ఏదో చెప్పాలనుకున్నానే..! | problem of forgetfulness | Sakshi
Sakshi News home page

ఏదో చెప్పాలనుకున్నానే..!

Published Thu, Jun 4 2015 11:45 PM | Last Updated on Sun, Sep 3 2017 3:13 AM

ఏదో చెప్పాలనుకున్నానే..!

ఏదో చెప్పాలనుకున్నానే..!

ఒక విషయాన్ని జ్ఞాపకాల పొదిలో నిల్వ చేసుకోవడం, అవసరమైనప్పుడు మళ్లీ అది గుర్తుకురావడం - ఆలోచించి చూడండి. అదెంతటి అద్భుత ప్రక్రియో! అవసరమైన జ్ఞాపకం ఏదో బయటకు రావాలని మనసు మనకు పదే పదే చెబుతుంటుంది. అది జ్ఞప్తికి రాక మనసు తహతహలాడుతుంది. తపిస్తుంది. కానీ మెదడు మొరాయిస్తుంది. దీన్నే మనం ‘మతిమరపు’ అంటాం. అందరం ఏదో ఒక దశలో దీని తాకిడికి గురైనవాళ్లమే. అందరికీ అంతో ఇంతో ఉండేదే. కానీ తీవ్రమైతే మాత్రం సమస్యే. అలాంటి సమస్యలకు పరిష్కారాలున్నాయి.
 
ఏదైనా సంఘటననుగానీ, సమాచారాన్ని గాని మెదడులో నిక్షిప్తం చేసుకోవడం, అవసరమైనప్పుడు దాన్ని మనసులోకి తెచ్చుకోవడాన్ని గుర్తుంచుకోవడం అంటాం. మనం మన ప్రయత్నమేమీ లేకుండానే గుర్తుంచుకోదగిన సమాచారాన్ని గుర్తుంచుకోవడంలోని ‘మొదటిదశ’గా పేర్కొంటాం. సాధారణ వ్యక్తి ఏడు అంకెల సంఖ్యను చూడగానే తడబడకుండా గుర్తుంచుకోడు. కానీ ఆ సంఖ్యలోని అంకెలు ఏడు దాటితే గుర్తుంచుకోడానికి కాస్త ప్రయత్నం అవసరమవుతుంది. అయితే మన అవసరం ముగియగానే ఈ సంఖ్యను మరచిపోతాం.

ఇక ఆ సంఖ్య గానీ, పదం గానీ మనకు ఎప్పుడూ అవసరం అనుకోండి. దాన్ని మనం గుర్తుపెట్టుకోవడం తప్పనిసరి అనుకోండి. అప్పుడు మనం దాన్ని కాస్త ప్రయత్నపూర్వకంగా మనసులో నిక్షిప్తమయ్యేలా చేస్తాం. అవసరాన్ని బట్టి దాన్ని కొద్ది నిమిషాల నుంచి కొన్ని గంటల పాటు గుర్తుంచుకోగలం. ఈ పనిని మెదడులోని టెంపోరల్ లోబ్ ప్రాంతంలోని హిప్పోక్యాంపస్ అనే భాగం చేస్తుంది. ఒక సమాచారం సుదీర్ఘకాలం పాటు నిల్వ ఉండేదయితే దాన్ని సుదీర్ఘకాల జ్ఞాపకం అంటాం. ఉదాహరణకు మన మొదటి ఉపాధ్యాయుడు, మొదటి ఉద్యోగం లాంటివి. అవన్నీ మనలో బలంగా ముద్రించుకుపోయి, జ్ఞాపకంగా మెదడు కణాల్లో ఉండిపోతాయి. మనకు జరిగిన అవమానాలు కూడా చేదు జ్ఞాపకాలుగా ఉంటాయి. చాలాకాలం పాటు గుర్తుండేవన్నీ మెదడులోని నియోకార్టెక్స్‌లో ఉండిపోతాయి.
 
మరపునకు కారణాలు : మనకు అవసరమైన సమాచారం ఏదో రావాల్సి ఉంది. కానీ మెదడు దాన్ని బయటకు రానివ్వడం లేదనుకోండి. దీన్నే మరచిపోవడం లేదా ‘మతిమరపు’ అంటాం. కొన్ని పోషకాల లోపం వల్ల మనకు మతిమరపు వస్తుంది. ఉదాహరణకు విటమిన్-బి కాంప్లెక్స్‌లోని విటమిన్ బి1, బి12, నియాసిన్, ఫోలిక్‌యాసిడ్ లోపం వల్ల ఇది వస్తుంది. ఇలా వచ్చే మతిమరపు తాత్కాలికం. మళ్లీ ఆ పోషకాలను ఆహార పదార్థాల ద్వారా భర్తీ చేయగానే మతిమరపు తగ్గుతుంది. అలాగే కొన్ని పదార్థాలు మరీ తగ్గినా, మరీ ఎక్కువగా తీసుకున్నా మతిమరపు సహజం. అవి చక్కెర, సోడియమ్, క్యాల్షియమ్ వంటివి. ఇక కొన్ని ముదిరిన జబ్బుల్లో కూడా మతిమరపు సహజం. అవి... కాలేయ సమస్యలు, మూత్రపిండాల వ్యాధులు, పక్షవాతం, కొన్ని ఇన్ఫెక్షన్లు, తలకు తగిలే గాయాల వల్ల కూడా మతిమరపు వస్తుంది. ఇక కొన్ని రకాల మతిమరపులు శాశ్వతం. ఉదాహరణకు అల్జైమర్స్, ఫ్రంటో టెంపోరల్ డిమెన్షియా, పార్కిన్‌సన్స్ డిసీజ్, పక్షవాతం లాంటి వాటితో వచ్చే మరపు శాశ్వతం.
 
మతిమరపు సమస్యలో వైద్యుడిని కలవాల్సిందెప్పుడు...
ఒకవేళ మరచిపోవడం అన్నది తరచుగా జరుగుతూ ఉండి, మీ రోజువారీ కార్యకలాపాలకు భంగం కలిగించేదిగా ఉండటంతో పాటు మనం రోజూ చేసే పనులైన బట్టలు వేసుకోవడం, శుభ్రత పాటించడం, మనం తరచూ వెళ్లే చోటికి కూడా సరిగా (అతిప్రయత్నం మీదగానీ)  చేరలేక పోవడం, మనకు బాగా గుర్తున్న సంఘటన/కథను కూడా మధ్యలో చాలా భాగం మరచిపోవడం, మునుపు తీసుకున్నట్లుగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం, సామాజికంగా వ్యవహరించాల్సిన తీరుకు విరుద్ధంగా ప్రవర్తించడం అనే పనుల్లో రెండు లేదా అంతకుమించి సమస్యలు ఉంటే దాన్ని ‘డిమెన్షియా’ (వ్యాధిగా పరిగణించా ల్సిన మతిమరపు)గా భావించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో న్యూరాలజిస్ట్‌ను సంప్రదించాలి. ఇప్పుడు ఈ సమస్యను చక్కదిద్దడానికి, అదుపులో ఉంచడానికి మంచి మందులు... ఉదాహరణకు రివాస్టిగ్మైన్, డోనెపెజిల్, మెమెంటైన్, గ్యాలంటమైన్ వంటివి అందుబాటులో ఉన్నాయి.

మతిమరపును అధిగమించడం ఎలా..?
ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇది మెదడును ఉత్తేజరపచడమే కాక... మెదడు కణాలను చైతన్యపరుస్తుంది  సామాజికంగా పదిమందితో కలుస్తూ ఉండటం, కుటుంబసభ్యులతో/స్నేహితులతో కలిసి ఉండటం మంచిది. ఇది ఒత్తిడినీ తగ్గిస్తుంది  మనం తీసుకునే ఆహారంలో పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా ఉండాలి. వాల్‌నట్, అవిశెగింజలు (ఫ్లాక్స్ సీడ్స్), డార్క్ చాక్లెట్లు, ఆలివ్ ఆయిల్, సాల్మన్, ట్యూనా చేపలు మన జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాలు. వాటితో పాటు గ్రీన్ టీ ఆరోగ్యకరం. అయితే మరీ ఎక్కువ క్యాలరీలను ఇచ్చే ఆహారం... ఉదాహరణకు కూల్‌డ్రింక్స్, కోలాడ్రింక్స్ వంటివి కూడా మరపునకు దోహదం చేస్తాయి  తీవ్రమైన ఒత్తిడి, ఉద్విగ్నత (యాంగ్జైటీ) వంటివి మతిమరపునకు దోహదం చేస్తాయి. ఈ సమస్యను ధ్యానం (మెడిటేషన్), ప్రాణాయామంతో అధిగమించవచ్చు   మంచి జ్ఞాపకశక్తికి మంచి నిద్ర చాలా అవసరం. నిద్రలోనే మన జ్ఞాపకాలన్నీ దీర్ఘకాలం గుర్తుండేలా మెదడులో అమరిపోతాయి.

పొగ తాగే అలవాటును మానుకోవాలి. బీపీ, షుగర్ వ్యాధుల్ని అదుపులో ఉంచుకోవాలి  మెదడుకు వ్యాయామాన్నిచ్చే ఆటలైన చెస్, క్రాస్‌వర్డ్ పజిల్స్, సుడోకు వంటివి ఆడుతుండాలి  న్యూస్‌పేపర్లు, మ్యాగజైన్లు, మంచి పుస్తకాలు వంటివి చదువుతూ ఉండాలి  కొత్త వంటకాలు నేర్చుకోవడం, కొత్త మార్గాల్లో డ్రైవింగ్ చేసి, వాటిని గుర్తుంచుకోవడం, ఏదైనా కొత్త సంగీత పరికరాన్ని నేర్చుకునే అభ్యాసం చేయడం వంటివి కూడా జ్ఞాపకశక్తిని పెంచేందుకు దోహదం చేసే అంశాలే  మీకు నచ్చిన, తెలియని కొత్త సబ్జెక్టును ఎంచుకొని, అందులో ప్రావీణ్యాన్ని పెంచుకునేలా అధ్యయనం చేయడం గానీ లేదా ఏదైనా మీకు ఆసక్తి ఉన్న ప్రాజెక్టును ఎంచుకొని విజయవంతం చేయడం, కొత్త ప్రణాళికలు రచించి వాటిని అమల్లోకి తేవడం కూడా జ్ఞాపకశక్తిని పెంచే విషయాలే.

మనం ఎవరు? మనం ఏమిటి? మనం ఏం నేర్చుకున్నాం అన్నది మన జ్ఞాపకాల ఆధారంగానే నిర్ణయమవుతుందంటారు జ్ఞాపకశక్తి మీద పరిశోధనలు చేసి నోబెల్ బహుమతి అందుకున్న ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎరిక్ కెండెల్. పెంచుకున్నా, పంచుకున్నా చివరకు మిగిలేది మంచి జ్ఞాపకాలే.
 
 
వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే మరపు

వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరపునకు కారణం... మెదడులోని కణాలు, కణాల మధ్య బంధాలు, హిప్పోక్యాంపస్ క్రమంగా అరుగుదలకు గురికావడం. మనం చాలాసార్లు చాలా విషయాలు మరచిపోతూ ఉంటాం. తాళంచెవులు, కళ్లజోడు, కొన్ని బాగా గుర్తుంటాయనుకున్న టెలిఫోన్ నెంబర్లు, మనం చాలా తరచుగా వెళ్లే దారి... ఇలాంటివి ఒక్కోసారి మరచిపోతుండటం సహజమే. ఇది పెరుగుతున్న వయసుతో జరుగుతుండే ప్రక్రియ. అయితే కొన్నిసార్లు మనం తీవ్రమైన ఉద్విగ్నతలో ఉన్నప్పుడు ఒత్తిడికి గురైనప్పుడు కూడా అప్పటికప్పుడే మరిపోతుంటాం. కానీ ఇదేమీ వ్యాధితాలూకు మరపు (డిమెన్షియా) కాదు. ఇది చాలా సాధారణం. దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఏ వైద్యనిపుణుడినీ కలవనక్కర్లేదు.
 
డాక్టర్ బి. చంద్రశేఖర్‌రెడ్డి,
చీఫ్ న్యూరో ఫిజీషియన్,
సిటీ న్యూరో సెంటర్, మెడిసిటీ హాస్పిటల్,
హైదరాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement