రక్తదానంపై దేశవ్యాప్త సామాజిక ఉద్యమం
న్యూఢిల్లీ: రక్తదానం దిశగా మరింతమంది ప్రజలను మళ్లించేందుకుగాను త్వరలో దేశవ్యాప్త సామాజిక ఉద్యమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పేర్కొన్నారు. నేషనల్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా జాతీయ రాజధాని నగరంలో బుధవారం నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఏడాదికోసారి రక్తదానం చేయడం వల్ల ప్రార్ధనాస్థలానికి వెళ్లినదానికంటే ఎక్కువగా ఆశీర్వాదం లభిస్తుంది. రక్తం ఆవశ్యకత, డిమాండ్ మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకుగాను దేశవ్యాప్త సామాజిక ఉద్యమం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది’అని ఆయన తెలిపారు.
రక్తదానం చేసినంతమాత్రాన ఆరోగ్యమేమీ దెబ్బతినబోదని, అదంతా ఓ అపోహని ఆయన పేర్కొన్నారు. పైగాక్రమం తప్పకుండా రక్తదానం చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ఇదొక చక్కని మార్గమన్నారు. గుండెపోటు, కేన్సర్‌ల నుంచి ఇది రక్షణ కల్పిస్తుందన్నారు. కేలరీలను తగ్గించుకునేందుకు కూడా ఇది దోహదం చేస్తుందన్నారు. ప్రతి ఏడాదీ దాదాపు మూడు మిలియన్ యూనిట్ల మేర రక్తం కొరత ఉందన్నారు. స్వచ్ఛంద సంస్థలు చొరవ తీసుకుంటే ఈ సమస్య పరిష్కారమవుతుందన్నారు. కాగా ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులతోపాటు వివిధ పాఠశాలలకు చెందిన రెండు వేలమంది విద్యార్థులు, రక్తదాతలు, వివిధ బ్యాంకులకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
ఆరోగ్య సంరక్షణపై డ్రైవ్
ఆరోగ్య సంరక్షణపై నగరవాసులకు అవగాహన కల్పించడంకోసం కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రత్యేక డ్రైవ్‌ని ప్రారంభించింది. ఇందులోభాగంగా ఆరోగ్య శాఖ సిబ్బంది నగరంలోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తారు. ఈ కార్యక్రమానికి స్వచ్ఛ్ చేతనా ఎవం జన్ సహయోగ్ అభియాన్ (ఎస్‌సీఈజేఎస్‌ఏ) అని నామకరణం చేసింది. ఇందులోభాగంగా రాంలీలా మైదానంతోపాటు దుర్గా పూజమండపాల వద్ద ఎస్‌సీఈజేఎస్‌ఏ శిబిరాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆయా శిబిరాల వద్దకు వచ్చిన నగరవాసులకు ఉచిత డయాగ్నస్టిక్ పరీక్షలతోపాటు చికిత్స కూడా చేస్తారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వెల్లడించారు. ఈ శిబిరాల్లో 26 మంది వైద్యులు, 90 మంది పారామెడికల్ సిబ్బంది, నర్సులతోపాటు 200 మంది వాలంటీర్లు కూడా పాల్గొంటారు.
వీరంతా ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్), రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి చెందిన సిబ్బంది. ఈ కార్యక్రమం నగరంలో అమలైన తీరు, దాని వల్ల వచ్చిన ఫలితాలను పరిగణనలోకి తీసుకుని అనంతరం దేశవ్యాప్తంగా ప్రారంభించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఆ తర్వాత ఆయా రాష్ట్రాలకు చెందిన కార్యదర్శులతో ఈ నెల తొమ్మిదో తేదీన సమావేశమై ఓ నిర్ణయం తీసుకుంటుంది. ఈ డ్రైవ్‌లో కలిగిన అనుభవాలను ప్రాతిపదికగా తీసుకుని దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడతామని ఈ సందర్భంగా డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. దుర్గామాత పూజామండపాలతోపాటు రాంలీలా మైదానంలో నిర్వహించే శిబిరాల్లో స్వచ్ఛంద సంస్థలకు చెందిన ఒకరు లేదా ఇద్దరు కార్యకర్తలు కూడా పాలుపంచుకుంటారన్నారు. ఈ శిబిరాల్లో రక్తపోటు, బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) తదితర పరీక్షలకు హాజరయ్యేవారి వద్ద ఎటువంటి ఫీజులను వసూలు చేయబోమన్నారు. అవసరమైన రోగులకు వైద్యులు అండగా నిలుస్తారని ఆయన వివరించారు.