న్యూరాలజీ కౌన్సెలింగ్
మా దగ్గరి బంధువుల్లో ఒకరి వయసు 47. ఆర్నెల్ల క్రితం నుంచి ఆయనకు నాలుక పట్టేసినట్లుగా ఉండి, మాట ముద్దముద్దగా వస్తోంది. కుడివైపు భాగమంతా చచ్చుబడినట్లుగా మారుతోందని గొడవపెడ్తున్నాడు. చికిత్స తీసుకున్నా ప్రయోజనం లేదంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది? దీన్ని నివారించలేమా?
- అరవింద్‌కుమార్, దిల్‌సుఖ్‌నగర్
అకస్మాత్తుగా కలిగే పరిణామం ఏదైనా సరే... అంటే మాట సరిగా రాకపోవడం, చూపులో తేడా రావడం, శరీరంలోని ఒకవైపు భాగం బలహీనపడటం, నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ లేకపోవడం... ఇవన్నీ పక్షవాత లక్షణాలే. అయితే దీన్ని నిర్ధారణ చేయడానికి సీటీ/ఎమ్మారై స్కాన్ పరీక్ష అవసరం. సాధారణంగా తొలిసారి కొద్దిపాటి పక్షవాతం వచ్చిన 30 శాతం మందిలో, ఏడాదిలో రెండోసారి తీవ్రంగా వచ్చేందుకు అవకాశం ఉంది.
ప్రత్యేకంగా దీనికోసం రక్తాన్ని పలుచబార్చే మందులైన యాస్పిరిన్, క్లోపిడోగ్రెల్, స్టాటిన్స్ వంటివి తీసుకోని వారిలో ఇది తీవ్రంగా రావచ్చు. దీనితో పాటు పక్షవాతానికి ఆస్కారమిచ్చే రిస్క్ ఫ్యాక్టర్లు అయిన బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, గుండెజబ్బులు, హోమోసిస్టిన్ లేదా గురక వంటివి రోగికి ఉండి, వాటిని నియంత్రించకపోతే పక్షవాతం వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ. అందుకే మీ బంధువుకు వెంటనే అన్ని రకాల పరీక్షలు చేయించి, వ్యాధి విషయంలో తగిన నిర్వహణ చర్యలు (మేనేజ్‌మెంట్ ఆఫ్ డిసీజ్) తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ బంధువుకు మళ్లీ పక్షవాతం (స్ట్రోక్) వస్తే అది వైకల్యాన్ని తెస్తుంది. కాబట్టి మీరు వెంటనే మీ దగ్గర్లోని న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి.
రెండోసారి స్ట్రోక్‌ను నివారించేందుకు తగిన మందులు క్రమం తప్పకుండా వాడండి. నా వయసు 35. నాకు గత 16 ఏళ్లుగా ప్రతినెలా తలనొప్పి వస్తోంది. అది నెలలో నాలుగైదుసార్లు వస్తోంది. దీని తీవ్రత ఎంతగా ఉంటుందంటే నేను నా రోజువారీ పనులేవీ చేసుకోలేకపోతున్నాను. ఇప్పుడు మా అబ్బాయి కూడా అదే సమస్యను ఎదుర్కొంటున్నాడు. వాడి వయసు ఎనిమిదేళ్లు. ఇది వంశపారంపర్యంగా వచ్చే సమస్యా? నాకు తగిన సలహా ఇవ్వండి.
- వసుంధర, మహబూబ్‌నగర్
తరచూ తలనొప్పి రావడం, దాంతోపాటు వాంతులు, వెలుగును చూడటంలో ఇబ్బంది పడటం, పెద్ద శబ్దాలను తట్టుకోలేకపోవడం, చీకటి గదిలో కాసేపు నిద్రపోయాక తలనొప్పి ఉపశమించడం లాంటి లక్షణాలు ఉంటే అది మైగ్రేన్ కావచ్చు. మీకు మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించే అంశం ఏమిటో చూడండి. అంటే... సూర్యకాంతికి ఎక్స్‌పోజ్ కావడం, ఘాటైన వాసనలు, పర్‌ఫ్యూమ్స్ లేదా సుగంధద్రవ్యాల వాసన, సమయానికి భోజనం చేయకపోవడం, నిద్రలేమి, మీరు తీసుకునే ఆహారపదార్థాలలో నిర్దిష్టంగా ఏదైనా సరిపడక వెంటనే తలనొప్పి రావడం (ఉదాహరణకు చీజ్, ఆరెంజ్, అరటిపండ్లు, అజినమోటో వంటి చైనా ఉప్పు, చాక్లెట్లు వంటివి) జరుగుతుంటే వెంటనే దాన్ని తీసుకోవడం ఆపేయండి. దాంతో తలనొప్పిని నివారించవచ్చు. మీకు వచ్చే తలనొప్పిని నివారించే టోపిరమేట్, డైవల్‌ప్రోయేట్, ఫ్లునరిజిన్, ప్రొపనలాల్ వంటి మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిని తీసుకుంటే 70 శాతం వరకు మళ్లీ వచ్చే అవకాశం నివారితమవుతుంది. మీరు చెప్పినట్టే మైగ్రేన్ అనేది కుటుంబసభ్యుల్లో వంశపారంపర్యంగా రావచ్చు. అయితే మీ అబ్బాయిలో కనిపించే లక్షణాలు కంటి చూపునకు సంబంధించినవా లేక మెదడుకు సంబంధించినవా అని పరీక్షించాల్సిన అవసరం ఉంది. ఒకసారి మీరు న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి.
డాక్టర్ బి. చంద్రశేఖరరెడ్డి,
చీఫ్ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్,
మెడిసిటీ హాస్పిటల్స్, హైదారాబాద్