ఎన్నికల రోజు మద్యం తాగితే అరెస్టే
ఏటీ అగ్రహారం(గుంటూరు), న్యూస్‌లైన్: ఎన్నికల రోజు మద్యం సేవించి సంచరించే వారిపై కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని అర్బన్ ఎస్పీ జెట్టి గోపీనాథ్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని ఉమేష్‌చంద్ర కాన్పరెన్స్ హాలులో శనివారం నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల రోజు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పరిధిలోని అన్ని చెక్‌పోస్టుల్లో, ప్రైవేటు, ఆర్టీసీ బస్సులతో సహా అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. రాజకీయ పార్టీల సమావేశాలు నిర్వహించి, ఫలానా పార్టీకి ఓటు వేయాలని చెప్పే ప్రభుత్వ ఉద్యోగులపై నిఘా ఉంచి వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని సూచించారు.
సంఘ విద్రోహక శక్తులు, రౌడీషీటర్ల కదలికలైపై నిఘా ఉంచి, సందేహాస్పదంగా ఉంటే వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. రాత్రి 11 గంటల తరువాత రాజకీయ పార్టీల కార్యాలయాలు, గృహాల వద్ద విందు వినోద కార్యక్రమాలు జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అటువంటి సంఘటనలు చోటుచేసుకుంటే కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో, ప్రస్తుత ఎక్సైజ్ కేసుల్లో కోడ్ ఉల్లంఘన, బైండోవర్ కేసులు, పెండింగ్ కేసుల్లో నిందితులను వెంటనే అరెస్టు చేయాలన్నారు. అర్బన్ జిల్లా పరిధిలో ఉన్న1035 పోలింగ్ బూతుల్లో సాయుధ బలగాల పహారా పటిష్టంగా కొనసాగుతుందని పోలింగ్ బూతుల్లోని అధికారి పిలిచేవరకూ ఎవ్వరూ బూతుల్లోకి వెళ్ళరాదని ఆదేశించారు.
పోలింగ్ రోజు 144 సెక్షన్ అమలులో ఉంటుందని గుంపులుగా లేకుండా ఓటర్లను ఎప్పటికప్పుడు పోలింగ్ కేంద్రాల వద్ద నుంచి పంపివేయాలన్నారు. గ్రామాల్లోని బెల్టుషాపులు మూసివేసిన కారణంగా చిల్లర దుకాణాలు, హోటళ్ళ వద్ద మద్యం అమ్మకాలు కొనసాగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అరెస్టు చేయాలని ఆదేశించారు. చెక్ పోస్టుల నిర్వహణ సాకుతో రాజకీయనేతల వద్దకు కొందరు పోలీస్ అధికారులు, సిబ్బంది వెళుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇటువంటి ఘటనలు మళ్ళీ జరిగితే వారిపై శాఖాపరమైన విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమావేశంలో ఏఎస్పీ జానకీ ధరావత్, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.