సండే స్పెషల్ శనివారమైంది!
ఆశీల వసూలు దారుల ఇష్టారాజ్యం
మారిన తరతరాల ఆదివారపు సంత
మంగళవారం సెలవు ఆదివారానికి మారుతోంది?
నాగాయలంక: దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు ఆదివారం సెలవు. కానీ నాగాయలంకలో మంగళవారం సెలవు దినం. అందుకు ఓ ప్రత్యేక ఉంది. ఆదివారం నాగాయలంక ఉప్పు చేపల సంత జరుగుతుంది. పంచాయతీ అనుమతి లేకుండానే ఆశీలు వసూలుదారులు తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని మార్చేశారు. శనివారం రోజు చేపల సంత నిర్వహిస్తున్నారు.
నాగాయలంకలో ప్రతి ఆదివారం ఎండుచేపలసంత నిర్వహిస్తారు. ఉప్పు చేపలు, ఎండు రొయ్యలు, రొయ్యపప్పు, మెత్తళ్లు లాంటి అనేక రకాల డ్రైఫిష్ క్రయవిక్రయాలు భారీగా సాగుతుంటాయి. సంత గత వైభవం కోల్పోయినప్పటికీ వారం వారం లక్షల్లో అమ్మకాలు, కొనుగోళ్లు సాగుతున్నాయి. ఇక్కడకు నాగాయలంక మండలంలోని పరిసర 20 గ్రామాల ప్రజలతోపాటు చెన్నై, హైదరాబాద్, వరంగల్ తదితర పట్టణాల నుంచి వ్యాపారులు వచ్చి సరుకు కొనుగోలు చేస్తుంటారు.
ఈ మేరకు గతం నుంచీ ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి చేపల హోల్సేల్ క్రయవిక్రయాలు ప్రారంభమయ్యేవి. సాయంత్రం 6గంటల వరకు జరిగేవి. ప్రస్తుతం శనివారం మధ్యాహ్నం 12గంటల నుంచి ప్రారంభమై రాత్రికే ముగిసిపోతుంది. గతంలో అందరికీ అందుబాటులో ఉండే ధరలు చుక్కలు చూపిస్తున్నయని కొనుగోలుదారులు వాపోతున్నారు.
ఇతర ప్రాంతాల హోల్సేల్ వ్యాపారులు ఎగబడటంతో ఏ తీరప్రాంతంలో లేని ధరలు ఇక్కడ రాజ్యమేలుతున్నాయని వినియోగదారులు అంటున్నారు. మరో పక్క ధరలు గిట్టుబాటే కావడంలేదని మత్స్యకారులు చెపుతున్నారు.