చెట్టుకింద కదల్లేని స్థితిలో మంచంలో పడిఉన్న వృద్ధురాలు యాదమ్మ
శాలిగౌరారం (తుంగతుర్తి) : నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిని కొడుకులు..తొలిదైవంగా భావిస్తారు. ఆ తల్లిని..ఈలోకం విడిచే వరకు ఏలోటు రాకుండా చూసుకోవాల్సిన వారు కనీస మానవ విలువలను మరిచి తాగేందుకు నీళ్లు, తినేందుకు తిండికూడా పెట్టకుండా మాడుస్తూ ఇంటినుండి బయటకు తరిమేశారు. ఈ హృదయవిదారక ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మాధారంకలాన్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. మాధారంకలాన్ గ్రామానికి చెందిన తీగల యాదమ్మ(80)కు ప్రస్తుతం వివాహితులైన ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. యాదమ్మ భర్త వెంకయ్య 15 సంవత్సరాల క్రితమే మృతిచెందాడు. దీంతో యాదమ్మ తన ఇద్దరు కొడుకుల వద్దనే ఉంటూ జీవించింది. అన్నదమ్ముల మధ్య తల్లి పోషణ విషయంలో తగాదాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి యాదమ్మకు రెండవ కుమారుడి ఇంటిఆవరణలో ప్రత్యేకంగా ఒక రేకులగదిని నిర్మించారు. కానీ కోతుల వీరంగాలతో ఆ గది రేకులు మొత్తం ధ్వంసమయ్యాయి. ఇదిలాఉండగా పెద్దకుమారుడు కుటుంబీకులతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. పెయింటింగ్ పనులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండవ కుమారుడు మాత్రం గ్రామంలోనే కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
తల్లికి నిర్మించిన గదికి తిరిగి పైకప్పు వేసేందుకు అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవడంతో పట్టించుకోలేదు. ఆమె పైకప్పులేని ఇంట్లో ఉండలేక పలుమార్లు గ్రామపెద్దలను, చివరకు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. గ్రామపెద్దల మాటలను కూడా తన కుమారులు పట్టించుకోకపోవడంతో మూడేళ్ల క్రితం ఇళ్లు వదిలి వెళ్లింది. అప్పటినుంచి రెండు సంవత్సరాలు నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు దేవాలయం వద్ద ఉంటూ యాచకవృత్తిపై ఆధారపడి జీవించింది. ఆ సమయంలో ఆమె ఆరోగ్యం క్షీణించడంతో అక్కడివారు నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న యాదమ్మ కుమార్తెలు తమవద్దనే ఉండేందుకు రమ్మని తల్లిని కోరారు. ఆరోగ్యం బాగుపడిన తర్వాత ఐదు నెలల క్రితం యాదమ్మ నకిరేకల్ వచ్చి అక్కడ ఓ గదిని అద్దెకు తీసుకొని ఆసరా పింఛన్ సాయంతో జీవించింది.
ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం మరోసారి క్షీణించడంతో ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుండగా మర్రూరుకు చెందిన ఆమె రెండవ కుమార్తె తన ఇంటికి తీసుకెళ్లి సాకుతోంది. విషయం తెలుసుకున్న యాదమ్మ పెద్ద కుమారుడు దశరథ తన చెల్లెలుకు పలుమార్లు ఫోన్‌చేసి దుర్భాషలాడాడు. దీంతో యాదమ్మ ముగ్గురు కుమార్తెలు శుక్రవారం తమ తల్లిని తీసుకొని మాధారంకలాన్ వచ్చారు. తల్లిని అన్నల ఇంట్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా వారు తమ ఇంట్లోకి తీసుకురావద్దంటూ అడ్డుకున్నారు. దీంతో వారు చేసేదేమీలేక పెద్దకుమారుడు దశరథ ఇంటిముందు ఉన్న కానుగుచెట్టకింద తల్లిని వదిలి వెళ్లిపోయారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మంచానికి పరిమితమైన ఆ వృద్ధతల్లి శుక్రవారం నుంచి వీధిలోని చెట్టుకిందనే జీవచ్ఛవంలా పడిఉంది. చుట్టుపక్కలవారు వృద్ధురాలు పడే నరకయాతనను చూడలేక మంచీళ్లు ఇవ్వడంతోపాటు బుక్కెడన్నం పెట్టి ప్రాణం కాపాడారు. కానీ ఆమె కొడుకులు, కోడళ్లు, మనుమలు, మనుమరాల్లు అటువైపు కన్నెత్తికూడా చూడకపోవడం శోచనీయం.
Comments
Please login to add a commentAdd a comment