మహిళా శాస్త్రవేత్తల సంఖ్య పెరగాలి
అగ్ని పుత్రి టెస్సీ థామస్
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, తిరుపతి: మహిళలు అభివృద్ధి చెందకుండా సంక్షేమ రాజ్యం సాధ్యం కాదని అగ్నిపుత్రిగా పేరొందిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) డైరెక్టర్ డాక్టర్ టెస్సీ థామస్ స్పష్టం చేశారు. ఆకాశంలో సగ భాగంగా ఉన్న మహిళా లోకం శక్తియుక్తులు సద్వినియోగం కావాలన్నారు. భారతీయ సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా బుధవారం తిరుపతిలో 6వ మహిళా సైన్స్ కాంగ్రెస్ ప్రారంభోత్సవంలో ఆమె ప్రసంగించారు. ‘మహిళలు సంప్రదాయ సంకెళ్ల నుంచి విముక్తులై ముందడుగు వేయాలి. విజ్ఞానంపై తృష్ణ పెంచుకోవాలి.
శాస్త్ర, సాంకేతిక, వైద్య రంగాలలో మహిళల శాతం 4కి మించిలేదు. భారతీయ సమాజంలో మహిళా శాస్త్రవేత్తల సంఖ్య మరింత పెరగాలి. ఓ సీనియర్ శాస్త్రవేత్తల బృందంలో ఓ మహిళ ఉంటే మొత్తం పరిస్థితులే మారిపోతాయి. సమర్థమైన ఫలితాలు వస్తాయి..’ అని టెస్సీ పేర్కొన్నారు.