అభివృద్ధి పనులకు అటవీ శాఖ బ్రేక్
వెంకటాపురం,న్యూస్‌లైన్ : ఫిబ్రవరిలో జరగనున్న మేడారం జాతరను పురస్కరించుకుని ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా రూ.12కోట్లతో జంగాలపల్లి నుంచి పాలంపేట(రామప్ప) వరకు నిర్మిస్తున్న డబుల్‌రోడ్డు పనులకు అటవీశాఖ బ్రేక్ వేసింది. పదికిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ రోడ్డు పనులు గత నెలలోనే ప్రారంభమయ్యాయి. పాలంపేట శివారులో జీవవైవిధ్య పరిరక్షణ ప్రాంతంలో ఉన్న రెండు కల్వర్టులను కూల్చేసి రోడ్డును వెడల్పు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా డైవర్షన్ రోడ్డు పనులు చేపట్టేందుకు వారం రోజుల క్రితం కాంట్రాక్టర్ ఆ ప్రాంతంలో మట్టి పోయించాడు. విషయం తెలుసుకున్న ములుగు అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకుని పనులు నిలిపివేయించారు.
జీవవైవిధ్య ప్రాంతంలో ఎలాంటి పనులు చేపట్టరాదంటూ హెచ్చరించారు. దీంతో అక్కడ కల్వర్టు ఎలా నిర్మించాలో తెలియక కాంట్రాక్టర్ కాస్తా పనులు వాయిదా వేశాడు. ప్రస్తుతం జంగాలపల్లి నుంచి రామప్ప పరిధిలోని సోమికాలువ వరకు ఎనిమిది కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా తవ్వకాలు చేపట్టి కంకరతో నింపారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా జీవవైవిధ్య ప్రాంతంలో సుమారు 500మీటర్ల మేర ఇరువైపులా తవ్వకాలు చేపట్టాల్సి ఉంది. అయితే కల్వర్టు నిర్మాణాన్నే అడ్డుకున్న అటవీ అధికారులు విస్తరణ పనులను సైతం అడ్డుకునే అవకాశం ఉండడంతో జాతరలోపు రోడ్డు పనులు పూర్తయ్యేలా కనిపించడం లేదు. మరోవైపు జాతరలోపు డబుల్‌రోడ్డు పనులు పూర్తిచేయాలంటూ అధికారులు ఆదేశిస్తుండడం కాంట్రాక్టర్‌ను కలవరపెడుతోంది.
భక్తులకు ఇబ్బందులే..
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా రామప్ప మినీ మేడారాన్ని తలపిస్తుంది. దేవతలను దర్శించుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో రామప్పను సందర్శిస్తుంటారు. ఒకటి రెండు రోజులు అక్కడే బసచేస్తారు. జాతర సమయంలో రామప్ప పరిసర ప్రాం తాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. గతంలో గణపురం క్రాస్‌రోడ్ నుంచి జంగాలపల్లి వరకు ఉన్న సింగిల్రోడ్డుపై పలుమార్లు ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ప్రస్తుతం ఈ రోడ్డు పనులు విస్తరించకపోతే ట్రాఫిక్ సమస్య తలెత్తి భక్తులు ఇబ్బంది పడే అవకాశం ఉంది.
మిగిలింది ఆరెకరాలే..
కేరళ, ఒడిశా రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలోనే అరుదుగా లభించే విలువైన వృక్ష సంపద పాలంపేట శివారులో ఉంది. 1970లో ఈ ప్రాంతాన్ని జీవవైవిధ్య ప్రాంతంగా ప్రభుత్వం గుర్తించింది. 291 సర్వే నంబర్లోని జీవవైవిధ్య ప్రాంతంలో 52 ఎకరాల్లో విస్తరించి ఉన్న సాపతీగబరిగె(కేన్ మొక్కలు).. అధికారుల నిర్లక్ష్యంతో ప్రస్తుతం ఆరెకరాలకు చేరుకుంది.
అంతేకాక రూ.మూడుకోట్ల విలువ చేసే భూములు సైతం ఆక్రమణకు గురయ్యాయి. 120 జాతులకు చెందిన మొక్కలు, 20 రకాల పక్షులు, ఇతర క్రిమికీటకాలకు జీవవైవిధ్య ప్రాంతం ఆవాసంగా ఉన్నట్టు కాకతీయ విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర పరిశోధకుడు సుతారి సతీష్ గతంలో పేర్కొన్నారు. ఇంతటి అరుదైన సంపదను కాపాడాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం విస్మయం కలిగిస్తోంది.
రోడ్డు పనులకు అనుమతి లేదు : వేణుగోపాల్
జీవ వైవిధ్య పరిరక్షణ ప్రాంతంలో అనుమతులు లేకుండా డైవర్షన్ రోడ్డు వేస్తుండడంతో పనులను అడ్డుకున్నట్టు ములుగు ఫారెస్ట్ రేం జర్ వేణుగోపాల్ తెలిపారు. రోడ్డు విస్తరణకు ఎంతవరకు అనుమతి తీసుకున్నారో అంతవరకే పనులు చేపట్టాలన్నారు. హద్దులు దాటి జీవవైవిధ్య ప్రాంతంలోకి అడ్డుకోక తప్పదని స్పష్టం చేశారు.