రొమ్ముక్యాన్సర్‌పై అపోహలు వద్దు...
రొమ్ము క్యాన్సర్ పట్ల ప్రజల్లో చాలా చాలా అపోహలున్నాయి. నిజానికి ముందుగా దీన్ని గుర్తించి చికిత్స తీసుకుంటే పూర్తిగా తగ్గే వ్యాధి ఇది. తొలిదశలోనే చికిత్స చేస్తే మునుపు ఉన్నంత ఆరోగ్యంగా తయారయ్యే ఈ వ్యాధి వల్ల కాపురాలే కూలిపోవడం విషాదకరమంటున్నారు అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్లో సర్జికల్ ఆంకాలజీ విభాగానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌రావు. సిటిజెన్స్ హాస్పిటల్ భాగస్వామ్యంతో అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ సర్జికల్ ఆంకాలజీ సేవలందిస్తోంది. ఈ సేవల్లో భాగంగానే సాధారణ ప్రజల్లోని అపోహలను తొలగించడానికి పలు అంశాలను వివరించారు డాక్టర్ చంద్రశేఖర్‌రావు. అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ తరఫున ఆయన తెలియజేసిన అనేక ఆసక్తికరమైన సంగతులివి...
రొమ్ము క్యాన్సర్ అన్నది వంశపారంపర్యం అని మనలో చాలామందికి ఒక అపోహ. కానీ ఇది వాస్తవం కాదు. కేవలం ఐదు శాతం మందిలో మాత్రమే ఇది వంశపారంపర్యంగా వస్తుంది. అలా వచ్చేవారిని గుర్తించడానికి కొన్ని మార్గదర్శకాలున్నాయి. ఉదాహరణకు ఒకరి కుటుంబంలో అమ్మకు, సోదరికీ రొమ్ము క్యాన్సర్గాని, ఒవేరియన్ క్యాన్సర్గాని వచ్చి ఉండి, ఆ మహిళకు 45ఏళ్ల కంటే తక్కువ ఉంటే అలాంటివారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే తోడబుట్టిన వారిలో ఒక సోదరికి రొమ్ముక్యాన్సర్ ఉన్నంత మాత్రాన రెండోసోదరికీ అది రావాలని లేదు. రొమ్ముక్యాన్సర్ వచ్చిన సోదరికి రెండురొమ్ముల్లోనూ క్యాన్సర్ వస్తేనే మరో సోదరికి అది వచ్చే అవకాశాలు ఎక్కువ.
ఆయుష్షు పెరగడం మంచిదేగా... మరి అదే కీడు ఎలా అయ్యింది?
ఇటీవల ఆడవాళ్ల ఆయుఃప్రమాణం పెరిగింది. ఆయుష్షు పెరగడం మంచిదే. కానీ వయసు పైబడటం రొమ్ము క్యాన్సర్‌కు ఒక రిస్క్ ఫ్యాక్టర్ కాబట్టి అదే రోగుల సంఖ్యనూ పెంచింది. అయితే దీన్ని నివారించేందుకూ మార్గం ఉంది.
సాధారణంగా యాభైఏళ్లు దాటాక ఆడవాళ్లకు మెనోపాజ్ వస్తుంది. ఇలా జరిగిన వాళ్లలో మామూలుగానైతే ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ తగ్గాలి. కానీ రుతుక్రమం ఆగి, బరువు పెరగడం మొదలైతే వాళ్లలో కొవ్వు ఎక్కువగా పెరుగుతుంది. ఇలా పెరిగే కొవ్వులో అరోమెటేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఆ అరోమెటేజ్కు అడ్రినల్హార్మోన్నూ, మెనోపాజ్ తర్వాత పెరిగే ఆండ్రోజెన్ హార్మోన్‌నూ... ఈస్ట్రోజెన్‌గా మార్చే గుణం ఉంటుంది. దాంతో సాధారణంగా జరగాల్సినదానికి భిన్నంగా... రివర్స్ ప్రక్రియ జరుగుతుంది. ఇలా ఈస్ట్రోజెన్ పెరగడం అన్నది రొమ్ముక్యాన్సర్‌కు దోహదం చేసే అంశం. కాబట్టి మెనోపాజ్ తర్వాత బరువు పెరిగే వాళ్లలో రొమ్ముక్యాన్సర్‌కు అవకాశం ఎక్కువ.
మరి నివారణ ఎలా?
బరువు పెరగడం వల్ల రొమ్ముక్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది కాబట్టి బరువు పెరగకుండా చూసుకోడానికి మెనోపాజ్ తర్వాత కొవ్వులు, నూనెలు తక్కువగా ఉండే ‘లో-ఫ్యాట్’ ఆహారం తీసుకోవాలి. అలాగే మెనోపాజ్‌కు చేరిన మహిళలు తప్పనిసరిగా వాకింగ్ వంటి వ్యాయామం చేయాలి.
రొమ్ముక్యాన్సర్‌ను గుర్తించడం ఎలా?
దీనికీ చాలా తేలిక మార్గాలున్నాయి. వాటిలో కొన్ని...
రుతుక్రమం ఆగిపోయాక ఒకవైపు రొమ్ము నుంచే రక్తస్రావం జరుగుతోందా అని చూడాలి.అలా అయితే దాన్ని రొమ్ముక్యాన్సర్గా అనుమానించాలి.
రుతుక్రమం తర్వాత రొమ్ములో ఏవైనా గడ్డలు కనిపిస్తున్నాయా? ఒకసారి పరీక్షచేయించుకోవాలి. ఆమాటకొస్తే రుతుక్రమం ముందుకూడా రొమ్ములో గడ్డలు రావచ్చు. కానీ అవి పెరుగుతుంటే మాత్రమే వాటిని ప్రమాదకరమైనవిగా అనుమానించాలి.
చికిత్స రొమ్ము క్యాన్సర్‌ను రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటిది మెనోపాజ్ కంటే ముందు వచ్చే హార్మోనల్ డిపెండెంట్ తరహా క్యాన్సర్. ఇందులో టొమాక్సిఫెన్ అనే మందును 20 ఎంజీ మోతాదులో ఐదేళ్ల పాటు ఇవ్వాలి. దీన్ని పరగడుపున తీసుకోవాలి. ఇది యాంటీ ఈస్ట్రోజెన్ కావడం వల్ల మహిళల్లో ఈస్ట్రోజెన్‌ను అరికడుతుంది.
ఇక రెండో రకమైన మెనోపాజ్ తర్వాతి దశలో వచ్చే హార్మోనల్ డిపెండెంట్ తరహా క్యాన్సర్. ఇందులో అరోమెటేజ్ అనే ఎంజైమ్‌ను అరికట్టే ఇన్హిబిటర్ను వాడటం ద్వారా చికిత్స చేస్తారు. ఈ అరోమెటేజ్ ఇన్హిబిటర్ను ఐదేళ్లపాటు వాడాలి. ఇందులో రెండు రకాల మందులు ఉన్నాయి. అనెస్టెజోల్ లేదా లెట్రజోల్ అనే ఈ రెండు మందుల్లో ఒకదానిని ఐదేళ్లపాటు వాడాల్సి ఉంటుంది.
హార్మోనల్ ఇండిపెండెంట్ క్సాన్సర్కి మాత్రం కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది.
రొమ్ముక్యాన్సర్‌లో శస్త్రచికిత్స రెండు రకాలుగా చేయవచ్చు. ఒకవేళ రొమ్ములోని క్యాన్సర్ గడ్డ 2 సెం.మీ. నుంచి 4 సెం.మీ. పరిమాణంలో ఉంటే దానికి రొమ్మును తొలగించాల్సి అవసరం ఉండదు. అయితే అంతకంటే మించి ఉంటే రొమ్ము తొలగించాల్సి వస్తుంది. చంక నుంచి గడ్డను తొలగించడాన్ని ‘ఆక్సిలరీ క్లియరెన్స్’ అంటారు.
ఆక్సిలరీ క్లియరెన్స్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గడ్డ తొలగించిన వైపున ఉన్న చేతికి గాజులు వేసుకోకూడదు. గడ్డ తొలగించాక ఆ వైపు చేతితో కత్తిపీటను వాడకూడదు. గడ్డ ఉన్న వైపున ఉండే చేతికి ఇంజెక్షన్ కూడా వేయించుకోకూడదు. ఆ వైపున ఉన్న చేతికి దోమలు కుట్టకుండా చూసుకోవడం మంచిది. అందుకోసం ఆపరేషన్ తర్వాత ఫుల్స్లీవ్స్ ఉండే దుస్తులు (జాకెట్లు) కుట్టించుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
అపోహలు వీడండి...
చాలామంది రొమ్ముక్యాన్సర్ ఉన్నవారి కుటుంబంలోని మహిళలను పెళ్లి చేసుకోడానికి వెనకాడుతుంటారు. కానీ ఇది ఎంతమాత్రమూ అంటువ్యాధి కాదు. కుటుంబంలోని వారిలో ఒకేలాంటి జన్యువులు ఉన్నప్పటికీ... అదే కుటుంబానికి చెందిన వారిలో ఇది రాకపోవచ్చు. అలాంటిప్పుడు ఎవరిలో ఇది వస్తుందనడానికి కొన్ని సూచనలూ ఉన్నాయి. ఉదాహరణకు జన్యుపరీక్షలో బీఆర్సీఏ 1, బీఆర్సీఏ 2 అనే జన్యువుల్లో తేడాలు ఉన్నప్పుడు క్యాన్సర్ వచ్చేందుకు రిస్క్ పెరుగుతుంది. అలాగే పి 10 అనే జన్యువు, పి 53 అనే జీన్ మ్యూటేషన్జరిగిన వారిలోనే ఇది వస్తుంది. అంటే కుటుంబ చరిత్రలో రొమ్ముక్యాన్సర్ వచ్చిన దాఖలా ఉన్నా ఆ కుటుంబంలో అందరికీ ఇది వచ్చే అవకాశాలు ఉండవు. కాకపోతే రిస్క్ మాత్రం ఉంటుందంతే.
చాలామంది దీన్ని అంటువ్యాధి అనుకుంటారు. బాగా చదువుకున్నవారిలోనూ చాలామందిలో ఈ అపోహ ఉంది. కానీ బాగా ముదిరిన దశతో సహా ఏ దశలోనూ ఇది అంటువ్యాధి కానేకాదు.
ఒకసారి శస్త్రచికిత్స జరిగి క్యాన్సర్ ఉన్న భాగాన్ని తొలగించాక వారు పూర్తిగా ఆరోగ్యవంతులైనట్లే. అంటే క్యాన్సర్ రాకముందు వారు ఎలాంటి జీవితం అనుభవించారో, అలాగే గడపవచ్చు. దాంపత్య జీవితం, సెక్స్‌తో సహా. మనదేశంలో రోగి పట్ల సానుభూతి చూపడం ఎక్కువ. కానీ ఒకసారి వ్యాధికి చికిత్స తీసుకుని పూర్తిగా తగ్గినవారు ఇక అన్నివిధాలుగా పూర్తిగా ఆరోగ్యవంతులు కాబట్టి బంధువులంతా పరామర్శల పేరిట వారికి సానుభూతి పంచడం, తమ అపోహలను వారిపై రుద్ది వారిని లేనిపోని భయాందోళనలకు గురిచేయడం ఎంతమాత్రమూ సరికాదని గుర్తుంచుకోండి.
డాక్టర్ చంద్రశేఖర్‌రావు
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్
అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్