drinking wateer
-
కోనసీమలో ‘నల్ల బంగారం’
సాక్షి అమలాపురం: కోనసీమలో తయారయ్యే ‘కొబ్బరి చిప్ప బొగ్గు’ దేశంలోనే ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ముఖ సౌందర్యానికి ఫేస్‌ప్యాక్‌గా, తాగునీటిని శుద్ధిచేసేందుకు వినియోగించడంతో పాటు పెట్రోలియం ఉత్పత్తులు, దేశ రక్షణకు చెందిన విడి భాగాలు, ఆటో మొబైల్ పరిశ్రమలలో కీలక విడిభాగాల తయారీలో ఈ బొగ్గు అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. తయారీదారుల ఇంట నల్ల బంగారమై మెరుస్తోంది. ఇటువంటి అత్యుత్తమమైన, నాణ్యమైన కొబ్బరి చిప్ప బొగ్గు తయారీకి కేరాఫ్ అడ్రస్‌గా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నిలుస్తోంది. నదీతీరంలో బొగ్గు తయారీ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం, అంబాజీపేట మండలాల్లో వైనతేయ నదీతీరంలో బొగ్గు తయారవుతోంది. ఇక్కడ నుంచి ఏడాదికి రూ. 2 కోట్ల విలువ చేసే 700 నుంచి 900 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తున్నారు. తమిళనాడు లోని కాంగాయం, పల్లడం, కోయింబత్తూరు, కర్ణాటకలోని బెంగళూరు, తెలంగాణలోని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు, మన రాష్ట్రంలోని నెల్లూ రు, గూడూరు వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రయోజనాలెన్నో.. కొబ్బరి చిప్ప బొగ్గు ప్రయోజనాలు తెలిస్తే నిజంగా నల్ల బంగారమే అంటారు. సౌందర్య పోషణకు వాడే ఫేస్‌ప్యాక్‌లతోపాటు కాస్మోటిక్స్, సబ్బులలో వాడకం అధికం. ఆటోమొబైల్‌లో కీలకమైన స్పేర్ పార్టుల తయారీ, రక్షణ రంగంలో యుద్ధ పరికరా లు, గ్యాస్ మాస్కుల తయారీలో వినియోగిస్తారు. పెట్రోలియం, గ్యాస్ ఉత్పత్తిలో అధిక శాతం రికవరీకి ఇది దోహదపడుతుంది. నీటిలోని క్లోరిన్, పురుగు మందులు, మలినాలను, వైరస్, బ్యాక్టీరియాలను నివారిస్తుంది. దీనిలో అధిక ఉష్ణ విలువ ఉంటుంది. మండించడానికి సమర్థవంతమైన ఇంధన వనరు గా ఉపయోగపడుతుంది. చిప్ప బొగ్గుతో భూమిలో వేగంగా సేంద్రియ కర్భనం ఉత్పత్తి అవుతుంది. బాగా ఆరిన కొబ్బరి చిప్ప బొగ్గు అత్యధిక ధర కేజీ రూ.35 నుంచి రూ.38 వరకు ఉండగా, ఈ ఏడాది ఆశించిన ఎగుమతులు లేకపోవడంతో ధర తగ్గిపోయింది. ప్రస్తుతం కేజీ రూ.24 నుంచి రూ.26 కాగా, తడిసిన బొగ్గు ధర రూ.19 వరకు మాత్రమే ఉంది. దీనివల్ల నష్టపోతున్నామని, ఎగుమతులు లేక సరుకు పెద్ద ఎత్తున పేరుకుపోయిందని, అక్టోబర్ నుంచి మంచి ధర వస్తుందని తయారీదారులు ఆశలు పెట్టుకున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రోత్సాహం వన్ డిస్ట్రిక్ట్.. వన్ ప్రొడెక్టులో భాగంగా కోనసీమ జిల్లాను కొబ్బరికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ చిప్ప బొగ్గు తయారీ పరిశ్రమలను ప్రోత్సహించాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. కోకోనట్ బోర్డు, ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రూ.25 లక్షల విలువైన యూనిట్‌కు 35 శాతం వరకు రాయి తీ అందించనుంది. అంతకన్నా పెద్ద ప్రాజెక్టు పెట్టుకుంటే రూ.పది లక్షల వరకు రాయితీ ఇవ్వనున్నా రు. జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీ (జైకా) ఆధ్వర్యంలో రూ.3 కోట్లతో జిల్లాలో కోకోనట్ మిల్క్ యూనిట్‌తోపాటు కోకోనట్ చార్ కోల్ పరిశ్రమ ఏర్పాటుకు ఉద్యానశాఖ సన్నాహాలు చేస్తోంది. మన్నిక ఎక్కువ.. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటక కన్నా ఇక్కడ ఉత్పత్తి అవుతున్న బొగ్గు నాణ్యమైంది. చిప్ప దళసరి కావడంతోపాటు దీనిలో అధిక శాతం గ్యాస్ నిక్షిప్తమైనందున ఇది వేగంగా మండుతోంది. మిగిలిన రాష్ట్రాలలో ఆరు బయట బొగ్గు తయారీ ఎక్కువ. కోనసీమలో బొగ్గు తయారీ డ్రమ్ములలో చేస్తారు. దీనివల్ల బూడిద శాతం తక్కువగా ఉంటోంది. ఇక్కడ తయారయ్యే బొగ్గు ఎక్కువ కాలం మన్నిక ఉండడంతోపాటు ధృడంగా ఉంటుంది. మార్కెట్ అవకాశాలు పెరగాలి మనం తయారు చేసే బొగ్గే అత్యంత నాణ్యమైంది. మార్కెటింగ్ అవకాశాలు పెద్దగా లేక అనుకున్న ధర రావడం లేదు. ఇతర ప్రాంతాల వారు ఇక్కడ నుంచి బొగ్గు తీసుకెళ్లి మరింత నాణ్యంగా తయారు చేసి కేజీ రూ.50 నుంచి రూ.70 చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. మనకు మాత్రం ఆ ధర రావడం లేదు. మార్కెటింగ్ అవకాశాలు పెరిగితే మరింత ధర వచ్చే అవకాశముంది.– మట్టపర్తి రామకృష్ణ,ముంజువరం, పి.గన్నవరం మండలం అత్యంత ధృడమైంది ఇక్కడ తయారయ్యే కొబ్బరి చిప్పలో 80 నుంచి 90 శాతం మేర చిన్న చిన్న రంధ్రాలు ఉండడంతో ఎక్కువ కాలం మన్నిక ఉండడంతోపాటు ధృడంగా ఉంటోంది. ఆటోమొబైల్, రక్షణ పరికరాలు, పెట్రోలియం ఉత్పత్తుల తయారీలో అధికంగా వాడుతున్నారు. – ఎ.కిరిటీ, ఉద్యాన శాస్త్రవేత్త, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట -
జంతువులు నేర్పిన పాఠం ..వీడియో వైరల్
మనిషి అంటేనే స్వార్థానికి పర్యాయపదంగా మారిన రోజులు ఇవి. ఏదైనా నాది, మాది అకుంటాడే తప్ప మనది అనే మాట రానేరాదు. అత్యాశతో కావాల్సిన దానికంటే ఎక్కువగా కూడబెట్టుకుంటాడు. అవరానికి మించిన వనరులను సమకూర్చుకుంటాడు. ఆపద వస్తే ఆదుకునేందుకు కూడా ముందుకు రాడు. ఎదుటి వారికి సాయం చేసే గుణం ఎప్పుడో పోయింది. కోటికి ఒక్కరో ఇద్దరో నిస్వార్థంగా పొరుగువారికి సాయం చేస్తున్నారు తప్ప దాదాపు అంతా స్వార్థపరులే. కానీ జంతువులు అలా కాదు. అవి తమకు కావాల్సినదాన్నే తీసుకుంటాయి తప్ప.. అత్యాశతో ఎక్కువగా తీసుకుపోదు. తనకు హాని లేనంత వరకు ఇతర జంతువుల జోలికి పోదు. పగ, ప్రతీకారాలు ఉండవు. అత్యాశా అసలే ఉండదు. కులం, మతం అనే భేదాలు ఉండవు. కొన్ని కొన్ని సార్లు జంతువులు మనకు గుణపాఠాన్ని నేర్పుతాయి. అవి యాధృచ్చికంగా చేసిన పనులే మనకు ఓ మంచి మర్గాన్ని చూచిస్తాయి. దానికి నిదర్శనం తాజా వీడియోనే. (చదవండి : వార్ని.. కోపంతో కోట్ల విలువైన కారునే కాల్చేశాడుగా..) ఓ చిన్న వాటర్ హోల్ వద్ద ఉన్న నీటిని వివిధ రకాల జంతువులు, పక్షులు చక్కగా వినియోగించుకుంటున్నాయి. ఒకదాని తర్వాత ఒక్కటి వచ్చి దాహాన్ని తీర్చుకొని వెళ్లిపోతున్నాయి. ఇతర జంతువులను అడ్డుకోవడం కానీ, లేదంటే అక్కడి ప్రదేశాన్ని నాశనం చేయడం కానీ చేయలేదు. ఆ చిన్నవాటర్ హోల్ దగ్గరికి కొన్ని గంటల వ్యవధిల్లోనే తోడేళ్లు, పాములు, కుందేళ్లు, కోడిపిల్లలు, ఎలుగు బంటులు వచ్చి దాహం తీర్చుకొని వెళ్లాయి. 57 సెంకడ్ల నిడివి గల ఈ వీడియోని ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..‘తక్కువ వినియోగించి ఎక్కువ షేర్ చేయండి. అడవి జంతువు దీంట్లో ముందుంటాయి. ఒక సింగిల్ వాటర్ హోల్‌ని గంటల వ్యవధిల్లోనే ఎన్ని జంతువులు వినియోగించుకున్నాయో చూడండి. ఒక్క సోర్స్‌ని ఎన్ని రకాల జంతువులు వినియోగించుకున్నాయో లెక్కించండి. వీటి ద్వారా మనం చాలా నేర్చుకోవాలి’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. ఈ వీడియోపై నెటిజన్లు ప్రంశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘జంతువులను చూసి మనం చాలా నేర్చుకోవాలి’. ‘దురదృష్టవశాత్తు మనిషి ఇతరుకు పంచడం(షేరింగ్), జాగ్రత్తగా చూసుకోవడం (కేరింగ్) లాంటి వాటిని ఎప్పుడో మర్చిపోయాడు’, *నీటి ప్రాధాన్యత తెలియజేసే వీడియో ఇది’,‘అవి కులం, మతం అనే వాటికి దూరంగా ఉన్నాయి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
నల్లా ‘సౌ’లత్..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: నల్లా కనెక్షన్ డిపాజిట్లు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూరనున్నది. మిషన్ భగీరథ పథకం ద్వారా పట్టణాలు, నగరాలకు స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం పంపు కనెక్షన్ డిపాజిట్లను రూ.100కు తగ్గించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులను ప్రభుత్వం రేపో.. మాపో జారీ చేయనుంది. ఇప్పటివరకు జిల్లాలోని ఖమ్మంతోపాటు మధిర, వైరా, సత్తుపల్లి ప్రాంతాల్లో ఉన్న నివాసాలన్నింట్లో.. 50 శాతం మంది మాత్రమే పంపు కనెక్షన్లు కలిగి ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జిల్లాలోని అన్ని నివాస ప్రాంతాల్లో పంపు కనెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు సెక్యూరిటీ డిపాజిట్ ఎక్కువగా ఉండడంతో ఇంటి యజమానులు ముందుకు రాలేదు. ప్రస్తుతం డిపాజిట్లు తగ్గించడంతో నూటికి నూరు శాతం మంది పంపు కనెక్షన్లు తీసుకునే అవకాశం ఉంది. అక్రమ కనెక్షన్లను సైతం సక్రమంగా మార్చుకునేందుకు ఇది ఉపయోగపడనుంది. జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ద్వారా పంపు కనెక్షన్లు తీసుకోవాలంటే డిపాజిట్‌గా చెల్లించే సొమ్ము ఎక్కువగా ఉంటోంది. అయితే ప్రజలందరికీ సురక్షితమైన, మంచినీటిని అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం పంపు కనెక్షన్లకు ఉన్న డిపాజిట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి పంపు కనెక్షన్ కావాలంటే రూపాయి డిపాజిట్‌గా చెల్లిస్తే సరిపోయేది. ఇతరులు పంపు కనెక్షన్ తీసుకోవాలంటే సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.6,500 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే నెలకు రూ.110 చెల్లించాలి. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పంపు కనెక్షన్ కావాల్సిన వారు సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. ఇక పంపు బిల్లు ప్రతినెలా రూ.110 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఖమ్మం కార్పొరేషన్లో.. నగరంలో సుమారు 4 లక్షల వరకు జనాభా ఉన్నారు.. మొన్నటి వరకు మున్సిపాలిటీగా ఉన్న పట్టణం తొమ్మిది విలీన గ్రామాలతో కార్పొరేషన్‌గా అవతరించింది. నగర పరిధిలో 63,304 గృహాలు ఉన్నట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఇందులో 31,500 మాత్రమే పంపు కనెక్షన్లు ఉన్నాయి. కేవలం 50 శాతం మంది మాత్రమే పంపు కనెక్షన్లు కలిగి ఉన్నారు. ప్రస్తుతం డిపాజిట్‌ను రూ.100కు తగ్గించడంతో మధ్య తరగతి వర్గాలకు ఊరట లభించనున్నది. కేవలం నెలవారీ పన్ను మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. కార్పొరేషన్లో ఇప్పటివరకు 217 పంపు కనెక్షన్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. డిపాజిట్ తగ్గడంతో వాటిని పరిష్కరించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మున్సిపాలిటీల్లోనూ పెరగనున్న కనెక్షన్లు.. జిల్లాలోని వైరా, సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీల్లో కూడా అనేక గృహాలకు పంపు కనెక్షన్లు లేవు. సెక్యూరిటీ డిపాజిట్ ఎక్కువగా ఉందనే కారణంతో అనేక మంది పంపు కనెక్షన్లు పెట్టించుకోలేదు. ప్రస్తుతం సెక్యూరిటీ డిపాజిట్ రూ.100కు తగ్గించడంతో ఈ మున్సిపాలిటీల్లో కూడా పంపు కనెక్షన్లు పెరిగేందుకు ఆస్కారం ఉంది. మధిర మున్సిపాలిటీ పరిధిలో 9,048 గృహాలు ఉండగా.. 5,205 పంపు కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి. రూపాయి డిపాజిట్ కింద ఇవ్వాల్సిన కనెక్షన్లు 2,688 పెండింగ్‌లో ఉన్నాయి. వైరాను ఇటీవలే మున్సిపాలిటీగా ప్రకటించారు. ఇక్కడ 6,355 గృహాలు ఉండగా.. 2,500 పంపు కనెక్షన్లు ఉన్నాయి. సత్తుపల్లి మున్సిపాలిటీలో 7,321 గృహాలు ఉండగా.. 5,316 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ పైపులైన్ల పనులు కూడా పూర్తి కావొచ్చాయి. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే దరఖాస్తు చేసుకున్న వారికి పంపు కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఆదేశాలు రాగానే.. పంపు కనెక్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే నగరంలో అమలు చేస్తాం. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఇంటికీ కనెక్షన్లు ఇస్తాం. నగరంలో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వచ్ఛమైన నీటిని పొందాలి. – జె.శ్రీనివాసరావు, కేఎంసీ కమిషనర్ -
‘మిషన్ భగీరథ’ ఓ అద్భుతం
గజ్వేల్ రూరల్: తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడంతో పాటు ఫ్లోరైడ్ ప్రాంతాల్లో సురక్షితమైన తాగునీటిని సరఫరా చేయడం అభినందనీయమని, మిషన్ భగీరథ అద్భుతమైన పథకమని గుజరాత్‌కు చెందిన వాటర్మాన్ ఆఫ్ ఇండి యా రాజేంద్రసింగ్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిధిలోని కోమటిబండ గుట్టపై నిర్మించిన ‘మిషన్ భగీరథ’హెడ్‌వర్క్స్ ప్రాంతాన్ని బుధవారం టీడబ్ల్యూఆర్డీసీ(తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్) చైర్మన్ ప్రకాశ్ నేతృత్వంలో రాజేంద్రసింగ్, ఇరిగేషన్ శాఖ రిటైర్డ్ ఈఎన్సీ బీఎస్ఎన్ రెడ్డితో పాటు 25 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు, మేధావులు, శాస్త్రవేత్తలు సందర్శించారు. ఈ సందర్భంగా వారు నీటి సరఫరా తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజేంద్రసింగ్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ తరహా పథకాన్ని ఇతర రాష్ట్రాల్లో సైతం అమలు చేయాలని సూచించారు. అలాగే మిషన్ కాకతీయ పథకం ద్వారా భూగర్భజలాలు పెరగడంతోపాటు ఫ్లోరైడ్ సమస్య కూడా తీరుతుందన్నారు. ప్రకాశ్ మాట్లాడుతూ.. ఎండాకాలం వస్తే తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడేవని.. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భగీరథ పథకం ద్వారా ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతుందని అన్నారు. -
అందరు ఉన్నా..తాగేందుకు నీళ్లు పోయలేదు...
శాలిగౌరారం (తుంగతుర్తి) : నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిని కొడుకులు..తొలిదైవంగా భావిస్తారు. ఆ తల్లిని..ఈలోకం విడిచే వరకు ఏలోటు రాకుండా చూసుకోవాల్సిన వారు కనీస మానవ విలువలను మరిచి తాగేందుకు నీళ్లు, తినేందుకు తిండికూడా పెట్టకుండా మాడుస్తూ ఇంటినుండి బయటకు తరిమేశారు. ఈ హృదయవిదారక ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మాధారంకలాన్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. మాధారంకలాన్ గ్రామానికి చెందిన తీగల యాదమ్మ(80)కు ప్రస్తుతం వివాహితులైన ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. యాదమ్మ భర్త వెంకయ్య 15 సంవత్సరాల క్రితమే మృతిచెందాడు. దీంతో యాదమ్మ తన ఇద్దరు కొడుకుల వద్దనే ఉంటూ జీవించింది. అన్నదమ్ముల మధ్య తల్లి పోషణ విషయంలో తగాదాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి యాదమ్మకు రెండవ కుమారుడి ఇంటిఆవరణలో ప్రత్యేకంగా ఒక రేకులగదిని నిర్మించారు. కానీ కోతుల వీరంగాలతో ఆ గది రేకులు మొత్తం ధ్వంసమయ్యాయి. ఇదిలాఉండగా పెద్దకుమారుడు కుటుంబీకులతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. పెయింటింగ్ పనులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండవ కుమారుడు మాత్రం గ్రామంలోనే కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లికి నిర్మించిన గదికి తిరిగి పైకప్పు వేసేందుకు అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవడంతో పట్టించుకోలేదు. ఆమె పైకప్పులేని ఇంట్లో ఉండలేక పలుమార్లు గ్రామపెద్దలను, చివరకు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. గ్రామపెద్దల మాటలను కూడా తన కుమారులు పట్టించుకోకపోవడంతో మూడేళ్ల క్రితం ఇళ్లు వదిలి వెళ్లింది. అప్పటినుంచి రెండు సంవత్సరాలు నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు దేవాలయం వద్ద ఉంటూ యాచకవృత్తిపై ఆధారపడి జీవించింది. ఆ సమయంలో ఆమె ఆరోగ్యం క్షీణించడంతో అక్కడివారు నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న యాదమ్మ కుమార్తెలు తమవద్దనే ఉండేందుకు రమ్మని తల్లిని కోరారు. ఆరోగ్యం బాగుపడిన తర్వాత ఐదు నెలల క్రితం యాదమ్మ నకిరేకల్ వచ్చి అక్కడ ఓ గదిని అద్దెకు తీసుకొని ఆసరా పింఛన్ సాయంతో జీవించింది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం మరోసారి క్షీణించడంతో ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుండగా మర్రూరుకు చెందిన ఆమె రెండవ కుమార్తె తన ఇంటికి తీసుకెళ్లి సాకుతోంది. విషయం తెలుసుకున్న యాదమ్మ పెద్ద కుమారుడు దశరథ తన చెల్లెలుకు పలుమార్లు ఫోన్‌చేసి దుర్భాషలాడాడు. దీంతో యాదమ్మ ముగ్గురు కుమార్తెలు శుక్రవారం తమ తల్లిని తీసుకొని మాధారంకలాన్ వచ్చారు. తల్లిని అన్నల ఇంట్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా వారు తమ ఇంట్లోకి తీసుకురావద్దంటూ అడ్డుకున్నారు. దీంతో వారు చేసేదేమీలేక పెద్దకుమారుడు దశరథ ఇంటిముందు ఉన్న కానుగుచెట్టకింద తల్లిని వదిలి వెళ్లిపోయారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మంచానికి పరిమితమైన ఆ వృద్ధతల్లి శుక్రవారం నుంచి వీధిలోని చెట్టుకిందనే జీవచ్ఛవంలా పడిఉంది. చుట్టుపక్కలవారు వృద్ధురాలు పడే నరకయాతనను చూడలేక మంచీళ్లు ఇవ్వడంతోపాటు బుక్కెడన్నం పెట్టి ప్రాణం కాపాడారు. కానీ ఆమె కొడుకులు, కోడళ్లు, మనుమలు, మనుమరాల్లు అటువైపు కన్నెత్తికూడా చూడకపోవడం శోచనీయం. -
కలెక్టర్‌ను చుట్టుముట్టిన ప్రజలు
-నీటి సమస్య తీర్చాలని మొర - ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పల్లెపిలుపు- కలెక్టర్ కోడుమూరు రూరల్ : తాగునీటి సమస్యపై జిల్లా కలెక్టర్ సత్యనారాయణను కోడుమూరులో ప్రజలు చుట్టుముట్టారు. పదిరోజులకోసారి కూడా నీళ్లు రావడం లేదని, హంద్రీనదికి గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయించాలని మొరపెట్టుకున్నారు. శుక్రవారం కోడుమూరు పట్టణంలోని ఎస్సీ కాలనీలో పల్లెపిలుపు కార్యక్రమం నిర్వహించారు. ఆయన రాగానే ప్రజలు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ వర్షాభావ పరిస్థితుల వల్ల గాజులదిన్నె ప్రాజెక్టులో తగినంత నీరు లేదని, నీళ్ల సమస్య పరిష్కారానికి ట్యాంకర్లను ఏర్పాటు చేసి ఆయా కాలనీలకు మంచినీళ్లను సరఫరా చేయిస్తామని హామీచ్చారు. అలాగే పెండింగ్‌లో ఉన్న కొత్త ఇళ్లు, వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లులు అర్హత గల వారందరికీ త్వరలో మంజూరవుతాయన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే పల్లె పిలుపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. బడి ఈడు పిల్లలనంతా బడిలో చేర్పించాలని చెప్పారు. జూలై 1నుంచి అన్న అమృతహస్తం కింద గర్భిణిలకు అంగన్వాడీ సెంటర్లలో మధ్యాహ్న భోజనం పెడతామన్నారు. 2016 సంవత్సరంలో పంటలు నష్టపోయిన రైతుల కోసం జిల్లాకు రూ.325కోట్ల ఇన్పుట్ సబ్సిడీ మంజూరైందని, త్వరలో రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. అనంతరం ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీసి వాటిని వెంటనే పరిష్కరించాలని మండల అధికారులను ఆదేశించారు. అంతకుముందు పట్టణంలో నెలకొన్న నీటి సమస్యపై గ్రామ సర్పంచు సీబీ లత, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి కృష్ణ, సీపీఎం డివిజన్ కార్యదర్శి సోమన్న జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పించారు. అనంతరం వెల్దుర్తి రోడ్డులో నిర్మిస్తున్న చెత్తశుద్ధి కేంద్రాన్ని, ఎస్బీఐ బ్రాంచ్‌ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. అర్హత గల కౌలురైతులకు, రైతులకు పంట రుణాలివ్వాలని బ్రాంచ్ మేనేజర్ చంద్రశేఖర్‌కు సూచించారు. కార్యక్రమంలో నోడలాఫీసర్ భాస్కర్‌రెడ్డి, డీఎల్పీఓ విజయకుమార్, ఎంపీడీఓ అదెయ్య, తహసీల్దార్ రామకృష్ణ, ఏపీడీ రాఘవేంద్ర, ఏపీఎం వీరన్న, ఏపీఓ మోదీన్‌బాషా, ఎంఈఓ అనంతయ్య, ట్రాన్స్‌కో, హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు ప్రియాంక, ఫారుక్హుసేన్, మల్లికార్జున, ఈఓఆర్డీ రామకృష్ణ, ఆర్ఐ మధుమతి తదితరులున్నారు.