నా వయసు 51 ఏళ్లు. రెండేళ్ల నుంచి నా కాళ్లలో మంటలు, పోట్లు, తిమ్మిర్లు చాలా బాధపెడుతున్నాయి. నాకు బీపీ, షుగర్ వ్యాధులు, చెడు అలవాట్లు కూడా లేవు. అయినా ఈ సమస్యేమిటి?
- వెంకటేశ్వర్లు, భువనగిరి
కాళ్లలో మంటలు, పోట్లు, తిమ్మిర్లు, కాలి చివర మొద్దుబారడం వంటి లక్షణాలు నరాల నుంచి వెన్నుపాము వరకు వచ్చే సమస్యల సూచికలు. ఈ సమస్య పెరుగుతూ పోతే చేతులకు కూడా వస్తుంది. అలాగే నడకలో మార్పు, మలమూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోవడం, అంగస్తంభనలో కూడా ఇబ్బందులు ఉండవచ్చు. వీటినే పెరిఫెరల్ న్యూరోపతి అంటారు. ఈ కండిషన్‌కు ప్రధాన కారణాలు డయాబెటిస్, విటమిన్ బి12, బి1, ఫోలిక్ యాసిడ్, ప్యాంటథెనిక్ యాసిడ్ లోపాలు ఉండవచ్చు. కొన్నిసార్లు లెప్రసీ, హెచ్‌ఐవీ, హెపటైటిస్-బి అండ్ హెపటైటిస్ సి వైరస్ ల వంటివి కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు.
సాధారణంగా 30 శాతం మందిలో ఏ కారణం లేకుండా కూడా ఈ సమస్య వస్తుంది. ఇలాంటివారిలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. పై లక్షణాలను నియంత్రించడా నికి గాబాపెంటిన్, ప్రీగాబాలిన్, అమీట్రిప్టిలిన్, డ్యూలోక్సె టిన్ మందులతో పాటు, మీ కండిషన్‌కు ఏ అంశం కారణమో దానికి కూడా వైద్యం చేయడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. అంటే ఉదాహరణకు బీ12 లోపం వల్ల ఈ కండిషన్ వస్తే దాన్ని భర్తీ చేయడం అన్నమాట. ఈ లక్షణాలున్నప్పుడు అరికాళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకుంటే చిన్న పుండ్లు కూడా తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. కొన్నిసార్లు రక్తప్రసరణలో ఇబ్బందులు, వెన్నుపాము జబ్బులు కూడా ఇలాంటి లక్షణాలను కలిగించవచ్చు. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి.
నా వయసు 44 ఏళ్లు. నాకు గత రెండేళ్ల నుంచి అప్పుడప్పుడూ కళ్లు తిరుగుతున్నాయి. మందులు వాడినప్పుడు తగ్గి మళ్లీ మళ్లీ ఈ సమస్య వస్తోంది. అలా అవుతున్నప్పుడు నాకు భయమేస్తోంది. దీనికి పూర్తిగా పరిష్కారం లేదా?
- శ్రీలత, అనకాపల్లి
మనల్ని సరిగ్గా అంటే బ్యాలెన్స్‌డ్‌గా నిలబెట్టే ప్రధాన భాగం చిన్నమెదడు, చెవి మధ్య ఉన్న ‘వెస్టిబ్యులార్ నరం’. చిన్నమెదడుకు వచ్చే జబ్బుల వల్ల మీరు పేర్కొన్న వర్టిగో లక్షణాలతో పాటు ఇతర లక్షణాలు కూడా ఉండవచ్చు. అంటే చూపులో, మాటలో, నడకలో, స్పర్శలో, బలంలో మార్పులు ఉంటే తక్షణం న్యూరాలజిస్ట్‌ను సంప్రదించాలి. అలా కాకుండా కేవలం కళ్లు తిరగడం, వినికిడి తగ్గడం, చెవిలో శబ్దం రావడం ఉంటే అవి చెవి నరానికి సంబంధించిన నరం వరకు వచ్చి సమస్య మాత్రమే. తలతిప్పినప్పుడు మాత్రం వచ్చే సమస్యకు, తక్షణ ఉపశమనానికి బీటాహిస్టిన్, సిన్నరజిన్ లాంటి మందులు ఉపయోపడతాయి. కొన్నిసార్లు ఇది మళ్లీ మళ్లీ వస్తుంది. అలా తరచుగా వచ్చేవారికి వెస్టిబ్యులార్ ఎక్సర్‌సెజైస్, ఎప్లేస్ మెథడ్ ద్వారా చికిత్స అవసరం. అప్పటికీ ఫలితం కనిపించకపోతే చెవి నరానికి కొన్ని ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా దీన్ని నియంత్రించ వచ్చు. ఇది కాస్త సతాయిస్తుంటుంది కానీ ప్రమాదకరం కాదు. కాబట్టి ఆందోళన చెందకండి.
డాక్టర్ బి. చంద్రశేఖర్‌రెడ్డి
చీఫ్ న్యూరాలజిస్ట్ సిటీ న్యూరో సెంటర్
మెడిసిటీ హాస్పిటల్స్, హైదరాబాద్
అరికాళ్లలో మంటలు, తిమ్మిర్లు..!
Published Tue, Jun 23 2015 10:30 PM | Last Updated on Sun, Sep 3 2017 4:15 AM
Advertisement