drinking alcohol arrests
-
ఇకపై మద్యం తాగి దొరికావో.. అంతే సంగతులు! జర జాగ్రత్త భయ్యా!! లేదంటే..
నిజామాబాద్: మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. గతంలో మద్యం తాగి వాహనాలు నడిపే వారు కోర్టులో జరిమానా చెల్లించి తప్పించుకునేవారు. జిల్లాలో మద్యం మత్తులో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం నూతన ఆదేశాలను జారీ చేసింది. ఇకపై తాగి వాహనాలు నడిపే వారిపై జరిమానాతో పాటు జైలు శిక్ష, వాహన లైసెన్స్ రద్దు చేసేలా చర్యలు తీసుకుంటోంది. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టినా మద్యం ప్రియుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. దీంతో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. మందుబాబులకు కౌన్సెలింగ్.. మద్యం తాగి దొరికిన వారికి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. కౌన్సెలింగ్‌లో మద్యం తాగి నడిపిస్తే కలిగే నష్టాలను వాహనాదారుడికి, కుటుంబసభ్యులకు వివరిస్తున్నారు. మద్యం తాగి దొరికిన వారి వివరాలు పీఎస్‌లో నిక్షిప్తమై ఉంటాయి. నగరంతోపాటు మండల కేంద్రంలో కూడా పోలీసులు మధ్యాహ్న సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మద్యం తాగి దొరికిన వారిని కోర్టులో హాజరు పర్చడంతో వారికి కోర్టు జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తోంది. కోర్టు నిర్ణయం మేరకు.. మద్యం తాగి దొరికిన వారిపై కోర్టు జైలు శిక్ష విధించడంతోపాటు జరిమానా విధిస్తారు. మొదటి సారి కాకుండా రెండోసారి దొరికిన వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయాలని కోర్టు రవాణా శాఖకు సిఫార్సు చేస్తోంది. వాహనాదారుల డ్రైవింగ్ లైసెన్స్‌లను కోర్టు నిర్ణయం మేరకు ఏడాది నుంచి ఆరు నెలల వరకు రద్దు చేసే అవకాశం ఉంది. కోర్టుకు పంపిస్తున్నాం.. తాగి వాహనాలు నడిపి తనిఖీలో పట్టుబడితే వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నాం. కోర్టు వారికి జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తోంది. తాగి నడిపితే జరిగే పరిణామాలపై కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నాం. ఎవరైనా మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవు. నగరంలోని ఒకటో టౌన్ పీఎస్ పరిధిలో ఓ వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించగా మోతాదుకు మించి తాగినట్లు గుర్తించడంతో రెండు రోజుల జైలు శిక్ష విధించారు. ఇప్పటి వరకు జిల్లాలో మద్యం తాగి పట్టుబడి జైలు శిక్ష కొందరు అనుభవించి వచ్చారు. – చందర్‌రాథోడ్, ట్రాఫిక్ సీఐ, నిజామాబాద్ సంవత్సరంలో కేసులు.. 2021 - 4226 2022 - 11684 2023 - 17004(జనవరి నుంచి సెప్టెంబర్) -
ఎన్నికల రోజు మద్యం తాగితే అరెస్టే
ఏటీ అగ్రహారం(గుంటూరు), న్యూస్‌లైన్: ఎన్నికల రోజు మద్యం సేవించి సంచరించే వారిపై కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని అర్బన్ ఎస్పీ జెట్టి గోపీనాథ్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని ఉమేష్‌చంద్ర కాన్పరెన్స్ హాలులో శనివారం నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల రోజు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పరిధిలోని అన్ని చెక్‌పోస్టుల్లో, ప్రైవేటు, ఆర్టీసీ బస్సులతో సహా అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. రాజకీయ పార్టీల సమావేశాలు నిర్వహించి, ఫలానా పార్టీకి ఓటు వేయాలని చెప్పే ప్రభుత్వ ఉద్యోగులపై నిఘా ఉంచి వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని సూచించారు. సంఘ విద్రోహక శక్తులు, రౌడీషీటర్ల కదలికలైపై నిఘా ఉంచి, సందేహాస్పదంగా ఉంటే వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. రాత్రి 11 గంటల తరువాత రాజకీయ పార్టీల కార్యాలయాలు, గృహాల వద్ద విందు వినోద కార్యక్రమాలు జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అటువంటి సంఘటనలు చోటుచేసుకుంటే కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో, ప్రస్తుత ఎక్సైజ్ కేసుల్లో కోడ్ ఉల్లంఘన, బైండోవర్ కేసులు, పెండింగ్ కేసుల్లో నిందితులను వెంటనే అరెస్టు చేయాలన్నారు. అర్బన్ జిల్లా పరిధిలో ఉన్న1035 పోలింగ్ బూతుల్లో సాయుధ బలగాల పహారా పటిష్టంగా కొనసాగుతుందని పోలింగ్ బూతుల్లోని అధికారి పిలిచేవరకూ ఎవ్వరూ బూతుల్లోకి వెళ్ళరాదని ఆదేశించారు. పోలింగ్ రోజు 144 సెక్షన్ అమలులో ఉంటుందని గుంపులుగా లేకుండా ఓటర్లను ఎప్పటికప్పుడు పోలింగ్ కేంద్రాల వద్ద నుంచి పంపివేయాలన్నారు. గ్రామాల్లోని బెల్టుషాపులు మూసివేసిన కారణంగా చిల్లర దుకాణాలు, హోటళ్ళ వద్ద మద్యం అమ్మకాలు కొనసాగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అరెస్టు చేయాలని ఆదేశించారు. చెక్ పోస్టుల నిర్వహణ సాకుతో రాజకీయనేతల వద్దకు కొందరు పోలీస్ అధికారులు, సిబ్బంది వెళుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇటువంటి ఘటనలు మళ్ళీ జరిగితే వారిపై శాఖాపరమైన విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమావేశంలో ఏఎస్పీ జానకీ ధరావత్, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.