
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్‌గా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. 34 మంది సభ్యులు కలిగిన డబ్ల్యూహెచ్‌ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డు చీఫ్‌గా జపాన్‌కు చెందిన డాక్టర్ హిరోకి నకతని స్దానంలో డాక్టర్ హర్షవర్ధన్ నూతన బాధ్యతలు స్వీకరించారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని దీటుగా ఎదుర్కోవడంలో డబ్ల్యూహెచ్‌ఓ ప్రపంచ దేశాలకు మార్గనిర్ధేశం చేస్తున్న క్రమంలో డాక్టర్ హర్షవర్ధన్ ప్రతిష్టాత్మక సంస్థలో కీలక పదవి చేపట్టడంతో భారత్ డబ్ల్యూహెచ్‌ఓ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషించనుంది. స్విట‍్జర్లాండ్‌లోని జెనీవా ముఖ్యకేంద్రంగా పనిచేసే డబ్ల్యూహెచ్‌ఓ నిర్వహణలో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ, ఎగ్జిక్యూటివ్ బోర్డులు నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తాయి. ఎగ్జిక్యూటివ్ బోర్డు పదవీకాలం మూడేళ్లు ఉంటుంది.
పరస్పర సహకారంతో సవాళ్లకు చెక్
కరోనా మహమ్మారితో ప్రపంచం సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో తాను నూతన బాధ్యతలు చేపడుతున్నాని తెలుసని, రానున్న రెండు దశాబ్ధాల్లో ప్రపంచం ఎన్నో ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోనుందని డాక్టర్ హర్షవర్ధన్ ఆందోళన వ్యక్తం చేశారు. పరస్పర సహకారంతో ఈ సవాళ్లను దీటుగా ఎదుర్కోవాలని పిలుపు ఇస్తూ ఆయన ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment