అపోలోలో తొలి ఎస్కేపీ సర్జరీ
ఏక కాలంలో కిడ్నీ,పాంక్రియస్ల మార్పిడి సర్జరీ
విజయవంతమని అపోలో ప్రకటన
అన్నానగర్, న్యూస్‌లైన్: దక్షిణాది వైద్య చరిత్రలోనే మొదటిదిగా చెప్పబడుతున్న సైమల్టేనియస్ కిడ్నీ - పాంక్రియాస్ సర్జరీ (ఎస్కేపీ)ను అపోలో వైద్యులు విజయవంతం చేశారని ఆ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి తెలిపారు. అపోలో ఎండీ ప్రీతారెడ్డి మాట్లాడుతూ త్వరలో అపోలో ఒక మల్టీ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ యూనిట్‌ను ప్రారంభిస్తుందని తెలిపారు.నగరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ సర్జరీకు చెందిన విశేషాలను వివరించారు.
పాండిచ్చేరికి చెందిన 52 ఏళ్ల పరమేశ్వరీ రాజశేఖర్ మధుమేహ వ్యాధితో చెడిపోయిన కిడ్నీతో తమ వద్దకు వైద్యం కోసం వచ్చారు. ఈ శస్త్ర చికిత్సకు సారథ్యం వహించిన డాక్టర్ ఆనంద్ కక్కర్ తెలిపారు. బాగా ఆలోచించిన మీదట ఆమెకు చెడిపోయిన కిడ్నీతో పాటు, చక్కెర స్థాయిని నియంత్రించే పాంక్రియాస్ గ్రంధిని కూడా పూర్తిగా తొలగించి వాటి స్థానంలో అవయవదాతల నుంచి సేకరించిన ఆరోగ్యకరమైన కిడ్నీ - పాంక్రియాస్‌లను అమర్చడం వలన ఆమెను మధుమేహం నుంచి పూర్తిగా విముక్తిరాల్ని చేయవచ్చు.
ఈ క్రమంలో తన సహవైద్యులైన డాక్టర్ మనీష్ వర్మ, డాక్టర్ ఆనంద్ రామమూర్తి, డాక్టర్ మహేష్‌లతో కల్సి ఈ సరికొత్త ఎస్కేపీ సర్జరీను పరమేశ్వరికి చేసి విజయం సాధించామన్నారు. టైప్టూ మధుమేహంతో బాధపడుతున్న పరమేశ్వరీ ఈ సర్జరీ అనంతరం పూర్తి స్థాయి ఆరోగ్యంతో ఉన్నారని, ఆమె పాంక్రియాస్, కిడ్నీలు బాగా పని చేస్తున్నాయని కక్కర్ తెలిపారు. ఈ విధానం ఉత్తర భారతావనిలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉందన్నారు. రోగి పరమేశ్వరి విలేకరులతో మాట్లాడుతూ ఈ సర్జరీ తర్వాత తాను అన్ని పదార్థాలనూ యథేచ్ఛగా తినగల్గుతున్నానని తెలిపారు.
మరో ఆరు నెలల తర్వాత స్వీట్లను కూడా తాను తినవచ్చునని వైద్యులు తెలిపారన్నారు. తాను వ్యాధి సోకక ముందు ఎలా ఉన్నానో సర్జరీ తర్వాత కూడా అంతే ఉత్సాహం, ఆరోగ్యంతో ఉన్నానని ఆమె చెప్పారు. అపోలో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ విభాగం వైద్యుడు డాక్టర్ భామ, అపోలో వైద్యులు, సిబ్బంది కూడా పాల్గొన్నారు.