కలెక్టర్‌ను చుట్టుముట్టిన ప్రజలు
కలెక్టర్‌ను చుట్టుముట్టిన ప్రజలు
Published Fri, Jun 23 2017 10:14 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
-నీటి సమస్య తీర్చాలని మొర
- ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పల్లెపిలుపు- కలెక్టర్
కోడుమూరు రూరల్ : తాగునీటి సమస్యపై జిల్లా కలెక్టర్ సత్యనారాయణను కోడుమూరులో ప్రజలు చుట్టుముట్టారు. పదిరోజులకోసారి కూడా నీళ్లు రావడం లేదని, హంద్రీనదికి గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయించాలని మొరపెట్టుకున్నారు. శుక్రవారం కోడుమూరు పట్టణంలోని ఎస్సీ కాలనీలో పల్లెపిలుపు కార్యక్రమం నిర్వహించారు. ఆయన రాగానే ప్రజలు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ వర్షాభావ పరిస్థితుల వల్ల గాజులదిన్నె ప్రాజెక్టులో తగినంత నీరు లేదని, నీళ్ల సమస్య పరిష్కారానికి ట్యాంకర్లను ఏర్పాటు చేసి ఆయా కాలనీలకు మంచినీళ్లను సరఫరా చేయిస్తామని హామీచ్చారు. అలాగే పెండింగ్‌లో ఉన్న కొత్త ఇళ్లు, వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లులు అర్హత గల వారందరికీ త్వరలో మంజూరవుతాయన్నారు.
ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే పల్లె పిలుపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. బడి ఈడు పిల్లలనంతా బడిలో చేర్పించాలని చెప్పారు. జూలై 1నుంచి అన్న అమృతహస్తం కింద గర్భిణిలకు అంగన్‌వాడీ సెంటర్లలో మధ్యాహ్న భోజనం పెడతామన్నారు. 2016 సంవత్సరంలో పంటలు నష్టపోయిన రైతుల కోసం జిల్లాకు రూ.325కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరైందని, త్వరలో రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. అనంతరం ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీసి వాటిని వెంటనే పరిష్కరించాలని మండల అధికారులను ఆదేశించారు. అంతకుముందు పట్టణంలో నెలకొన్న నీటి సమస్యపై గ్రామ సర్పంచు సీబీ లత, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి కృష్ణ, సీపీఎం డివిజన్ కార్యదర్శి సోమన్న జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పించారు.
అనంతరం వెల్దుర్తి రోడ్డులో నిర్మిస్తున్న చెత్తశుద్ధి కేంద్రాన్ని, ఎస్‌బీఐ బ్రాంచ్‌ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. అర్హత గల కౌలురైతులకు, రైతులకు పంట రుణాలివ్వాలని బ్రాంచ్ మేనేజర్ చంద్రశేఖర్‌కు సూచించారు. కార్యక్రమంలో నోడలాఫీసర్ భాస్కర్‌రెడ్డి, డీఎల్‌పీఓ విజయకుమార్, ఎంపీడీఓ అదెయ్య, తహసీల్దార్ రామకృష్ణ, ఏపీడీ రాఘవేంద్ర, ఏపీఎం వీరన్న, ఏపీఓ మోదీన్‌బాషా, ఎంఈఓ అనంతయ్య, ట్రాన్స్‌కో, హౌసింగ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈలు ప్రియాంక, ఫారుక్‌హుసేన్, మల్లికార్జున, ఈఓఆర్డీ రామకృష్ణ, ఆర్‌ఐ మధుమతి తదితరులున్నారు.
Advertisement