Dr. Tessa Thomas
-
మహిళా శాస్త్రవేత్తల సంఖ్య పెరగాలి
అగ్ని పుత్రి టెస్సీ థామస్ సాక్షి ప్రత్యేక ప్రతినిధి, తిరుపతి: మహిళలు అభివృద్ధి చెందకుండా సంక్షేమ రాజ్యం సాధ్యం కాదని అగ్నిపుత్రిగా పేరొందిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) డైరెక్టర్ డాక్టర్ టెస్సీ థామస్ స్పష్టం చేశారు. ఆకాశంలో సగ భాగంగా ఉన్న మహిళా లోకం శక్తియుక్తులు సద్వినియోగం కావాలన్నారు. భారతీయ సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా బుధవారం తిరుపతిలో 6వ మహిళా సైన్స్ కాంగ్రెస్ ప్రారంభోత్సవంలో ఆమె ప్రసంగించారు. ‘మహిళలు సంప్రదాయ సంకెళ్ల నుంచి విముక్తులై ముందడుగు వేయాలి. విజ్ఞానంపై తృష్ణ పెంచుకోవాలి. శాస్త్ర, సాంకేతిక, వైద్య రంగాలలో మహిళల శాతం 4కి మించిలేదు. భారతీయ సమాజంలో మహిళా శాస్త్రవేత్తల సంఖ్య మరింత పెరగాలి. ఓ సీనియర్ శాస్త్రవేత్తల బృందంలో ఓ మహిళ ఉంటే మొత్తం పరిస్థితులే మారిపోతాయి. సమర్థమైన ఫలితాలు వస్తాయి..’ అని టెస్సీ పేర్కొన్నారు. -
టెస్సీ థామస్‌కు మహిళా వర్సిటీ గౌరవ డాక్టరేట్
యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి) : డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో)కు చెందిన మహిళా శాస్త్రవేత్త డాక్టర్ టెస్సీ థామస్‌కు మహిళా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఈ నెల 29న పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగే 16వ స్నాతకోత్సవంలో ఆమెకు గౌరవ డాక్టరేట్‌ను అందజేస్తారు. ఈ స్నాతకోత్సవంలో ఆమె స్నాతకోపన్యాసం చేస్తారు. డాక్టర్ టెస్సీథామస్ డీఆర్డీవోలో 5వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించే యుద్ధ విమానం అగ్ని-4కు ప్రాజెక్ట్ డెరైక్టర్‌గా పనిచేశారు. ఈమె మనదేశంలో మిసైల్ ప్రాజెక్ట్‌లో డెరైక్టర్‌గా పనిచేస్తున్న తొలి మహిళా శాస్త్రవేత్త. ఈమె ఇంతకు ముందు 3 వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించే యుద్ధవిమానం(మిసైల్) అగ్ని-3కి అసోసియేట్ ప్రాజెక్ట్ డెరైక్టర్‌గా పనిచేశారు. ఈమె హైదరాబాద్‌లోని అడ్వాన్స్ సిస్టమ్స్ లేబొరేటరీలో శాస్త్రవేత్తగా విధులు నిర్వర్తిస్తున్నారు.