ఎన్నికల మేనిఫెస్టో విడుదల
ముంబై సెంట్రల్, న్యూస్‌లైన్: ఠాణే లోక్‌సభ నియోజకవర్గం ప్రజాస్వామ్య కూటమి అభ్యర్థి డాక్టర్ సంజీవ్ నాయిక్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. నగర అభివృద్ధితోపాటు ప్రజల జీవన స్థితిగతుల మార్పు తదితర అంశాలను అందులో పొందుపరిచారు. ఈ సందర్భంగా ఎన్సీపీ నాయకుడు జితేంత్ర మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంజీవ్ తన హయాంలో అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారన్నారు. ఠాణేలో మోనో, మెట్రో సేవల ఆమోదం వెనుక ఆయన కృషి ఎంతో ఉందన్నారు.
ఘోడ్‌బందర్ మార్గం పరిసరాల్లో రహదార్లతోపాటు నీటి వసతి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.350 కోట్ల నిధులు మంజూరు చేయించారన్నారు. నగరం అభివృద్ధి చెందాలంటే సంజీవ్‌ను మరోసారి ఎంపీగా ఎన్నుకోవాలని ఆయన ప్రజలను కోరారు. సంజీవ్ గెలుపు కోసం పార్టీలోని ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని సూచించారు. ఠాణేలోని డంపింగ్ గ్రౌండ్ సమస్యను పరిష్కరిస్తానంటూ సంజీవ్ తన మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు తెలి పారు.
అనంతరం ఠాణే జిల్లా దళిత నాయకుడు సునీల్ ఖాంబే సంజీవ్ నాయిక్కు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నియోజకవర్గ పరిధిలోని ఠాణే, మీరా-భయిందర్, నవీముంబై పట్టణాలను సంజీవ్ ఎంతో అభివృద్ధి చేశారన్నారు. మీరా-భయిందర్ పట్టణానికి సూర్య జలాశయం నుంచి 200 ఎంఎల్డీల నీటిని అదనంగా సమకూర్చేందుకు కృషి చేస్తాననే విషయాన్ని సంజీవ్ తన మేనిఫెస్టోలో పొందుపరిచారన్నారు. ఈ కార్యక్రమంలో విధాన పరిషత్ ఉపసభాపతి వసంత్ డావ్కరే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సుభాష్ కానడే, నిరంజన్ డావ్కరే, ఎన్సీపీ ప్రదేశ్ కార్యాధ్యక్షుడు జితేంద్ర అవాడ్ తదితరులు పాల్గొన్నారు.