అమ్మ వేలిముద్ర !
► బీ ఫాంలో అన్నాడీఎంకే
► అధినేత్రి జయ వేలిముద్ర
► వివాదాన్ని లేవనెత్తిన విపక్షాలు
► ఓకే అంటూ ఈసీ అంగీకారం
ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్న ముగ్గురు అన్నాడీఎంకే అభ్యర్థుల బీఫాంలలో పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత సంతకం చేయకుండా వేలిముద్ర వేయడం వివాదాలకు తెరతీసింది. ఆమె అరోగ్యంగా ఉన్నపుడు అమ్మ వేలిముద్రా అంటూ విపక్షాలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, చెన్నై: అనారోగ్య కారణాలతో జయలలిత సెప్టెంబరు 22వ తేదీ నుంచి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు చేసిన చికిత్స ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది, దాదాపుగా కోలుకున్నారని వైద్యులు ప్రకటించారు. ఆసుపత్రి పడకపై కూర్చుని వైద్యులతో మాట్లాడుతున్నారని, తన చేతులతోనే ఆహారాన్ని తీసుకుంటున్నారని ఇటీవల వరకు చెబుతూ వచ్చారు. అమ్మ ఆసుపత్రి చికిత్స పొందుతున్న తరుణంలోనే తంజావూరు, అరవకురిచ్చి, తిరుప్పరగుండ్రంలలో ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ముగ్గురు అభ్యర్థులకు జయలలిత పార్టీ అధినేత్రి హోదాలో బీ ఫాంలను జారీ చేయడం తప్పనిసరి.
జయ అంగీకారంతో కూడిన బీఫాంలను ఎన్నికల కమిషన్కు అప్పగించినపుడే అభ్యర్థులకు రెండాకుల గుర్తును కేటాయిస్తారు. అన్నాడీఎంకే తరఫున పోటీచేసే అభ్యర్థులకు 1989 నుంచి జయలలిత సంతకంతో కూడిన బీఫాంలనే అందజేస్తున్నారు. ఈ నెల 28వ తేదీన అన్నాడీఎంకే అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయగా, బీ ఫాంలో అమ్మ సంతకం ఉండాల్సిన స్థానంలో ఎడమచేతి వేలిముద్ర ఉంది. అమ్మ కోలుకున్న పరిస్థితుల్లో వేలిముద్ర వేయాల్సిన ఆవశ్యకత ఏమిటని విపక్షాలు విమర్శలు లేవనెత్తాయి. వేలిముద్ర వేసింది జయలలితేనా, బీఫాంలో వేలి ముద్ర చెల్లుతుందా అంటూ మరికొందరు పలు అనుమానాలను వ్యక్తం చేశారు.
వేలిముద్రపై వైద్యుని వివరణ
వేలి ముద్రకు సాక్షి సంతకం చేసిన రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ బాలాజీ విపక్షాలకు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. సీఎం కుడిచేతి గుండా మందులు ఎక్కిస్తున్న కారణంగా ఎడమ చేతి బొటనవేలి ముద్రను వేయించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. వేలిముద్ర వేసేపుడు ఆమె సృ్పహలోనే ఉన్నారు, వేలిముద్ర తీసుకోవడం సీఎంకు తెలుసని ప్రకటించాల్సి వచ్చింది.
ఈసీ వివరణ
ఈ నేపథ్యంలో వేలిముద్ర వ్యవహారంపై చీఫ్ ఎలక్షన్ కార్యాలయం రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఒక ఉత్తరం రాసింది. అన్నాడీఎంకే తరఫున పోటీచేస్తున్న ముగ్గురు అభ్యర్థులకు అందజేసే ఏ, బీ ఫారంలలో పార్టీ ప్రధాన కార్యదర్శి జయలలిత చేతి ముద్రలు వినియోగిస్తున్నట్లు 26వ తేదీన పార్టీ కార్యాలయం నుంచి తమకు ఉత్తరం అందిందని అందులో పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యుని సమక్షంలో వేసిన వేలిముద్ర ఉప ఎన్నికల్లో చెల్లుబాటు అవుతుందని సీఈసీ స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ఎన్నికల అధికారి సైతం వేలిముద్రతో కూడిన బీఫాంలపై ఆమోద ముద్ర వేశారు.
వేలిముద్రపై ఏమా వేగం?
బీఫాంలలో జయ వేలిముద్రను ఆమోదించడంలో ఎన్నికల కమిషన్ చూపిన వేగం అశ్చర్యాన్ని కలిగిస్తోందని పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్ వ్యాఖ్యానించారు. వేలిముద్రను అంగీకరించడం అన్నాడీఎంకేపై ఎన్నికల కమిషన్ చూపుతున్న హద్దుమీరిన ఆదరణ అని దుయ్యబట్టారు.