పూర్తి సాయానికి పూచీ ఏదీ?
అడ్డగోలు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరు కుపోయింది. కొత్తగా రాష్ట్రం ఏర్పడి నిండా ఏడాది నిండలేదు. బాలా రిష్టాలు, తప్పటడుగుల దశ ఇంకా దాటనే లేదు. ఈ సమయం లోనే కేంద్రప్రభుత్వం ఎక్కువగా ఆదుకోవలసి ఉంటుంది. అది కేంద్రం బాధ్యతే కాదు. ఈ రాష్ట్ర ప్రజల హక్కు కూడా. ఆ మేరకు మునుపటి ప్రధాని మన్మోహన్ సింగ్ నాడు పార్లమెంటు వేదికగా హామీ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆశించినంత స్పందన కేంద్రం నుంచి లేకపోవటం దారుణం. వేల కోట్ల రూపాయల చేయూతకి పూచీ పడి అందులో పదో వంతు కూడా విదిల్చకపోవడం, ప్రత్యేక హోదా విష యమై మౌనం దాల్చడం, ఇతరహామీలను ఉపేక్షించడం రాష్ట్ర ప్రయో జనాలకు తీవ్ర భంగకరం. తీరా ప్రజల నుంచి ఒత్తిడి సెగ తగలడం మొదలయ్యేసరికి ప్రత్యేకహోదా సాధ్యం కాదని కేంద్రం మంత్రులు సన్నాయి నొక్కులు మొదలెట్టారు. రాష్ట్ర భవితకు బంగారు ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం తీరా అమలు చేయాల్సిన సమయంలో బఠాణీల ప్యాకేజీతో సరిపుచ్చటానికి ప్రయత్నించడాన్ని అందరూ ఖండించాలి. రాజకీయాలకు అతీతంగా అన్ని పక్షాలూ రాష్ట్ర హక్కులకై కలిసి రావాలి. ఇందులో అధికార పక్షానికి, ముఖ్యమంత్రికి మరింత బాధ్యత ఉంది.
- డాక్టర్ డి.వి.జి. శంకరరావు మాజీ ఎంపీ, పార్వతీపురం, విజయనగరం