతారను చూడడానికే లక్షలాది మంది తపం చేస్తుంటే ఆమెకు విలన్‌గా నటించే అవకాశం రావడం నిజంగా తన అదృష్టం అన్నాడు. డోరా చిత్రం తన స్థాయిని పెంచిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం నవ దర్శకుడు సజోసుందర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో పోలీస్ అగా ప్రధాన పాత్రను పోషిస్తున్నానని తాను విలన్‌గానే స్థిరపడాలని ఆశిస్తున్నానని తెలిపాడు. అలాంటి పాత్రలకే భాషా భేదం లేకుండా ఆదరణ లభిస్తుందని అని నటుడు షాన్ అంటున్నారు. -
దొరలో నయన
రియల్గానైనా, రీల్లోనైనా ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న నటి పేరు నయనతార. ప్రేమ వ్యవహారంలో ప్రకంపనలు పుట్టిస్తున్న ఈ బ్యూటీ నటనాపరంగా సంచలనం కలిగిస్తున్నారు. రీఎంట్రీ తరువాత కూడా టాప్ నాయకిగా వెలుగొందుతున్న అరుదైన నటి నయనతార అనవచ్చు. ఇటు ప్రముఖ కథానాయకులతోనూ ఇటు వర్ధమాన నటులతోనూ నటిస్తూ తన సత్తా చాటుకుంటున్న ఆ కేరళ భామ ప్రస్తుతం కోలీవుడ్‌లో విక్రమ్ సరసన ఇరుముగన్, కార్తీతో కాష్మోరా చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు ఒక లేడి ఓరియెంటెడ్ చిత్రం కూడా చేస్తున్నారు. తెలుగులో వెంకటేశ్‌కు జంటగా బాబు బంగారం చిత్రాన్ని పూర్తి చేశారు. త్వరలో మోహన్‌రాజా దర్శకత్వంలో శివకార్తికేయన్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. అలాగే జయంరవితో మరోసారి జత కట్టనున్నట్లు ప్రచారంలో ఉంది. నయనతార ఇంతకు ముందు నటించిన కథానాయకి ఇతివృత్తంతో కూడిన మాయ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ చిత్ర దర్శకుడు దాస్ దర్శకత్వంలో తాజాగా మరో చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. నటుడు తంబిరామయ్య, హరీష్ఉత్తమ్ ముఖ్య పాత్రలు ధరిస్తున్న ఈ చిత్రానికి వివేక్-మెర్విన్ల ద్వయం సంగీతాన్ని దినేశ్ చాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రానికి దొర అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తాజా సమాచారం. ఇది బుల్లి తెరలో ప్రచారం అవుతున్న ఒక పాపులర్ కార్యక్రమం పేరులోని ఒక భాగం అన్నది గమనార్హం. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. మొత్తం మీద మాయతో ప్రేక్షకులను అలరించిన నయనతార ఈ దొరతో ఏ మేరకు వారి హృదయాలను దోచుకుంటుందో చూద్దాం. -
నా పేరు మర్చిపోయారు!
సత్యరాజ్... అంటే ఎవరు? అని అడిగితే చాలామంది ‘ఎవరాయన?’ అన్నట్లు చూస్తారు. అదే ‘కట్టప్ప’ అని అడగండి... తడుముకోకుండా సమాధానం చెప్పేస్తారు. ‘బాహుబలి’లో చేసిన కట్టప్ప పాత్రతో దేశవ్యాప్తంగా సత్యరాజ్ అభిమానులను సంపాదించుకున్నారు. త్వరలో ఆయన దెయ్యంగా భయపెట్టనున్నారు. సత్యరాజ్, ఆయన తనయుడు శిబిరాజ్ కలసి నటించిన తమిళ హారర్ సినిమా ‘జాక్సన్ దొరై’. దరణీధరన్ దర్శకుడు. నిర్మాత జక్కం జవహర్‌బాబు తెలుగులో ‘దొర’గా అనువదించారు. జులై 1న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా సత్యరాజ్ చెప్పిన విశేషాలు... ► కామెడీ, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో కూడిన పీరియాడికల్ హారర్ మూవీ ‘దొర’. జాక్సన్ అనే బ్రిటీష్ దెయ్యానికీ, దొర అనే ఇండియన్ దెయ్యానికీ మధ్య కథ జరుగుతుంది. నేను ఇండియన్ దెయ్యంగా నటించా. తెలుగు, తమిళంతో సహా ప్రస్తుతం అన్ని భాషల్లోనూ హారర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ధరణీదరన్ చెప్పిన కథ బాగా నచ్చి, ఈ సినిమా ఒప్పుకున్నాను. తొలిసారి దెయ్యం పాత్ర చేశా. ► ఆత్మలు ఇలా ప్రవర్తించాలి, ఇలాగే ఉండాలని రూల్ లేదు కదా! వాటికి ప్రత్యేకమైన మేనరి జమ్స్ ఉంటాయో.. ఉండవో? అందుకే నా స్టయిల్లో దర్శకుడు చెప్పినట్లు నటించాను. ► రాజమౌళి దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం ‘స్టూడెంట్ నెం.1’ తమిళ రీమేక్‌తో మా అబ్బాయి శిబిరాజ్ హీరోగా పరిచయమయ్యాడు. గతంలో శిబీతో కలసి నటించాను. మళ్లీ ‘దొర’లో నటించడం హ్యాపీగా ఉంది. ► ఈతరం దర్శకులు నన్ను, నా నటనను దృష్టిలో పెట్టుకుని పాత్రలు రాస్తున్నా రు. రాజమౌళి, కొరటాల శివ, శ్రీకాంత్ అడ్డాల.. ఇలా ప్రతి ఒక్కరూ విభిన్నమైన పాత్రలు రాయడం వలనే నటుడిగా నన్ను నేను కొత్తగా ఆవిష్క రించుకునే అవకాశం లభించింది. ఓ నటుణ్ణి దృష్టిలో పెట్టుకుని దర్శకులు పాత్రలు రాస్తుంటే గర్వంగా ఉంటుంది. ఇంతకంటే కావల్సింది ఏముంటుంది? ► సుమారు 220 చిత్రాల్లో నటించా. 38 ఏళ్లుగా చిత్రపరిశ్రమలో నటుడిగా కొనసాగుతున్నాను. కానీ, ప్రస్తుతం అందరూ నా పేరు మర్చిపోయి ‘కట్టప్ప’ అని పిలుస్తున్నారు. చిన్నారులు సైతం ‘కట్టప్ప’ అని గుర్తుపడుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ ఘనత దర్శకుడు రాజమౌళిదే. జీవితంలో ఒక్కసారే ఇటువంటి పాత్రలు లభిస్తాయి. ‘బాహుబలి: ది కంక్లూజన్’లో కట్టప్ప పాత్ర ఇంకా బలంగా ఉంటుంది. ► ‘బాహుబలి 2’తో పాటు సంతోష్ శ్రీనివాస్ సినిమాలో రామ్ తండ్రిగా.. తెలుగు ‘పటాస్’లో సాయికుమార్ చేసిన పాత్రను తమిళ రీమేక్‌లో చేస్తున్నాను.