కళ్లకు వైద్యం హృదయంతో చేస్తాడు..!
‘అన్ని అవయవాల్లో హృదయం అత్యంత విలువైనది... ఆ హృదయంలో దయ ఉండాలి. కళ్లుంటే సరిపోదు... ఆ కళ్లలో కరుణ ఉండాలి... కన్ను చాలా గొప్పది’ అని అమ్మ చెప్పిన మాటలు ఆయనకు నిత్య సూక్తులయ్యాయి. ఆపరేషన్ అయ్యాక వచ్చిన రోగుల కళ్లల్లో కనిపించే ఆనందం ఆయనలో స్ఫూర్తిని నింపింది. అమ్మ మాటలు.. రోగుల కళ్లలో ఆనందమే ఆలంబనగా గత 44 ఏళ్లుగా ఉచిత కంటి ఆపరేషన్లు చేస్తూ తన జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నారు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన డాక్టర్. ఆళ్ల రామశేషయ్య. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి అన్నట్టు.. కృష్ణా జిల్లాలో జన్మించిన ఆయన గత 30 ఏళ్లుగా మిర్యాలగూడ ప్రాంతంలో సేవ చేస్తున్నారు. క్యాటరాక్ట్ అయినా ఐఓఎల్ అయినా.. ఆయన డబ్బులు తీసుకుని ఆపరేషన్ చేయరు. తన క్లినిక్‌కు వచ్చినా, తానే వెళ్లి గ్రామాల్లో క్యాంపులు పెట్టినా ఉచితంగా ఆపరేషన్లు చేస్తూ పేదల కళ్లకు కనిపించే దేవుడయ్యాడు.
ఏటీ అగ్రహారంలో మొదలు
‘ప్రాక్టీస్ తొలినాటి నుంచే కన్సల్టేషన్ ఫీజు తీసుకోలేదు. నా దగ్గరకు వచ్చే పేషెంట్లకు ట్రీట్మెంట్ అవసరం అయితే రెండు రూపాయలు తీసుకునేవాడిని. అది కూడా ఆసుపత్రిలో ఓ డబ్బా పెట్టి అందులో వేయమని చెప్పేవాడిని. దీన్ని స్ఫూర్తిగా తీసుకునే ‘మానవుడు-దానవుడు’ సినిమా దర్శకుడు ఆ సినిమా హీరో శోభన్‌బాబు చేత కూడా ఆసుపత్రిలో డబ్బా ఏర్పాటు చేయించి ట్రీట్మెంట్ ఫీజు తీసుకునే సీన్‌ను పెట్టారని చెప్తారు మరి. గుంటూరు రోటరీక్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక క్లబ్ తరపున పేదలకు ఉచిత కంటివైద్య శిబిరాలు ఏర్పాటు చేయించేవాళ్లం. స్వయంగా ఆపరేషన్లు చేసేవాడిని. ఏ ఊరుకెళితే ఆ ఊళ్లో ఉన్న పీహెచ్సీ లేదంటే మరో చోట ఆపరేషన్లు చేసి వచ్చేవాడిని. అప్పుడే ఉచిత కంటి ఆపరేషన్లపై శ్రద్ధ పెరిగింది.
నా పేరు...
గుంటూరు, అమరావతి మధ్యలో ఉన్న ఓ గ్రామంలోని కూరగాయలు అమ్మే వ్యక్తి రెండు కళ్లకూ ఒకేసారి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆ వ్యక్తికి కళ్లు బాగవడంతో తన అభిమానాన్ని కూరగాయల రూపంలో చాటుకున్నాడు. తను అమ్మే వంకాయలకు నా పేరు పెట్టి, ‘రామశేషయ్య వంకాయలోయ్... రామశేషయ్య వంకాయలు’ అంటూ అమ్మేవాడు. దీంతో ఆ ప్రాంతంలో నేను ఫేమస్ అయిపోయాను. ఎంతగా అంటే గుంటూరులోని ఏటీ అగ్రహారంలో రామశేషయ్య డాక్టర్ క్లినిక్ ఓ పెద్ద అడ్డాగా మారింది. సిటీబస్సయినా, ఆటో అయినా, రిక్షా అయినా.. ఇంకేదైనా ఆ ప్రాంతంలో ల్యాండ్‌మార్క్ అంటే రామశేషయ్య సెంటర్‌గా మారిపోయింది.
అక్క ఊరికి వచ్చి...
గుంటూరులో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే మా అక్క రమణి (దగ్గరి బంధువు) ఊరైన మిర్యాలగూడ సమీపంలోని అవంతీపురానికి చుట్టపుచూపుగా వెళ్లాను. అక్కడ పేదలు, ఎస్టీలు కంటి చూపు కారణంగా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని ‘అక్కా.. ఇక్కడకు రమ్మంటావా.. సేవ చేయమంటావా.’ అని అడిగా. అక్క సంతోషంగా రమ్మని చెప్పడంతో మిర్యాలగూడకు షిఫ్ట్ అయిపోయాను. అప్పటినుంచి (1984) మిర్యాలగూడ ప్రాంతంలో వేలాది మంది పేదలకు కంటి చికిత్స, శస్త్రచికిత్సలు చేస్తూ కాలం గడుపుతున్నా. కేవలం కన్సల్టేషన్ ఫీజు, మందులు, కళ్లజోళ్లకు మాత్రమే డబ్బులు తీసుకుంటా.
జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్
నా పేరుమీద చిల్లిగవ్వ ఆస్తి లేదు. బ్యాంక్ అకౌంట్ ఉంది కానీ.. బ్యాలెన్స్ మాత్రం జీరో. నాతో పాటు నా భార్య అవయవాలనూ ఓ మెడికల్ కాలేజ్‌కి రిజిస్టర్ చేశా. నేను చనిపోయిన తర్వాత ఎలాంటి కర్మకాండలు చేయవద్దని, అందుకు అయ్యే ఖర్చులను అనాథలకు ఇవ్వాలని కూడా నా పిల్లలకు చెప్పాను.
- మేకల కల్యాణ్ చక్రవర్తి, సాక్షి ప్రతినిధి, న ల్లగొండ
డాక్టర్ ఆళ్ల రామశేషయ్య
కంటి వైద్యనిపుణులు, మిర్యాలగూడఋ