మెరుగుపడుతున్న క్షతగాత్రుల ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్: బస్సు దగ్ధం ఘటనలో గాయపడి హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ డీఆర్డీవో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని ఆసుపత్రి మెడికల్ డెరైక్టర్ డా.సమీవుల్లా వెల్లడించారు. వారిలో ఎక్కువగా 45శాతం శరీరం కాలిపోయిన యోగేశ్ గౌడ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు. మరికొద్ది రోజుల చికిత్స అనంతరమే ఆయన ఆరోగ్య పరిస్థితిపై నిర్దిష్ట ప్రకటన చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. కాగా బస్సు దుర్ఘటనలో తీవ్ర గాయాలపాలైన వారికి ప్రభుత్వం తరఫున మెరుగైన వైద్యం అందిస్తామని మంత్రి డి.కె.అరుణ చెప్పారు. గురువారం ఆమె క్షతగాత్రులను పరామర్శించి, ఘటన జరిగిన తీరును తెలుసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం స్పందన భేష్: కర్ణాటక మంత్రి పి.రామలింగారెడ్డి
ప్రమాదం జరిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మహబూబ్‌నగర్ జిల్లా అధికారులు స్పందించిన తీరు అభినందనీయమని కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి అన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి వెంటనే తరలించటం, మృతదేహాల తరలింపులో ప్రత్యేక శ్రద్ధ వహించడాన్ని ప్రశంసించారు. గురువారం ఆయన కర్ణాటక ప్రభుత్వాధికారులతో కలిసి క్షతగాత్రుల్ని పరామర్శించారు. అనంతరం ఉస్మానియా మార్చురీలో మృతదేహాల్ని పరిశీలించి, బాధిత కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. అనంతరం మాట్లాడుతూ.. డ్రైవర్ నిర్లక్ష్యం, మితిమీరిన వేగంతో కారును ఓవర్టేక్ చేయటంతోనే ప్రమాదం జరిగిందన్నారు. మృతుల్లో 24 మంది కర్ణాటక వాసులన్నారు. మృతుల సంబంధీకులు వివరాలకు హెల్ప్‌డెస్క్ ఫోన్‌నంబర్ 040-27854771లో సంప్రదించాలని కోరారు.