Dr Harsh Vardhan
-
ఎయిమ్స్ ట్రామా సెంటర్ లో కేంద్రమంత్రి హర్షవర్ధన్ పర్యటన
-
క్షయ పంజా : 24.04 లక్షలకు చేరిన బాధితులు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో క్షయ(టీబీ) వ్యాధి పంజా విసురుతోంది. దేశ వ్యాప్తంగా 24.04 లక్షల మంది టీబీ బారిన పడ్డారు. 2018తో పోలిస్తే ఇది 14శాతం మేర పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. దేశంలో క్షయ వ్యాధిపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ‘ఇండియన్ టీబీ రిపోర్టు–2020’ బుధవారం విడుదల చేసింది. వర్చువల్ ఈవెంట్ ద్వారా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2025 నాటికి టీబీ రహిత దేశమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి పేర్కొన్నారు. నివేదికలోని ముఖ్యాంశాలు దేశ వ్యాప్తంగా 24.04లక్షల టీబీతో బాధపడుతున్నారు. 2018తో పోలిస్తే ఈ ఏడాది 14 శాతం పెరిగింది. 2.9లక్షల మంది రోగుల వివరాలు తెలియరాలేదు. 2017లో 10 లక్షల మంది వివరాలు తెలియరాలేదు. ప్రైవేట్ సెక్టార్లలో నమోదు సంఖ్య 35 శాతం పెరగడంతో ఈ ఏడాది కొత్తగా 6.78 లక్షల రోగులను గుర్తించారు. టీబీతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య 8 శాతం పెరిగింది. క్షయ వ్యాధిగ్రస్థులకు హెచ్ఐవీ టెస్టులు నిర్వహించే సంఖ్య 81 శాతం పెరిగింది. చికిత్స సేవల విస్తరణ 12 శాతం పెరిగింది. 4.5 లక్షలకు పైగా డాట్ సెంటర్లు ఏర్పాటు చేసి దాదాపు ప్రతి గ్రామానికి చికిత్స అందిస్తున్నాయి. నిక్షయ్ పోషణ్ యోజన పథకాన్ని మరింత విస్తరిస్తూ క్షయ నిర్మూలనకు కృషి చేయడం క్షయ నివారణలో ఏపీకి రెండో స్థానం టీబీ నివారణ పోగ్రాంలో 2019 ఏడాదికి గాను దేశంలో ఆంధ్రప్రదేశ్‌కు రెండో స్థానం దక్కింది. 50 లక్షలకు పైబడిన రాష్ట్రాల కేటగిరిలో ఏపీకి ప్రశంస పత్రం అందింది. జాతీయ క్షయ నిర్మూలన విభాగం బుధవారం ఢిల్లీలో నిర్వహించిన సదబ్బులో ‘ఇండియా టీబీ రిపోర్ట్ 2020’ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా 2019 అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన రాష్ట్రాలకు మంత్రి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. క్షయ నిర్మూలకు తీవ్రంగా కృషి చేస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని అభినందించారు. కాగా, టీబీ నివారణ పోగ్రాంలో గుజరాత్ మొదటి స్థానం, ఏపీ రెండో స్థానంలో నిలవగా, హిమాచల్ ప్రదేశ్ 3వ స్థానం దక్కించుకుంది. -
డబ్ల్యూహెచ్ఓలో కీలక బాధ్యతలు చేపట్టిన భారత్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్‌గా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. 34 మంది సభ్యులు కలిగిన డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డు చీఫ్‌గా జపాన్‌కు చెందిన డాక్టర్ హిరోకి నకతని స్దానంలో డాక్టర్ హర్షవర్ధన్ నూతన బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని దీటుగా ఎదుర్కోవడంలో డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ దేశాలకు మార్గనిర్ధేశం చేస్తున్న క్రమంలో డాక్టర్ హర్షవర్ధన్ ప్రతిష్టాత్మక సంస్థలో కీలక పదవి చేపట్టడంతో భారత్ డబ్ల్యూహెచ్ఓ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషించనుంది. స్విట్జర్లాండ్‌లోని జెనీవా ముఖ్యకేంద్రంగా పనిచేసే డబ్ల్యూహెచ్ఓ నిర్వహణలో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ, ఎగ్జిక్యూటివ్ బోర్డులు నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తాయి. ఎగ్జిక్యూటివ్ బోర్డు పదవీకాలం మూడేళ్లు ఉంటుంది. పరస్పర సహకారంతో సవాళ్లకు చెక్ కరోనా మహమ్మారితో ప్రపంచం సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో తాను నూతన బాధ్యతలు చేపడుతున్నాని తెలుసని, రానున్న రెండు దశాబ్ధాల్లో ప్రపంచం ఎన్నో ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోనుందని డాక్టర్ హర్షవర్ధన్ ఆందోళన వ్యక్తం చేశారు. పరస్పర సహకారంతో ఈ సవాళ్లను దీటుగా ఎదుర్కోవాలని పిలుపు ఇస్తూ ఆయన ట్వీట్ చేశారు. చదవండి: డబ్ల్యూహెచ్ఓలో కేంద్ర మంత్రికి కీలక పదవి -
రక్తదానంపై దేశవ్యాప్త సామాజిక ఉద్యమం
న్యూఢిల్లీ: రక్తదానం దిశగా మరింతమంది ప్రజలను మళ్లించేందుకుగాను త్వరలో దేశవ్యాప్త సామాజిక ఉద్యమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పేర్కొన్నారు. నేషనల్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా జాతీయ రాజధాని నగరంలో బుధవారం నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఏడాదికోసారి రక్తదానం చేయడం వల్ల ప్రార్ధనాస్థలానికి వెళ్లినదానికంటే ఎక్కువగా ఆశీర్వాదం లభిస్తుంది. రక్తం ఆవశ్యకత, డిమాండ్ మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకుగాను దేశవ్యాప్త సామాజిక ఉద్యమం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది’అని ఆయన తెలిపారు. రక్తదానం చేసినంతమాత్రాన ఆరోగ్యమేమీ దెబ్బతినబోదని, అదంతా ఓ అపోహని ఆయన పేర్కొన్నారు. పైగాక్రమం తప్పకుండా రక్తదానం చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ఇదొక చక్కని మార్గమన్నారు. గుండెపోటు, కేన్సర్ల నుంచి ఇది రక్షణ కల్పిస్తుందన్నారు. కేలరీలను తగ్గించుకునేందుకు కూడా ఇది దోహదం చేస్తుందన్నారు. ప్రతి ఏడాదీ దాదాపు మూడు మిలియన్ యూనిట్ల మేర రక్తం కొరత ఉందన్నారు. స్వచ్ఛంద సంస్థలు చొరవ తీసుకుంటే ఈ సమస్య పరిష్కారమవుతుందన్నారు. కాగా ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులతోపాటు వివిధ పాఠశాలలకు చెందిన రెండు వేలమంది విద్యార్థులు, రక్తదాతలు, వివిధ బ్యాంకులకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఆరోగ్య సంరక్షణపై డ్రైవ్ ఆరోగ్య సంరక్షణపై నగరవాసులకు అవగాహన కల్పించడంకోసం కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రత్యేక డ్రైవ్‌ని ప్రారంభించింది. ఇందులోభాగంగా ఆరోగ్య శాఖ సిబ్బంది నగరంలోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తారు. ఈ కార్యక్రమానికి స్వచ్ఛ్ చేతనా ఎవం జన్ సహయోగ్ అభియాన్ (ఎస్సీఈజేఎస్ఏ) అని నామకరణం చేసింది. ఇందులోభాగంగా రాంలీలా మైదానంతోపాటు దుర్గా పూజమండపాల వద్ద ఎస్సీఈజేఎస్ఏ శిబిరాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆయా శిబిరాల వద్దకు వచ్చిన నగరవాసులకు ఉచిత డయాగ్నస్టిక్ పరీక్షలతోపాటు చికిత్స కూడా చేస్తారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వెల్లడించారు. ఈ శిబిరాల్లో 26 మంది వైద్యులు, 90 మంది పారామెడికల్ సిబ్బంది, నర్సులతోపాటు 200 మంది వాలంటీర్లు కూడా పాల్గొంటారు. వీరంతా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్), రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి చెందిన సిబ్బంది. ఈ కార్యక్రమం నగరంలో అమలైన తీరు, దాని వల్ల వచ్చిన ఫలితాలను పరిగణనలోకి తీసుకుని అనంతరం దేశవ్యాప్తంగా ప్రారంభించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఆ తర్వాత ఆయా రాష్ట్రాలకు చెందిన కార్యదర్శులతో ఈ నెల తొమ్మిదో తేదీన సమావేశమై ఓ నిర్ణయం తీసుకుంటుంది. ఈ డ్రైవ్‌లో కలిగిన అనుభవాలను ప్రాతిపదికగా తీసుకుని దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడతామని ఈ సందర్భంగా డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. దుర్గామాత పూజామండపాలతోపాటు రాంలీలా మైదానంలో నిర్వహించే శిబిరాల్లో స్వచ్ఛంద సంస్థలకు చెందిన ఒకరు లేదా ఇద్దరు కార్యకర్తలు కూడా పాలుపంచుకుంటారన్నారు. ఈ శిబిరాల్లో రక్తపోటు, బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) తదితర పరీక్షలకు హాజరయ్యేవారి వద్ద ఎటువంటి ఫీజులను వసూలు చేయబోమన్నారు. అవసరమైన రోగులకు వైద్యులు అండగా నిలుస్తారని ఆయన వివరించారు.