ద్రుపద ధృష్టద్యుమ్నులు
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 20
పృషతుడనే రాజు పాంచాల దేశాన్ని పరిపాలించేవాడు. అతని కొడుకు పేరు ద్రుపదుడు. ఇతన్ని యజ్ఞసేనుడని కూడా పిలుస్తారు. ద్రుపదుడికి పుట్టిన వాళ్లం దరూ గడ్డుగడ్డువీరుల్ని వధించడానికి పుట్టినవాళ్లే. కౌరవులపైనున్న హేమా హేమీల్లో భీష్ముడూ ద్రోణుడూ ముఖ్యమైన వాళ్లు. వాళ్లను జయించడం దాదాపుగా అసంభవమే. భీష్ముడికేమో స్వచ్ఛంద మరణమనే అరుదైన వరముంది. ఎవడూ తనకుగా తాను చావాలని కోరుకోడు గదా! మరి అటువంటివాణ్ని చంపడానికి ఎటువంటివాడు ఎలాగ పుట్టాలో భగ వంతుడికే ఎరుక!
నముచి అనే రాక్షసుడు, తాను తడిదానితో గానీ పొడిదానితో గానీ చావకూడదన్న అపురూపమైన వరాన్ని కోరుకొన్నాడు. నముచి కోసం తడీ పొడీ కానిదైన నురుగు చావై కూర్చుంది. నురుగు నీళ్ల నుంచి వచ్చింది గనక తడిదేమో అనిపిస్తుంది; కాని అది పొడిగా ఉన్నట్టుగా ఉంటుంది. వజ్రాయుధానికి నురుగును పట్టించి ఇంద్రుడు నముచిని చంపాడు. ‘నముచి’ అంటే, వదలదని అర్థం. అటువంటి వదలని జబ్బునే ఉపాయంతో పోగొట్టారు.
అలాగే, స్వచ్ఛంద మరణమున్న భీష్ముణ్ని చంపించడానికీ రుద్రుడు అంబకు వరమిచ్చాడు. అంబను సాల్వుడనే ఆమె ప్రియుడికి చెందకుండా చేసిన నేరానికి భీష్ముడంటే జన్మజన్మాంతర వైరం పట్టుకొంది అంబను. శివుడు ఆవిడకు ప్రత్యక్షమై, ‘నువ్వు ఆడదానివై పుట్టినా, మగవాడివై మరీ భీష్ముణ్ని చంపుతావు’ అని వరమిచ్చాడు. ఆవిడ యమున ఒడ్డునే చితిని పేర్చుకొని, ‘భీష్ముణ్ని చంపడానికి వెళ్తున్నాను’ అని అంటూ చితిలో ప్రవేశించింది.
అదే సమయంలో ద్రుపదుడు మగ సంతానం కోసం ‘నాకు ఆడపిల్లగాదు, మగపిల్లవాడు పుట్టాలి’ అంటూ ఘోర తపస్సు చేశాడు. అతనికీ రుద్రుడే ఎదురుగా అవుపించి, అంబకిచ్చిన వరాన్ని సార్థకం చేయడానికి, ‘నీకు ఆడపిల్లే పుడుతుంది గానీ మగాడిగా మారుతుందిలే తరవాత’ అంటూ వరమిచ్చాడు. భీష్ముడు గొప్ప విలుకాడు. అంచేత అతనికి వ్రతాలూ చాలానే ఉన్నాయి. మనకు తెలిసిన రాజ్య సింహాసనాన్ని ఎక్కకపోవడమూ ఆజన్మాంతం బ్రహ్మచర్యాన్ని పాటించడమూ అనేవే కాకుండా యుద్ధంలో పాటించే వ్రతాలు కూడా కొన్ని ఉన్నాయి. అవే స్వచ్ఛంద మరణాన్ని కూడా దాటి అతని పతనాన్ని శాసించాయి.
మహాయుద్ధం ప్రారంభమై తొమ్మిది రోజులైపోయినా భీష్ముడు ధర్మరాజు జయించడానికి పెద్దగోడలాగ నిలుచు న్నాడు. ఇక లాభం లేదని, ధర్మరాజు తన తమ్ముళ్లతోనూ శ్రీకృష్ణుడితోనూ కలిసి, ఆ రోజు రాత్రి, శస్త్ర కవచాల్ని పక్కకు పెట్టి భీష్ముడి దగ్గరికి వెళ్లాడు. ‘‘తాతయ్యా! మేమెలా గెలవగలం?’ అని సూటిగా అడిగాడు. ‘‘అవును, నేను బతికుండగా నీకు జయమెలాగ దొరుకుతుంది? నేను యుద్ధంలో నిలుచుంటే, సాక్షాత్తూ ఇంద్రుడొచ్చినా జయించలేడు.
అయితే, నాకు కొన్ని వ్రతాలున్నాయి. శస్త్రం కింద పెట్టేసినవాడితోనూ కిందజారిపడిన వాడితోనూ కవచమూ ధ్వజమూ లేనివాడితోనూ భయంతో పారిపోయే వాడితోనూ ‘నేను నీ వాణ్నే’ అని శరణుజొచ్చినవాడితోనూ స్త్రీతోనూ స్త్రీలాంటి పేరుపెట్టుకొన్నవాడితోనూ ముందు స్త్రీగా ఉండి, ఆ మీద మగవాడిగా మారినవాడితోనూ దెబ్బతిని కలవరపడేవాడితోనూ తన నాన్నకు ఒక్కడే కొడుకైనవాడితోనూ అపకీర్తిమంతుడితోనూ నేను యుద్ధం చేయడానికి ఇష్టపడను. అప్పుడు మహారథులు నన్ను పడగొట్టగలుగు తారు’’ అని తన చావుకు తానే మంత్రం చెప్పాడు భీష్ముడు.
శిఖండి మొదట ఆడపిల్ల, ఆ మీదట మగవాడయ్యాడు. అహంకారానికున్న దురభిమానం కొద్దీ అటువంటి శిఖండితో అది యుద్ధం చెయ్యదు. యుద్ధంలో ఉండీ యుద్ధం చెయ్యకపోతే చావు రావడం తథ్యం. అది ఒకలాగ స్వచ్ఛందంగా చావడమే. మగవాడిగా పుట్టకపోయినా శివుడి మాటను బట్టి, ద్రుపదుడు కూతురుగా పుట్టిన ‘అతనికి’ యుద్ధ విద్యను నేర్పించాడు. ద్రోణుడే అతనికి ఆచార్యుడయ్యాడు. అర్జునుడు, భారతయుద్ధం పదోరోజున శిఖండిని తన రథంలో నిలుచోబెట్టుకొని బాణాలు వేయించి, భీష్ముణ్ని అస్త్ర సన్యాసం చేసేలాగ చేసి, ఆ మీద తానే, మర్మాల్ని తాకేలాగ అస్త్రాల్ని వేసి, అతన్ని పడగొట్టాడు. ఎంతటివాడైనా చావు ముందు తలవంచవలసిందే. స్వచ్ఛంద మరణాల్లాంటివెన్నైనా అతన్ని కాయలేవు.
కౌరవులవైపు యుద్ధం చేసిన ప్రము ఖుల్లో రెండోవాడు ద్రోణుడు. ద్రోణుడు నిజానికి ద్రుపదుడికి సహాధ్యాయుడే. ఇద్దరూ కలిసి అగ్నివేశుడి దగ్గర విలు విద్యను అభ్యసించారు. ద్రుపదుడు క్షత్రియుడే గానీ ద్రోణుడంతటి విలుకాడు గాడు. ద్రోణుడు బ్రాహ్మణుడే అయినా సర్వ క్షత్రియులకూ పరశురాముడి మాదిరిగా భయంకరుడు. ఇతను పరశురాముణ్నించే అస్త్రాలను నేర్చు కున్నాడు. అదీగాక, బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని అభ్యసించినవాడు.
ద్రోణుడికి కృపితో పెళ్లై అశ్వత్థామ పుట్టిన తరవాత చాలా దారిద్య్రాన్ని అనుభ వించాడు. పృషతుడు పోయిన మీదట, ద్రుపదుడు పాంచాల రాజయ్యాడు. చిన్నప్పటి సఖిత్వాన్ని పురస్కరించుకొని ఎంతో కొంత ఇవ్వకపోతాడా అన్న భరోసాతో ద్రుపదుడి దగ్గరికి పోయి, ఆ మునపటి సఖిత్వాన్ని గుర్తుకు తీసుకు రాబోయాడు. స్నేహం ఇద్దరు సమానుల మధ్య ఉంటుంది గానీ ఒక పేదవాడికీ రాజుకీ మధ్య ఉండదు. రాజుకీ రాజుకీ మధ్య స్నేహం కుదురుతుంది. ఇటువంటి మాటలతో అవమానాన్ని పొంది, ద్రోణుడు వెళ్లిపోయాడు గానీ అతని గుండెలో ఒక బ్రాహ్మణుడికి ఉండదగని ప్రతీకార జ్వాల మాత్రం మండుతూనే ఉంది.
పాండవులకూ కౌరవులకూ విలు విద్యను నేర్పడానికి ముందే గురువేతనం ఇదీ అని చెప్పాడు. అర్జునుడు ఆ ప్రతీ కారాన్ని తీర్చిపెట్టాడు. అహిచ్ఛత్రాన్ని ముట్టడించి, ద్రుపదుణ్ని బందీ చేసి, ద్రోణుడి ముందు నిలబెట్టాడు అర్జునుడు. అప్పుడు ద్రోణుడు, ‘ఇప్పుడు నేను పాంచాల రాజును. అయినా స్నేహితుడిగా నీకు దక్షిణ పాంచాలాన్ని ఇస్తాను. ఉత్తర పాంచాలానికి మాత్రం నేనే రాజుని. ఇప్పుడు నీకూ నాకూ రాజులుగా స్నేహం కుదురుతుంది గదా’ అని ద్రుపదుణ్ని కించపరుస్తూ మాట్లాడాడు.
అప్పణ్నించీ ద్రుపదుడికి రెండు కోరికలు బయలుదేరాయి.
ద్రోణుణ్ని తానెలాగూ విలుయుద్ధంలో గెలవలేడు. అతన్ని చంపగలిగే పుత్రుడుంటేనే తన కోపం చల్లారుతుంది. అర్జునుడు గొప్ప వీరుడు గనక అతన్ని తన అల్లుడిగా చేసుకొనే వీలు కలగాలి. నిజానికి, తనను బంధించి ద్రోణుడి ముందు నిలబెట్టిన వాడే అయినా అర్జునుడంటే తోటి మేటి శూరుడిగా అభిమానం ఉండడానికి కారణం తనూ తనలాటి యుద్ధసాధకుడు కావడమే. తన కోరికల్ని తీర్చుకోవడం కోసం యాజుడూ ఉపయాజుడూ అనే యజ్ఞ నిర్వాహకుల్ని ఆశ్రయించాడు. యాజుడు చేయించిన యజ్ఞంలో, అగ్ని లోంచి కవచాన్ని ధరించిన తేజోవంతుడూ శరఖడ్గధనుర్ధారీ అయిన రథికుడొకడు పుట్టుకొని వచ్చాడు. అతనే ధృష్టద్యుమ్నుడు.
ధృష్టత్వమంటే అదరని బెదరనితనం. అటువంటివాడు ఎదురుగా ఎవరున్నా సహించడు. అగ్నిలోంచి పుట్టాడు గనక కాంతిరూపుడతను. పాండవులకు ధృష్టద్యుమ్నుడే సేనాపతి. కౌరవులకేమో వరసగా ఐదుగురయ్యారు సేనాపతులు - భీష్మ ద్రోణ కర్ణ శల్య అశ్వత్థామలు. ఒకడు అహంకారమూ రెండోవాడు సంస్కారమూ మూడోవాడు లోభమూ నాలుగోవాడు మదమూ ఐదో వాడు ఆశయమూను. అటు, పాండవుల ఏకైక సేనాపతి, ధృష్టద్యుమ్నుడంటే ఎవరు? ‘ధృష్ట’ అంటే ధైర్యంతో కూడిన విశ్వాసం; ద్యుమ్నమంటే కాంతీ బలమూ కీర్తీను.
అంచేత, ధృష్టద్యుమ్నుడంటే నిబ్బరమైన కాంతి అని అర్థం. ఏ కలతనూ కలగనీయని ప్రశాంతమైన లోపలి ప్రకాశం, సత్యాన్ని తటాలున ప్రకటింపజేసే ఆగమ దీప్తి - అంటే, స్వయంగా దానికదే లోపల నుంచి వచ్చి అర్థాన్ని ప్రకాశింపజేసే సహజమైన విజ్ఞానం. అది ఎప్పటికీ తప్పుదారి పట్టిం చదు. ప్రశాంతమూ నిర్దుష్టమూ అయిన ఈ కాంతే, ఇష్టం లేకపోయినా బలవం తంగా చేయించి మరీ ఏడిపించే అల వాటునీ జిడ్డులాగ వదలని సంస్కారాన్నీ నిర్బంధించి కాల్చివేయగలదు. అహంకా రమూ అలవాటూ కక్కుర్తీ నీల్గుడూ ఆగమకాంతి ముందు నిలవలేవు.
అయితే, లోపల పోగై ఉండే కోరికలు, మోసం తోనూ దుర్మార్గంతోనూ ఆగమకాంతిని ఆర్పివేయగలవు. ఆ కారణంగానే ధృష్టద్యు మ్నుడు నిద్రపోతూంటే, అశ్వత్థామ చేతిలో పశువు మాదిరిగా చచ్చిపోయాడు. యజ్ఞసేనుడు చేసిన ఆ యజ్ఞవేదిక నుంచే ద్రౌపది కూడా పుట్టింది. ఆవిడ, మొత్తం ధార్తరాష్ట్రులకే కాదు, హేమాహేమీలైన రాజులందరికీ కాళరాత్రి అయింది, ‘సర్వయోషిద్వరా కృష్ణా నినీషుః క్షత్రియాన్ క్షయం’ (ఆదిపర్వం 166-48)
మరి ఇటువంటి పిల్లల్ని కన్న తండ్రి ద్రుపదుడంటే ఎవరబ్బా అని సహజం గానే మనకు అనిపిస్తుంది. ‘ద్రుతం పద్యం యస్య సః’ - అంటే, త్వరత్వరగా పురోగ మించేవాడని ద్రుపదమనే పదానికి అర్థం. తీవ్రమైన సంవేగంతో, అంటే, అత్యంత వైరాగ్యంతో ఆత్మదిశగా పెద్ద పెద్ద అంగలేస్తూ నడిచే ఇతను, ఏ కలతా లేని అనాసక్తికి ప్రతీక. ‘ద్రుపదాదివ ముంచతు; ద్రుపదాదివేన్ముముచానః; స్విన్నస్స్నాత్వీ మలాదివ’ అంటూ తైత్తిరీయ బ్రాహ్మణంలో (2-4-4-10) ఒక మంత్రం ఉంది.
చెమటతో ముద్దైన వాడు స్నానం చేసి బాగుపడ్డట్టు, ద్రుపదం అనే శిక్షాపరికరం నుంచి విడివడడమన్నట్టుగా పాపం నుంచి విడదీయమని ఈ ప్రార్థన అర్థం. ద్రుపదమంటే కాలికి కట్టే ఒక పెద్ద దుంగ; అది నేరం చేసినవాణ్ని బంధించి కదలనీయదు. ద్రుపదమనే మాటకు మనం చెప్పుకొన్న రెండు అర్థాల్నీ కలుపు కుంటే, ‘భౌతికమైన ఆసక్తి అనే ద్రుపదం నుంచి విడివడి, త్వరగా, తీవ్రమైన వైరాగ్యమనే ఉపాయంతో బ్రహ్మపదానికి అభిముఖంగా ద్రుతగతితో సాగిపోయే వాడ’ని అర్థం. ఇటువంటి ద్రుపదుడి ఆధ్యాత్మికమైన ఉత్సాహ భక్తులనే అగ్ని నుంచి పుట్టినవాళ్లే ధృష్టద్యుమ్నుడూ ద్రౌపదీను - ఆగమశక్తీ కుండలినీ శక్తీను.
- డా॥ముంజులూరి నరసింహారావు