Dr. b. chandrashekarreddy
-
రెండోసారి పక్షవాతాన్ని నివారించుకోండి
న్యూరాలజీ కౌన్సెలింగ్ మా దగ్గరి బంధువుల్లో ఒకరి వయసు 47. ఆర్నెల్ల క్రితం నుంచి ఆయనకు నాలుక పట్టేసినట్లుగా ఉండి, మాట ముద్దముద్దగా వస్తోంది. కుడివైపు భాగమంతా చచ్చుబడినట్లుగా మారుతోందని గొడవపెడ్తున్నాడు. చికిత్స తీసుకున్నా ప్రయోజనం లేదంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది? దీన్ని నివారించలేమా? - అరవింద్‌కుమార్, దిల్సుఖ్నగర్ అకస్మాత్తుగా కలిగే పరిణామం ఏదైనా సరే... అంటే మాట సరిగా రాకపోవడం, చూపులో తేడా రావడం, శరీరంలోని ఒకవైపు భాగం బలహీనపడటం, నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ లేకపోవడం... ఇవన్నీ పక్షవాత లక్షణాలే. అయితే దీన్ని నిర్ధారణ చేయడానికి సీటీ/ఎమ్మారై స్కాన్ పరీక్ష అవసరం. సాధారణంగా తొలిసారి కొద్దిపాటి పక్షవాతం వచ్చిన 30 శాతం మందిలో, ఏడాదిలో రెండోసారి తీవ్రంగా వచ్చేందుకు అవకాశం ఉంది. ప్రత్యేకంగా దీనికోసం రక్తాన్ని పలుచబార్చే మందులైన యాస్పిరిన్, క్లోపిడోగ్రెల్, స్టాటిన్స్ వంటివి తీసుకోని వారిలో ఇది తీవ్రంగా రావచ్చు. దీనితో పాటు పక్షవాతానికి ఆస్కారమిచ్చే రిస్క్ ఫ్యాక్టర్లు అయిన బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, గుండెజబ్బులు, హోమోసిస్టిన్ లేదా గురక వంటివి రోగికి ఉండి, వాటిని నియంత్రించకపోతే పక్షవాతం వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ. అందుకే మీ బంధువుకు వెంటనే అన్ని రకాల పరీక్షలు చేయించి, వ్యాధి విషయంలో తగిన నిర్వహణ చర్యలు (మేనేజ్మెంట్ ఆఫ్ డిసీజ్) తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ బంధువుకు మళ్లీ పక్షవాతం (స్ట్రోక్) వస్తే అది వైకల్యాన్ని తెస్తుంది. కాబట్టి మీరు వెంటనే మీ దగ్గర్లోని న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. రెండోసారి స్ట్రోక్‌ను నివారించేందుకు తగిన మందులు క్రమం తప్పకుండా వాడండి. నా వయసు 35. నాకు గత 16 ఏళ్లుగా ప్రతినెలా తలనొప్పి వస్తోంది. అది నెలలో నాలుగైదుసార్లు వస్తోంది. దీని తీవ్రత ఎంతగా ఉంటుందంటే నేను నా రోజువారీ పనులేవీ చేసుకోలేకపోతున్నాను. ఇప్పుడు మా అబ్బాయి కూడా అదే సమస్యను ఎదుర్కొంటున్నాడు. వాడి వయసు ఎనిమిదేళ్లు. ఇది వంశపారంపర్యంగా వచ్చే సమస్యా? నాకు తగిన సలహా ఇవ్వండి. - వసుంధర, మహబూబ్‌నగర్ తరచూ తలనొప్పి రావడం, దాంతోపాటు వాంతులు, వెలుగును చూడటంలో ఇబ్బంది పడటం, పెద్ద శబ్దాలను తట్టుకోలేకపోవడం, చీకటి గదిలో కాసేపు నిద్రపోయాక తలనొప్పి ఉపశమించడం లాంటి లక్షణాలు ఉంటే అది మైగ్రేన్ కావచ్చు. మీకు మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించే అంశం ఏమిటో చూడండి. అంటే... సూర్యకాంతికి ఎక్స్పోజ్ కావడం, ఘాటైన వాసనలు, పర్ఫ్యూమ్స్ లేదా సుగంధద్రవ్యాల వాసన, సమయానికి భోజనం చేయకపోవడం, నిద్రలేమి, మీరు తీసుకునే ఆహారపదార్థాలలో నిర్దిష్టంగా ఏదైనా సరిపడక వెంటనే తలనొప్పి రావడం (ఉదాహరణకు చీజ్, ఆరెంజ్, అరటిపండ్లు, అజినమోటో వంటి చైనా ఉప్పు, చాక్లెట్లు వంటివి) జరుగుతుంటే వెంటనే దాన్ని తీసుకోవడం ఆపేయండి. దాంతో తలనొప్పిని నివారించవచ్చు. మీకు వచ్చే తలనొప్పిని నివారించే టోపిరమేట్, డైవల్‌ప్రోయేట్, ఫ్లునరిజిన్, ప్రొపనలాల్ వంటి మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిని తీసుకుంటే 70 శాతం వరకు మళ్లీ వచ్చే అవకాశం నివారితమవుతుంది. మీరు చెప్పినట్టే మైగ్రేన్ అనేది కుటుంబసభ్యుల్లో వంశపారంపర్యంగా రావచ్చు. అయితే మీ అబ్బాయిలో కనిపించే లక్షణాలు కంటి చూపునకు సంబంధించినవా లేక మెదడుకు సంబంధించినవా అని పరీక్షించాల్సిన అవసరం ఉంది. ఒకసారి మీరు న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. డాక్టర్ బి. చంద్రశేఖరరెడ్డి, చీఫ్ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, మెడిసిటీ హాస్పిటల్స్, హైదారాబాద్ -
అరికాళ్లలో మంటలు, తిమ్మిర్లు..!
నా వయసు 51 ఏళ్లు. రెండేళ్ల నుంచి నా కాళ్లలో మంటలు, పోట్లు, తిమ్మిర్లు చాలా బాధపెడుతున్నాయి. నాకు బీపీ, షుగర్ వ్యాధులు, చెడు అలవాట్లు కూడా లేవు. అయినా ఈ సమస్యేమిటి? - వెంకటేశ్వర్లు, భువనగిరి కాళ్లలో మంటలు, పోట్లు, తిమ్మిర్లు, కాలి చివర మొద్దుబారడం వంటి లక్షణాలు నరాల నుంచి వెన్నుపాము వరకు వచ్చే సమస్యల సూచికలు. ఈ సమస్య పెరుగుతూ పోతే చేతులకు కూడా వస్తుంది. అలాగే నడకలో మార్పు, మలమూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోవడం, అంగస్తంభనలో కూడా ఇబ్బందులు ఉండవచ్చు. వీటినే పెరిఫెరల్ న్యూరోపతి అంటారు. ఈ కండిషన్‌కు ప్రధాన కారణాలు డయాబెటిస్, విటమిన్ బి12, బి1, ఫోలిక్ యాసిడ్, ప్యాంటథెనిక్ యాసిడ్ లోపాలు ఉండవచ్చు. కొన్నిసార్లు లెప్రసీ, హెచ్ఐవీ, హెపటైటిస్-బి అండ్ హెపటైటిస్ సి వైరస్ ల వంటివి కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు. సాధారణంగా 30 శాతం మందిలో ఏ కారణం లేకుండా కూడా ఈ సమస్య వస్తుంది. ఇలాంటివారిలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. పై లక్షణాలను నియంత్రించడా నికి గాబాపెంటిన్, ప్రీగాబాలిన్, అమీట్రిప్టిలిన్, డ్యూలోక్సె టిన్ మందులతో పాటు, మీ కండిషన్‌కు ఏ అంశం కారణమో దానికి కూడా వైద్యం చేయడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. అంటే ఉదాహరణకు బీ12 లోపం వల్ల ఈ కండిషన్ వస్తే దాన్ని భర్తీ చేయడం అన్నమాట. ఈ లక్షణాలున్నప్పుడు అరికాళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకుంటే చిన్న పుండ్లు కూడా తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. కొన్నిసార్లు రక్తప్రసరణలో ఇబ్బందులు, వెన్నుపాము జబ్బులు కూడా ఇలాంటి లక్షణాలను కలిగించవచ్చు. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. నా వయసు 44 ఏళ్లు. నాకు గత రెండేళ్ల నుంచి అప్పుడప్పుడూ కళ్లు తిరుగుతున్నాయి. మందులు వాడినప్పుడు తగ్గి మళ్లీ మళ్లీ ఈ సమస్య వస్తోంది. అలా అవుతున్నప్పుడు నాకు భయమేస్తోంది. దీనికి పూర్తిగా పరిష్కారం లేదా? - శ్రీలత, అనకాపల్లి మనల్ని సరిగ్గా అంటే బ్యాలెన్స్డ్గా నిలబెట్టే ప్రధాన భాగం చిన్నమెదడు, చెవి మధ్య ఉన్న ‘వెస్టిబ్యులార్ నరం’. చిన్నమెదడుకు వచ్చే జబ్బుల వల్ల మీరు పేర్కొన్న వర్టిగో లక్షణాలతో పాటు ఇతర లక్షణాలు కూడా ఉండవచ్చు. అంటే చూపులో, మాటలో, నడకలో, స్పర్శలో, బలంలో మార్పులు ఉంటే తక్షణం న్యూరాలజిస్ట్‌ను సంప్రదించాలి. అలా కాకుండా కేవలం కళ్లు తిరగడం, వినికిడి తగ్గడం, చెవిలో శబ్దం రావడం ఉంటే అవి చెవి నరానికి సంబంధించిన నరం వరకు వచ్చి సమస్య మాత్రమే. తలతిప్పినప్పుడు మాత్రం వచ్చే సమస్యకు, తక్షణ ఉపశమనానికి బీటాహిస్టిన్, సిన్నరజిన్ లాంటి మందులు ఉపయోపడతాయి. కొన్నిసార్లు ఇది మళ్లీ మళ్లీ వస్తుంది. అలా తరచుగా వచ్చేవారికి వెస్టిబ్యులార్ ఎక్సర్‌సెజైస్, ఎప్లేస్ మెథడ్ ద్వారా చికిత్స అవసరం. అప్పటికీ ఫలితం కనిపించకపోతే చెవి నరానికి కొన్ని ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా దీన్ని నియంత్రించ వచ్చు. ఇది కాస్త సతాయిస్తుంటుంది కానీ ప్రమాదకరం కాదు. కాబట్టి ఆందోళన చెందకండి. డాక్టర్ బి. చంద్రశేఖర్‌రెడ్డి చీఫ్ న్యూరాలజిస్ట్ సిటీ న్యూరో సెంటర్ మెడిసిటీ హాస్పిటల్స్, హైదరాబాద్ -
ఏదో చెప్పాలనుకున్నానే..!
ఒక విషయాన్ని జ్ఞాపకాల పొదిలో నిల్వ చేసుకోవడం, అవసరమైనప్పుడు మళ్లీ అది గుర్తుకురావడం - ఆలోచించి చూడండి. అదెంతటి అద్భుత ప్రక్రియో! అవసరమైన జ్ఞాపకం ఏదో బయటకు రావాలని మనసు మనకు పదే పదే చెబుతుంటుంది. అది జ్ఞప్తికి రాక మనసు తహతహలాడుతుంది. తపిస్తుంది. కానీ మెదడు మొరాయిస్తుంది. దీన్నే మనం ‘మతిమరపు’ అంటాం. అందరం ఏదో ఒక దశలో దీని తాకిడికి గురైనవాళ్లమే. అందరికీ అంతో ఇంతో ఉండేదే. కానీ తీవ్రమైతే మాత్రం సమస్యే. అలాంటి సమస్యలకు పరిష్కారాలున్నాయి. ఏదైనా సంఘటననుగానీ, సమాచారాన్ని గాని మెదడులో నిక్షిప్తం చేసుకోవడం, అవసరమైనప్పుడు దాన్ని మనసులోకి తెచ్చుకోవడాన్ని గుర్తుంచుకోవడం అంటాం. మనం మన ప్రయత్నమేమీ లేకుండానే గుర్తుంచుకోదగిన సమాచారాన్ని గుర్తుంచుకోవడంలోని ‘మొదటిదశ’గా పేర్కొంటాం. సాధారణ వ్యక్తి ఏడు అంకెల సంఖ్యను చూడగానే తడబడకుండా గుర్తుంచుకోడు. కానీ ఆ సంఖ్యలోని అంకెలు ఏడు దాటితే గుర్తుంచుకోడానికి కాస్త ప్రయత్నం అవసరమవుతుంది. అయితే మన అవసరం ముగియగానే ఈ సంఖ్యను మరచిపోతాం. ఇక ఆ సంఖ్య గానీ, పదం గానీ మనకు ఎప్పుడూ అవసరం అనుకోండి. దాన్ని మనం గుర్తుపెట్టుకోవడం తప్పనిసరి అనుకోండి. అప్పుడు మనం దాన్ని కాస్త ప్రయత్నపూర్వకంగా మనసులో నిక్షిప్తమయ్యేలా చేస్తాం. అవసరాన్ని బట్టి దాన్ని కొద్ది నిమిషాల నుంచి కొన్ని గంటల పాటు గుర్తుంచుకోగలం. ఈ పనిని మెదడులోని టెంపోరల్ లోబ్ ప్రాంతంలోని హిప్పోక్యాంపస్ అనే భాగం చేస్తుంది. ఒక సమాచారం సుదీర్ఘకాలం పాటు నిల్వ ఉండేదయితే దాన్ని సుదీర్ఘకాల జ్ఞాపకం అంటాం. ఉదాహరణకు మన మొదటి ఉపాధ్యాయుడు, మొదటి ఉద్యోగం లాంటివి. అవన్నీ మనలో బలంగా ముద్రించుకుపోయి, జ్ఞాపకంగా మెదడు కణాల్లో ఉండిపోతాయి. మనకు జరిగిన అవమానాలు కూడా చేదు జ్ఞాపకాలుగా ఉంటాయి. చాలాకాలం పాటు గుర్తుండేవన్నీ మెదడులోని నియోకార్టెక్స్లో ఉండిపోతాయి. మరపునకు కారణాలు : మనకు అవసరమైన సమాచారం ఏదో రావాల్సి ఉంది. కానీ మెదడు దాన్ని బయటకు రానివ్వడం లేదనుకోండి. దీన్నే మరచిపోవడం లేదా ‘మతిమరపు’ అంటాం. కొన్ని పోషకాల లోపం వల్ల మనకు మతిమరపు వస్తుంది. ఉదాహరణకు విటమిన్-బి కాంప్లెక్స్‌లోని విటమిన్ బి1, బి12, నియాసిన్, ఫోలిక్‌యాసిడ్ లోపం వల్ల ఇది వస్తుంది. ఇలా వచ్చే మతిమరపు తాత్కాలికం. మళ్లీ ఆ పోషకాలను ఆహార పదార్థాల ద్వారా భర్తీ చేయగానే మతిమరపు తగ్గుతుంది. అలాగే కొన్ని పదార్థాలు మరీ తగ్గినా, మరీ ఎక్కువగా తీసుకున్నా మతిమరపు సహజం. అవి చక్కెర, సోడియమ్, క్యాల్షియమ్ వంటివి. ఇక కొన్ని ముదిరిన జబ్బుల్లో కూడా మతిమరపు సహజం. అవి... కాలేయ సమస్యలు, మూత్రపిండాల వ్యాధులు, పక్షవాతం, కొన్ని ఇన్ఫెక్షన్లు, తలకు తగిలే గాయాల వల్ల కూడా మతిమరపు వస్తుంది. ఇక కొన్ని రకాల మతిమరపులు శాశ్వతం. ఉదాహరణకు అల్జైమర్స్, ఫ్రంటో టెంపోరల్ డిమెన్షియా, పార్కిన్సన్స్ డిసీజ్, పక్షవాతం లాంటి వాటితో వచ్చే మరపు శాశ్వతం. మతిమరపు సమస్యలో వైద్యుడిని కలవాల్సిందెప్పుడు... ఒకవేళ మరచిపోవడం అన్నది తరచుగా జరుగుతూ ఉండి, మీ రోజువారీ కార్యకలాపాలకు భంగం కలిగించేదిగా ఉండటంతో పాటు మనం రోజూ చేసే పనులైన బట్టలు వేసుకోవడం, శుభ్రత పాటించడం, మనం తరచూ వెళ్లే చోటికి కూడా సరిగా (అతిప్రయత్నం మీదగానీ) చేరలేక పోవడం, మనకు బాగా గుర్తున్న సంఘటన/కథను కూడా మధ్యలో చాలా భాగం మరచిపోవడం, మునుపు తీసుకున్నట్లుగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం, సామాజికంగా వ్యవహరించాల్సిన తీరుకు విరుద్ధంగా ప్రవర్తించడం అనే పనుల్లో రెండు లేదా అంతకుమించి సమస్యలు ఉంటే దాన్ని ‘డిమెన్షియా’ (వ్యాధిగా పరిగణించా ల్సిన మతిమరపు)గా భావించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో న్యూరాలజిస్ట్‌ను సంప్రదించాలి. ఇప్పుడు ఈ సమస్యను చక్కదిద్దడానికి, అదుపులో ఉంచడానికి మంచి మందులు... ఉదాహరణకు రివాస్టిగ్మైన్, డోనెపెజిల్, మెమెంటైన్, గ్యాలంటమైన్ వంటివి అందుబాటులో ఉన్నాయి. మతిమరపును అధిగమించడం ఎలా..? ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇది మెదడును ఉత్తేజరపచడమే కాక... మెదడు కణాలను చైతన్యపరుస్తుంది సామాజికంగా పదిమందితో కలుస్తూ ఉండటం, కుటుంబసభ్యులతో/స్నేహితులతో కలిసి ఉండటం మంచిది. ఇది ఒత్తిడినీ తగ్గిస్తుంది మనం తీసుకునే ఆహారంలో పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా ఉండాలి. వాల్నట్, అవిశెగింజలు (ఫ్లాక్స్ సీడ్స్), డార్క్ చాక్లెట్లు, ఆలివ్ ఆయిల్, సాల్మన్, ట్యూనా చేపలు మన జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాలు. వాటితో పాటు గ్రీన్ టీ ఆరోగ్యకరం. అయితే మరీ ఎక్కువ క్యాలరీలను ఇచ్చే ఆహారం... ఉదాహరణకు కూల్‌డ్రింక్స్, కోలాడ్రింక్స్ వంటివి కూడా మరపునకు దోహదం చేస్తాయి తీవ్రమైన ఒత్తిడి, ఉద్విగ్నత (యాంగ్జైటీ) వంటివి మతిమరపునకు దోహదం చేస్తాయి. ఈ సమస్యను ధ్యానం (మెడిటేషన్), ప్రాణాయామంతో అధిగమించవచ్చు మంచి జ్ఞాపకశక్తికి మంచి నిద్ర చాలా అవసరం. నిద్రలోనే మన జ్ఞాపకాలన్నీ దీర్ఘకాలం గుర్తుండేలా మెదడులో అమరిపోతాయి. పొగ తాగే అలవాటును మానుకోవాలి. బీపీ, షుగర్ వ్యాధుల్ని అదుపులో ఉంచుకోవాలి మెదడుకు వ్యాయామాన్నిచ్చే ఆటలైన చెస్, క్రాస్‌వర్డ్ పజిల్స్, సుడోకు వంటివి ఆడుతుండాలి న్యూస్‌పేపర్లు, మ్యాగజైన్లు, మంచి పుస్తకాలు వంటివి చదువుతూ ఉండాలి కొత్త వంటకాలు నేర్చుకోవడం, కొత్త మార్గాల్లో డ్రైవింగ్ చేసి, వాటిని గుర్తుంచుకోవడం, ఏదైనా కొత్త సంగీత పరికరాన్ని నేర్చుకునే అభ్యాసం చేయడం వంటివి కూడా జ్ఞాపకశక్తిని పెంచేందుకు దోహదం చేసే అంశాలే మీకు నచ్చిన, తెలియని కొత్త సబ్జెక్టును ఎంచుకొని, అందులో ప్రావీణ్యాన్ని పెంచుకునేలా అధ్యయనం చేయడం గానీ లేదా ఏదైనా మీకు ఆసక్తి ఉన్న ప్రాజెక్టును ఎంచుకొని విజయవంతం చేయడం, కొత్త ప్రణాళికలు రచించి వాటిని అమల్లోకి తేవడం కూడా జ్ఞాపకశక్తిని పెంచే విషయాలే. మనం ఎవరు? మనం ఏమిటి? మనం ఏం నేర్చుకున్నాం అన్నది మన జ్ఞాపకాల ఆధారంగానే నిర్ణయమవుతుందంటారు జ్ఞాపకశక్తి మీద పరిశోధనలు చేసి నోబెల్ బహుమతి అందుకున్న ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎరిక్ కెండెల్. పెంచుకున్నా, పంచుకున్నా చివరకు మిగిలేది మంచి జ్ఞాపకాలే. వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే మరపు వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరపునకు కారణం... మెదడులోని కణాలు, కణాల మధ్య బంధాలు, హిప్పోక్యాంపస్ క్రమంగా అరుగుదలకు గురికావడం. మనం చాలాసార్లు చాలా విషయాలు మరచిపోతూ ఉంటాం. తాళంచెవులు, కళ్లజోడు, కొన్ని బాగా గుర్తుంటాయనుకున్న టెలిఫోన్ నెంబర్లు, మనం చాలా తరచుగా వెళ్లే దారి... ఇలాంటివి ఒక్కోసారి మరచిపోతుండటం సహజమే. ఇది పెరుగుతున్న వయసుతో జరుగుతుండే ప్రక్రియ. అయితే కొన్నిసార్లు మనం తీవ్రమైన ఉద్విగ్నతలో ఉన్నప్పుడు ఒత్తిడికి గురైనప్పుడు కూడా అప్పటికప్పుడే మరిపోతుంటాం. కానీ ఇదేమీ వ్యాధితాలూకు మరపు (డిమెన్షియా) కాదు. ఇది చాలా సాధారణం. దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఏ వైద్యనిపుణుడినీ కలవనక్కర్లేదు. డాక్టర్ బి. చంద్రశేఖర్‌రెడ్డి, చీఫ్ న్యూరో ఫిజీషియన్, సిటీ న్యూరో సెంటర్, మెడిసిటీ హాస్పిటల్, హైదరాబాద్