ప్రజాసేవ కోసమే పోలీసులు
ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : ప్రజాసేవ కోసమే పోలీసులు ఉన్నారని, ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి విధులకు న్యాయం చేయూలని కరీంనగర్ రేంజ్ డీఐజీ భీమానాయక్ అన్నారు. గురువారం జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో 2013 అర్ధ వార్షిక నేర సమీక్ష సమావేశానికి డీఐజీ హాజరయ్యూరు. గత ఆరు నెలల్లో జరిగిన నేరాలకు సంబంధించిన కేసులపై జిల్లాలోని పోలీసు అధికారులు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆరు నెలల్లో జిల్లాలో జరిగిన నేరాలను అదుపు చేయడంలో పోలీసులు వెనుకబడ్డారని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో మినహా మిగతా నేరాలను అదుపు చేయడంలో విఫలమయ్యారన్నారు.
సమస్యాత్మక ప్రాంతమైన జిల్లాలో నేరాల అదుపునకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇకనైనా ప్రత్యేక దృష్టి సారించి జిల్లా ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేయాలన్నారు. కానిస్టేబుళ్లు, ఇతర కింది స్థాయి సిబ్బంది సమస్యలు పరిష్కరించడంలో పోలీసు అధికారులు విఫలమయ్యారని తెలిపారు. కానిస్టేబుళ్లను చిన్నచూపు చూడకుండా పోలీసు కుటుంబంలో వారూ ఒకరుగా భావించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయూల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా భద్రత కట్టుదిట్టం చేయాలన్నారు. అనంతరం జిల్లాలోని పోలీసు స్టేషన్లలో వివిధ కేసులకు సంబంధించిన సమస్యలను డీఐజీకి విన్నవించారు. సమావేశంలో ఎస్పీ డాక్టర్ గజరావు భూపాల్, బెల్లంపెల్లి ఏఎస్పీ భాస్కర్ భూషణ్, ఓఎస్డీ పనసారెడ్డి, ఏపీసీ రాంభక్షి, పోలీసు అధికారులు పాల్గొన్నారు.