Dubbing movie
-
కాంతార మరో రికార్డ్.. కార్తికేయ-2ను అధిగమించి..!
రిషబ్‌శెట్టి దర్శకుడిగా, హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ 'కాంతారా'. ఈ చిత్రం అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. తాజాగా బాలీవుడ్‌లోనూ రిలీజైన ఈ సినిమా మరో రికార్డును సాధించింది. హిందీలో డబ్బింగ్ అయిన సినిమాల్లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన ఏడో చిత్రంగా నిలిచింది. బాలీవుడ్లో ఇప్పటి దాకా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ప్రముఖ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. మొదటి రెండు వారాల కంటే.. మూడో వారం అత్యధిక కలెక్షన్లు సాధించినట్లు వెల్లడించారు. ఈ ఏడాది విడుదలైన డబ్బింగ్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా 'కాంతార' నిలిచింది. టాలీవుడ్ హీరో నిఖిల్ చిత్రం 'కార్తికేయ2' కలెక్షన్ల రికార్డును అధిగమించింది. ఇతర భాషల్లో తెరకెక్కిన చిత్రాలు బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో ‘బాహుబలి2’ ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఆ తర్వాత ‘కేజీయఫ్2’, ‘ఆర్ఆర్ఆర్’, ‘2.ఓ’, ‘బాహుబలి’, ‘పుష్ప’ సినిమాలు ఉన్నాయి. అన్ని భాషల్లో కలిపి ‘కాంతార’ రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. #Kantara *#Hindi version*… ⭐️ #Baahubali2, #KGF2, #RRR, #2Point0, #Baahubali, #Pushpa… #Kantara is now the 7th highest grossing *dubbed* #Hindi film ⭐️ Crosses ₹ 50 cr mark [Day 21] ⭐️ Week 3 is higher than Week 1 and Week 2 pic.twitter.com/82lZR0H30j — taran adarsh (@taran_adarsh) November 4, 2022 -
పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఈ 'దొంగాట' చూడాల్సిందే..
టైటిల్: దొంగాట నటీనటులు: ఫాహద్ ఫాజిల్, సూరజ్ వెంజరమూడ్, నిమిషా సజయన్, అలెన్సియర్ లే లోపెజ్ తదితరులు నిర్మాతలు: సందీప్ సేనన్, అనీష్ ఎం థామస్ కథ: సజీవ్ పజూర్ దర్శకత్వం: దిలీష్ పోతన్ సినిమాటోగ్రఫీ: రాజీవ్ రవి సంగీతం: బిజిబాల్ విడుదల తేది: మే 06, 2022 (ఆహా) చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుల్లో మలయాళీ నటుడు ఫాహద్ ఫాజిల్ ఒకరు. కరోనా సమయంలో ఆడియెన్స్ ఓటీటీలకు అలవాటు కావడంతో ఒక్కసారిగా ఫాహద్ పేరు దేశవ్యాప్తంగా వినిపించింది. విభిన్నమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు. పాత్ర బలంగా ఉంటే ఎలాంటి సినిమా అయినా చేసేందుకు వెనుకాడరు. 'పుష్ప: ది రైజ్' సినిమాలో భన్వర్ సింగ్ షేకవాత్ అనే పోలీసు పాత్రలో ఎంతలా ఆకట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డిఫరెంట్ రోల్స్ చేస్తూ ఫ్యాన్స్, ఆడియెన్స్ ఎంటర్టైన్ చేస్తున్న ఫాహద్ ఫాజిల్ నటించిన మలయాళ చిత్రం 'తొండిముత్యాలుం దృక్సాక్షియుం'. 2017లో విడుదల మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని తాజాగా తెలుగులో 'దొంగాట' పేరుతో 'ఆహా' ఓటీటీలో విడుదల చేశారు. ఫహద్ ఫాజిల్, సూరజ్ వెంజరమూడ్, నిమిషా సజయన్ కీలకపాత్రల్లో నటించారు. మూడు జాతీయ పురస్కారాలను అందుకున్న ఈ 'దొంగాట' ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: ఒక మిస్అండర్స్టాండింగ్ కారణంగా దగ్గరైన ప్రసాద్ (సూరజ్ వెంజరమూడ్), శ్రీజ (నిమిషా సజయన్) ప్రేమించి గుడిలో పెళ్లి చేసుకుంటారు. తర్వాత వేరే కాపురం పెడతారు. వ్యవసాయం పండించడానికని నీళ్ల కోసం బోర్ వేసేందుకు శ్రీజ దగ్గర ఉన్న తాళి తాకట్టు పెట్టేందుకు బస్సులో వెళ్తారు. బస్సులో ప్రయాణించేటప్పుడు శ్రీజ మెడలోని బంగారు గొలుసును (తాళి) ప్రసాద్ (ఫాహద్ ఫాజిల్) అనే దొంగ కొట్టేస్తాడు. అది గమనించిన శ్రీజ.. ప్రసాద్‌ను పట్టుకుని నిలదీస్తే తాను దొంగలించలేదని బుకాయిస్తాడు. దీంతో బస్సులోని వారి సహాయంతో ప్రసాద్‌ను (ఫాహద్ ఫాజిల్) పోలీస్‌లకు అప్పగిస్తారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ప్రసాద్-శ్రీజ దంపతులు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. గొలుసు కొట్టేసిన ప్రసాద్ అనే దొంగ నేరం ఒప్పుకున్నాడా ? ఆ తాళి శ్రీజ-ప్రసాద్‌లకు చేరిందా ? ఇలాంటి కేసుల్లో పోలీసులు ఎలా వ్యవహరిస్తారు? అనే అంశాలతో తెరకెక్కిందే ఈ 'దొంగాట'. విశ్లేషణ: ఇద్దరు దంపతులు, ఒక దొంగ, చిన్న కేసు, పోలీసులు అనే చిన్న కథను చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ దిలీష్ పోతన్. ఒక దొంగతనాన్ని పోలీసులు ఎలా చేధిస్తారో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఫాహద్ ఫాజిల్ బంగారు తాళిని దొంగతనం చేయడంతోనే అసలు కథ ప్రారంభవుతుంది. తర్వాత వచ్చే సీన్లు, దొంగలు, సాక్షులు, సామాన్యులతో పోలీసులు వ్యవహరించే తీరు బాగా అలరిస్తుంది. పరిస్థితులకు అనుగుణంగా తమకు ఎలాంటి సమస్య రాకుండా పోలీసుల ప్రవర్తనా శైలీ ఆలోచింపజేసేలా ఉంటుంది. అమాయకంగా ఉంటూ చివరివరకు నేరాన్ని ఒప్పుకోని దొంగల తీరు, తమకు నష్టం కలిగినా ఇంకొకరికి అన్యాయం జరగకూడదనే భావించే మధ్యతరగతి వ్యక్తుల ఆలోచనలను చాలా బాగా చూపించారు. అక్కడక్కడా సినిమా కొంచెం సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే ? దొంగలు పారిపోతే పోలీసులు వెతికే తీరు, పై అధికారులకు సమాధానం ఇచ్చేటప్పుడు వారికి కలిగే భయం, దొంగతనం చేసిన కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉండే దొంగల ప్రవర్తన వంటి అంశాలను నటీనటులు వారి నటనతో చాలా చక్కగా చూపించారు. దొంగ పాత్రలో ఫాహద్ ఫాజిల్ అద్భుతంగా నటించాడు. 'చివరివరకు బయటపడకూడదు అనేదే తన స్టైల్' అని చెబుతూ అమాయకపు చూపులు, పోలీసులతో మాట్లాడే వైఖరీ, ఎవరు లేనప్పుడు అసలైన దొంగలా ప్రవర్తించే ఫాహద్ నటన ఆకట్టుకునేలా ఉంది. మధ్యతరగతి వ్యక్తుల్లా సూరజ్, నిమిషా కూడా చాలా చక్కగా ఒదిగిపోయి నటించారు. మిగతా పోలీసు పాత్రలు సైతం వారి నటనతో మెప్పించారు. పోలీసు వ్యవస్థలోని లొసుగులు, మధ్యతరగతి వ్యక్తుల ఆలోచనా ధోరణి, సమస్యలు ఎదురైనప్పుడు వారు రాజీపడే విధానాన్ని చూపించి దర్శకుడు దిలీప్ పోతన్ మంచి మార్కులు కొట్టేశారనే చెప్పవచ్చు. అయితే ఫాహద్ ఫాజిల్ దొంగగా మారడానికి కారణాలు, తర్వాత మంచివాడిలా మారేందుకు ప్రేరేపించిన కారణాలు అంతగా చూపించలేకపోయాడు. సజీవ్ పజూర్ అందించిన కథ, శ్యామ్ పుష్కరణ్ డైలాగ్‌లు ఓకే అనిపించాయి. రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ, బిజిబాల్ సంగీతం పర్వాలేదనిపించింది. ఈ సినిమాలో నటనకు గానూ ఫాహద్ ఫాజిల్‌కు ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డు వచ్చింది. బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్‌గా సజీవ్ పజూర్ కూడాల జాతీయ అవార్డును అందుకున్నారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డును సైతం అందుకుంది ఈ మూవీ. ఫైనల్‌గా ఏంటంటే కాస్త నెమ్మదిగా సాగిన ఈ 'దొంగాట' ఓసారి చూడాల్సిందే. -
సరికొత్త కాన్సెప్ట్‌తో ‘రత్తం’.. డబ్బింగ్ ప్రారంభం
రత్తం చిత్ర డబ్బింగ్ శనివారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇది. ఆయనకు జంటగా మహిమా నంబియార్, నందితా శ్వేత, రమ్యా నంబీశన్ మొదలగు ముగ్గురు నాయికలు నటిస్తున్నారు. ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్ పతాకంపై కమల్ బొహ్రా, లలిత ధనుంజయ్, బి.ప్రదీప్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సి.ఎస్.అముదన్ దర్శకత్వం వహిస్తున్నారు. (చదవండి: అప్పుడు చాలా అవమానంగా అనిపించింది: చిరంజీవి) సరికొత్త కాన్సెప్ట్‌తో ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఈ చిత్రం షూటింగ్‌ను ప్రణాళిక ప్రకారం రూపొందిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఇండియాలోని ప్రధాన ప్రాంతాల్లో కొంతభాగం పూర్తి చేసుకుందని, మిగిలిన భాగాన్ని త్వరలో విదేశాల్లో చిత్రీకరించనున్నట్లు పేర్కొన్నారు. మరోపక్క డబ్బింగ్ పార్ట్‌ను శనివారం ప్రారంభించినట్లు చెప్పారు. దీనికి కన్నన్ సంగీతాన్ని, గోపి అమర్నాథ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. -
‘గ్రేట్ శంకర్’గా మమ్ముట్టి
మలయాళ హిట్ మూవీ ‘మాస్టర్ పీస్’ తెలుగులో ‘గ్రేట్ శంకర్’గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మమ్ముట్టి, వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, పూనమ్ బజ్వా ప్రధాన పాత్రల్లో అజయ్ వాసుదేవ్ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. లగడపాటి భార్గవ సమర్పణలో లగడపాటి శ్రీనివాస్ ‘గ్రేట్ శంకర్’ని తెలుగులో విడుదల చేయనున్నారు. (చదవండి: చిరు ‘గాడ్ ఫాదర్’కు సల్మాన్ గ్రీన్ సిగ్నల్, డేట్స్ కూడా ఫిక్స్!) ‘‘మంచి కథాబలం ఉన్న చిత్రం ఇది. మర్డర్ మిస్టరీ, థ్రిల్లింగ్ అంశాలతో ఈ సినిమా ఉత్కంఠగా సాగుతుంది. మలయాళంలో హిట్ సాధించిన ఈ చిత్రం తెలుగులో కూడా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం’’ అన్నారు లగడపాటి శ్రీనివాస్. -
చైనాకు అసురన్
చైనా థియేటర్స్‌లో ‘అసురన్’ కనిపించబోతున్నాడు. ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘అసురన్’. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్ సాధించింది. ఈ చిత్రం తెలుగులో ‘నారప్ప’గా రీమేక్ అవుతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటిస్తున్నారు. ‘అసురన్’ చిత్రం కన్నడ, హిందీ భాషల్లో కూడా రీమేక్ కానుందనే టాక్ వినిపిస్తోంది. ఇంతటి పాపులారిటీ సంపాదించుకున్న ఈ చిత్రం చైనా భాషలో డబ్బింగ్ కానుందట. ఇందుకు తగ్గ కార్యక్రమాలపై ‘అసురన్’ చిత్రబృందం దృష్టి పెట్టిందని కోలీవుడ్ టాక్. ‘బాహుబలి’, ‘దంగల్’ వంటి చిత్రాలు చైనీస్ బాక్సాఫీసు వద్ద భారతీయ సినిమా సత్తా చాటాయి. మరి...‘అసురన్’ కూడా చైనాలో సక్సెస్ అవుతుందా? వెయిట్ అండ్ సీ. -
అవెంజర్స్ అద్భుతహా
‘అవెంజర్స్ చూశావా? టికెట్స్ దొరికాయా? ఐరన్‌మేన్ మస్త్ కదా! కెప్టెన్ అమెరికా సూపర్. హల్క్ కుమ్మేశాడు’... ప్రస్తుతం ప్రపంచ సినీప్రియుల మధ్య వినిపిస్తున్న డిస్కషన్లలో కామన్ టాపిక్ అవెంజర్స్... అవెంజర్స్. అసలెవరండీ ఈ అవెంజర్స్. అంత మొనగాళ్లా? మొనగాళ్లే. ప్రపంచాన్ని కాపాడే ఈ సూపర్ హీరోల సాహస విన్యాసాలు బాక్సాఫీస్ మీద డాలర్లు, రూపాయిలు, దినాముల వర్షం కురిపిస్తున్నాయి. ప్రాంతాలతో సంబంధం లేకుండా పాత రికార్డులను బద్దలు కొడుతోంది అవెంజర్స్. మల్టీప్లెక్సుల్లో టికెట్ల కొరత సృష్టిస్తోంది అవెంజర్స్. అసలెవరండీ ఈ సూపర్ హీరోలు అమెరికన్ కామిక్ పుస్తకాల్లో పురుడు పోసుకున్న ఈ సూపర్ హీరోలు 2008 నుంచి సిల్వర్ స్క్రీన్ మీద కనిపించడం మొదలెట్టారు. ‘ఐరన్‌మేన్, కెప్టెన్ అమెరికా, హల్క్, థోర్, స్పెడర్ మేన్, బ్లాక్ ప్యాంథర్’ ఇలా కామిక్ పాత్రలను స్క్రీనీకరిస్తూ వచ్చింది మార్వెల్. సూపర్ హీరోలూ తమ ఆనవాయితీగా వసూళ్లలో కొత్త రికార్డులను సృష్టిస్తూ వచ్చారు. ఒక్కొక్క సూపర్ హీరో విధ్వంసమే ఇలా ఉంటే వీళ్లను ఒకేచోట అసెంబుల్ చేస్తే? ఈ ఆలోచనతో సూపర్ హీరోలందరితో ‘ది అవెంజర్స్’ను రిలీజ్ చేశారు. ఆ తర్వాత ‘అవెంజర్స్ : ఏజ్ ఆఫ్ అల్ట్రాన్’, ‘ఇన్ఫినిటీ వార్’ చిత్రాలు వచ్చాయి. ఆ చిత్రాల ముగింపే ‘ఎండ్‌గేమ్’. ఈ చిత్రం తర్వాత మళ్లీ సూపర్ హీరోల పాత్రలు కనిపించకపోవచ్చు. అందుకే ఎన్నిసార్లు చూసినా చివరిసారి చూడటం ప్రత్యేకమన్నట్టు మార్వెల్ అభిమానులు మళ్లీ మళ్లీ ‘ఎండ్ గేమ్’చిత్రాన్ని వీక్షిస్తున్నారు. ‘‘ఎండ్‌గేమ్’ చూస్తున్నప్పుడు మన ప్రాంతీయ భాష సినిమా అనే ఫీల్ కలిగించాలనే ఉద్దేశంతో సంభాషణల పరంగా శ్రద్ధ తీసుకోవడం జరిగింది. రెహమాన్‌తో స్పెషల్ సాంగ్ చేయించడానికి కారణం కూడా ఇదే . ఈ చిత్రాన్ని తమ థియేటర్స్‌లో ప్రదర్శించాలనుకుంటున్నాం అని ఎగ్జిబిటర్స్ తమంతట తాము ముందుకు వచ్చారు. అమెరికాలో సృష్టించబడిన అవెంజర్స్ ఆంధ్రా, తెలంగాణలోనూ అభిమానాన్ని ఏ స్థాయిలో సంపాదించాయో అర్థం చేసుకోవచ్చు. ‘ఇన్ఫినిటీవార్’ లైఫ్‌టైమ్ కలెక్షన్స్‌ను 2 రోజుల్లో ‘ఎండ్‌గేమ్’ దాటేసింది. మొదటి రెండు రోజుల వసూళ్ల పరంగా ఇప్పటి వరకూ డబ్బింగ్ సినిమాల్లో నంబర్ వన్‌గా నిలిచింది. హిందీ, తమిళ భాషలతో పోలిస్తే మన టికెట్ రేట్లు తక్కువ. అయినప్పటికీ వాటితో పోటీగా ఈ సినిమా కలెక్షన్స్ సాధిస్తోంది’’ అని ‘అవెంజర్స్’ చిత్రం మార్కెటింగ్ ప్రతినిధి పేర్కొన్నారు. చెడు(విలన్) పై మంచి(హీరో) ఎప్పుడూ గెలుస్తుంది. కొన్నిసార్లు సమయం పడుతుందంతే. సినిమా పరిభాషల్లో అల్టిమేట్ కమర్షియల్ ఫార్ములా ఇది. తెలుగు మాస్ సినిమా అయినా హాలీవుడ్ సూపర్ హీరో సినిమా అయినా ఇదే మంత్రం. కాబట్టి ‘అవెంజర్స్’ మనకు ఇంతలా కనెక్ట్ అయిందనుకోవచ్చు. అందుకే ఇది ఎండ్‌గేమ్ కాదు బాక్సాఫీస్ బెండ్ తీస్తున్న సూపర్ హీరోల గేమ్. -
కొట్టాడయ్యో లక్కీ చాన్స్
‘ఆర్ఎక్స్ 100’ పేరు చెబితే గతంలో బైక్ గుర్తొచ్చేది. ఇప్పుడు సినిమా గుర్తుకొస్తోంది. హీరో కార్తికేయ, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌లు ‘ఆర్ఎక్స్ 100’ బైక్‌లా ఇండస్ట్రీకి దూసుకొచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో కార్తికేయ, పాయల్‌కు మంచి ఆఫర్లు వస్తున్నాయి. కార్తికేయకు అయితే తమిళ ఇండస్ట్రీ పెద్ద నిర్మాత నుంచి కబురొచ్చింది. ‘తుపాకి, తేరి, కబాలి’ వంటి భారీ చిత్రాలను నిర్మించిన కలైపులి ఎస్.థాను బ్యానర్లో తెరకెక్కనున్న తెలుగు చిత్రంలో కార్తికేయ నటించనున్నారు. ఒక్క చిత్రంతోనే అంత పెద్ద నిర్మాతతో పనిచేసే అవకాశం రావడం లక్కీ చాన్సే అంటున్నారు సినీ జనాలు. ఈ చిత్రానికి టీఎన్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. ‘‘నా రెండో పెద్ద ప్రాజెక్ట్‌కు పునాది పడింది. నాకు ఇష్టమైన ‘నువ్వు నేను ప్రేమ’ (సూర్య, జ్యోతిక నటించిన ‘జిల్లున్ను ఒరు కాదల్’కి డబ్బింగ్) సినిమా తెరకెక్కించిన టీఎన్ కృష్ణతో సినిమా చేయబోతున్నాను. ‘ఆర్ఎక్స్ 100’ చూసి నా నటనను మెచ్చుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి అద్భుతమైన కథ వినిపించారు. లెజెండరీ నిర్మాత కలైపులి థాను ఈ సినిమాకు నిర్మాత కావడం హ్యాపీ. ఈ చిత్రానికి ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తారు’’ అన్నారు కార్తికేయ. -
సేనాపతి
తెలుగులో వచ్చిన క్లాసిక్ డబ్బింగ్ సినిమాల్లో ఒకటైన ఓ బ్లాక్‌బస్టర్ కమర్షియల్ సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. ఆ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం.... ట్రాఫిక్ పోలీస్ ఎస్సై కేసులు రాస్తున్నాడు. అన్ని రూల్స్ ఫాలో అయ్యేవారిని కూడా పక్కకు తీసుకెళ్లి ఏదోక పేరు చెప్పి లంచం వసూలు చేస్తున్నాడు. ఫైన్ రాస్తే ఐదొందలు.. తనకు లంచంగా ఇచ్చి వదిలేసుకుంటే నూటాయాభై. ఒకతను – ‘‘అన్ని రూల్స్ ఫాలో అవుతున్నా.. ఎందుకివ్వాలి సార్ నూటాయాభై?’’ అని గట్టిగా అడిగాడు. ఆ పోలీసతను కోపంగా అతని బండి కీస్ లాక్కొని అంతే గట్టిగా లంచమివ్వమని అడిగాడు. అటుగా వెళుతున్న ఒక పెద్దాయన ఇది చూశాడు. బండతని పక్కనొచ్చి నిలబడ్డాడు. అతణ్ని షూ తీసి, బండి మీద పెట్టమని అడిగాడు. అతను ఆ పెద్దాయన చెప్పినట్టే చేశాడు.‘‘దాన్ని శుభ్రంగా తుడిచి ఆ నూటాయాభై తీసుకోండి.’’ అంటూ ఎస్సైకి షూ చూపించాడు పెద్దాయన. ఎస్సైకి కోపమొచ్చింది. ‘‘ఎలా కనిపిస్తున్నానురా..’’ అంటూ చెయ్యెత్తబోయాడు. పెద్దాయన.. ముందు తన పొట్టమీద చెయ్యేసుకొని చూశాడు. అక్కడే బెల్టుకు ఒక కత్తి పెట్టుకొని ఉంటాడాయన. తనకు తెలిసిన మర్మకళను గుర్తుచేసుకుంటూ చేతి వేళ్లు తిప్పి పెట్టుకున్నాడు. అంత అవసరం లేదనిపించిందో ఏమో, అదే చేతిని చాచిపెట్టి ఎస్సైని గట్టిగా ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకు ఎస్సై కిందపడిపోయాడు. చుట్టూ జనం పోగయ్యారు. ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు ఆ గుంపులో. పెద్దాయన్ను అడిగారు వాళ్లు – ‘‘హే ఓల్డ్‌మేన్! బైదవే.. హూ ఆర్ యూ?’’. ‘‘మీ? అ యామ్ ఆన్ ఇండియన్.’’ అన్నాడు పెద్దాయన. ఆ పెద్దాయన పేరు సేనాపతి. స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిష్ వారిపై పోరాడి నిలిచిన వ్యక్తి. ట్రాఫిక్ పోలీసతన్ని కొట్టడానికి ముందు సేనాపతి రెండు హత్యలు చేశాడు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఆ హత్యలు చేశాడాయన. ఆ హత్యలెందుకు చేశావంటే ఆయన చెప్పే కారణం ఒక్కటే – ‘‘లంచం తీసుకున్నందుకు..’’.ఎనభైకి దగ్గర పడ్డ వ్యక్తి సేనాపతి. ‘‘తెల్లవారిపై పోరాడినవారు మీరు.. ఇప్పుడూ పోరాడుతున్నారు. కాకపోతే సొంతవారితో..’’ అంటుంది సేనాపతి భార్య. సేనాపతి ఏ పని చెయ్యాలనుకున్నా అతనికి తోడుండేది భార్య అమృతవల్లి ఒక్కతే.రోజులు గడుస్తున్నాయి. సేనాపతి నేరాలు కూడా ఒక్కొక్కటిగా పెరిగిపోతున్నాయి. అతను చేసే పని సమాజం కోసమే అయినా, చట్టం దృష్టిలో అది తప్పు. పోలీసులు సేనాపతిని వెతుకుతున్నారు. వాళ్లకు దొరక్కుండా తిరగాలి. ఇల్లు ఖాళీ చేశాడు. ఒక మార్చురీ వ్యాన్నే ఇల్లుగా మార్చేసుకున్నాడు. అమృతవల్లితో కలిసి ఎవ్వరికీ కనబడకుండా ఆ మార్చురీ వ్యాన్లోనే తిరుగుతున్నాడు. కానీ హత్యలు చేయడం మాత్రం ఆగలేదు. పోలీసులు సేనాపతిని వెతుకుతూ అతని కొడుకు చందూని పట్టుకున్నారు. చందూ అప్పటికి ఆ కుటుంబాన్ని వదిలిపెట్టి చాలా కాలమైంది. చందూ ఇప్పుడు చక్కగా వెహికిల్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఈ విషయం తెలియగానే చందూకి కోపం వచ్చింది. అమ్మ అమృత ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్లి గొడవ పెట్టుకున్నాడు – ‘‘దేశాన్ని ఉద్దరిస్తానని కత్తి పట్టుకుని తిరుగుతున్నాడు. ఒంటరిగా అయితే ఆయన వల్ల అవుతుందా అమ్మా! కాలానుగుణంగా నడుచుకోకుండా నా జీవితాన్ని, చెల్లాయి జీవితాన్ని నాశనం చేశాడు. అది నచ్చకే ఇల్లొదిలేసి వెళ్లిపోయాను. ఇప్పుడు ఆయన వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చాయో చూడు! ఆయన కొడుకైన కారణంగా అడ్డమైన చోట్ల పోలీసులు నాకోసం వెతుకుతున్నారు. రోజూ విచారణ అన్న పేరుతో మూడు గంటలు నా ప్రాణాలు తీస్తున్నారు. ఎక్కడున్నాడు... చెప్పు..’’ అమృత నోరు విప్పలేదు. ‘‘పోలీసులేమైనా గాజులు తొడుక్కున్నారనుకున్నావా.. ఈజీగా పట్టుకుంటారు.’’ కొనసాగించాడు చందూ, కోపంగానే.‘‘ఎంతటి మొనగాడైనా.. ఆయన నీడను కూడా తాకలేరురా..’’ అంది అమృత. చాలా ప్రశాంతంగా చెప్పినా, గట్టిగా నొక్కి చెప్పినట్టనిపించింది చందూకి. అమృతకు సేనాపతి గురించి చాలా బాగా తెలుసు. తన భర్త పోలీసులకు దొరకడన్న ఆమె నమ్మకాన్ని నిజం చేస్తూ వరుసగా హత్యలు చేసుకుంటూ దొరక్కుండా వెళుతున్నాడు సేనాపతి. సేనాపతి పేరు తల్చుకొని లంచమంటే భయపడిపోతున్నారు అందరూ.ఇదే సమయానికి చందూ ఒక పెద్ద నేరంలో చిక్కుకున్నాడు. లంచం తీసుకొని అతనొక బస్సుకు ఇచ్చిన క్లియరెన్స్ నలభై మంది పిల్లల్ని పొట్టన పెట్టుకుంది. బ్రేక్ ఫెయిలై లోయలో పడిన బస్సులో ఉన్న నలభై మంది స్కూల్ పిల్లలూ ఒక్కసారే ప్రాణాలొదిలారు. చందూ ఈ కేసులోంచి తనను తాను బయటపడేసుకోడానికి లంచాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. పోలీసులకు, పోస్ట్‌మార్టం చేసే డాక్టర్‌కు, వాళ్లకు, వీళ్లకు, తనను కాపాడే అందరికీ. చందూ లంచాలు ఇస్తున్నాడు. ‘అద్భుతం.’’ అని చప్పట్లు కొట్టాడు సేనాపతి. అందరికీ లంచాలిస్తూ వస్తోన్న చందూ ఒక్కసారే ఆగిపోయి సేనాపతిని చూశాడు. నోట మాట రాలేదు. ‘‘అడ్డదారుల్లో పోయి పోయి.. చివరికి చేరాల్సిన చోటుకే నువ్వు చేరుకున్నావు చూశావా..! ఆ రోజు నేను ఐదువందల రూపాయలు లంచమివ్వకుంటే కన్న కూతురుని పొట్టన పెట్టుకున్నానని అన్నావే.. ఈరోజు ఐదువేల రూపాయలు లంచం తీసుకొని నలభై మంది పిల్లల్ని చంపావు. అదీ అందరూ పసికందులు. ఎంత పెద్ద హంతకుడివిరా నువ్వూ.. అసలు ముందు నిన్ను చంపాల్రా..’’ అంటూ కత్తి తీశాడు సేనాపతి. ‘‘మీ కొడుకుని నాన్నా నేను.. నా మీద జాలి లేదా.. ప్రేమ లేదా..’’ అన్నాడు చందూ. ‘‘ప్రేమను నాకు లంచంగా ఇస్తున్నావా? కలుపు కాదు నువ్వు.. విషవృక్షం..’’‘‘క్షమించండి నాన్నా!’’‘‘ఈ సేనాపతి కోర్టులో క్షమించడాలు ఉండవు. మరణ శిక్షేరా!’’. మరణ శిక్షే విధించాడు సేనాపతి. సొంతకొడుకు చందూకి కూడా. ‘‘నాన్నా! ప్లీజ్ నా మాట విను..’’ చందూ చివరగా చెప్పిన మాట ఇది. సేనాపతి చందూ గుండెల్లోకి కత్తి దించకముందు చెప్పిన మాట ఇది. ఆ మాట చెబుతూ చందూ, వినే పరిస్థితిలో కూడా లేని సేనాపతి.. ఇద్దరి కళ్లలో ఒకేసారి నీళ్లు తిరిగాయి, వేర్వేరు కారణాలతో! -
ట్రైన్ నం. 2016 ...చిన్న సినిమా ఎక్స్‌ప్రెస్
రైల్వే స్టేషన్ బాగా రద్దీగా ఉంది... 2016 ఎక్స్‌ప్రెస్‌కి బాగా గిరాకీ ఉంది ప్రయాణికులకే కాదు.. సమోసాలకీ, కూల్ డ్రింకులకీ సూపర్‌గా వర్కవుట్ అయింది. 2016లో చిన్న బడ్జెట్ సినిమా ‘చుకు... చుకు’ అంటూ డ.. డ..డ (అంటే డబ్బింగ్ సినిమాలని అర్థం) సూపర్ ఫాస్ట్ ట్రైన్‌ని తలదన్నే ఎక్స్‌ప్రెస్ సినిమాగా పేరు తెచ్చుకుంది. యస్... 2016 తెలుగు సినిమా హీరో ఎవరంటే ‘కథే’ అనాలి. బడా బడా స్టార్ హీరోలు చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించిన సంవత్సరంలోనే.... కొన్ని ఛోటా మోటా సినిమాలు కంటెంట్‌తో భారీ కలెక్షన్లు రాబట్టాయి. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. స్టార్ హీరోల సిన్మాలతో పాటు కథాబలం ఉన్న సిన్మాలను సైతం ఆదరించిన తెలుగు ప్రేక్షకులూ హీరోలనే చెప్పుకోవాలి. ఒక్కసారి 2016ని రివైండ్ చేసుకుంటే... భారీ విజయాలు సాధించిన సినిమాల్లో ‘క్షణం’ ఒకటి. అసలు ‘క్షణం’లో ఏముందండీ... బడా స్టార్స్ లేరు, భారీ సెట్స్, హంగామా లేదు, సో కాల్డ్ కమర్షియల్ ఫార్మాట్ సినిమా కానే కాదు. మరి, ఏముంది? క్షణక్షణం ఉత్కంఠ కలిగించే కథ, కథనం ఉన్నాయి. కన్నకూతురి అన్వేషణలో ఓ తల్లి పడే మనోవేదన ప్రేక్షకుల మనసుల్ని తడిమింది. ఆమెకు సహాయం చేయాలని పరితపిస్తున్న మాజీ ప్రియుడి ప్రయత్నాలు ఫలించాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారంటే.. ప్రేక్షకులు సినిమాలో ఎంతగా లీనమయ్యారో అర్థం చేసుకోవచ్చు. జస్ట్ రెండు కోట్లతో తీసిన ‘క్షణం’ ఎవరూ ఊహించని విధంగా భారీ వసూళ్లు రాబట్టింది. సినిమా టీమ్ అందరికీ మంచి పేరొచ్చింది. ‘క్షణం’ హిట్‌తో మంచి ఇమేజ్ తెచ్చుకున్న హీరో అడవి శేష్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న రెండు సినిమాలు డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్నవేనట! ఇక, ‘క్షణం’ దర్శకుడు రవికాంత్ పేరేపు ఇప్పటివరకూ మరో సినిమా స్టార్ట్ చేయలేదు. కారణం ఏంటంటే.. మంచి కథ కోసం వెతుకుతున్నారట! మళ్లీ మళ్లీ చూశారు ‘క్షణం’ గతేడాది ఫస్టాఫ్ ఫిబ్రవరిలో విడుదలైతే... సెకండాఫ్ జూలైలో వచ్చిన మరో చిన్న సినిమా ‘పెళ్లి చూపులు’ కూడా భారీ హిట్ సాధించింది. నిర్మాతలకు భారీ లాభాలు తీసుకొచ్చింది. అసలు ‘పెళ్లి చూపులు’ కథలో ఉన్నదేంటి? బీటెక్ కంప్లీట్ చేసి, షెఫ్ కావాలనుకునే హీరో... ఫుడ్ ట్రక్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే హీరోయిన్... ‘పెళ్లి చూపులు’కి ఓ ఇంటికి వెళ్లబోయిన హీరో ఆమె ఇంటికి వెళ్లడం... తర్వాత ప్రేమ, వగైరా వగైరా కథ ఇంతే. కానీ, అందులోని పాత్రలు, సందర్భాలతో ప్రేక్షకులు తమను తాము రిలేట్ చేసుకున్నారు. దర్శకుడు తరుణ్‌భాస్కర్ సహజత్వానికి దగ్గరగా తీయడంతో ప్రేక్షకులు సినిమాని మళ్లీ మళ్లీ చూశారు. ‘పెళ్లి చూపులు’ తర్వాత హీరో విజయ్ దేవరకొండకి బడా బడా నిర్మాణ సంస్థల్లో నటించే ఛాన్సులు వచ్చాయి. సూపర్‌గుడ్ ఫిల్మ్స్‌లో ‘ద్వారక’, గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా, ‘అర్జున్‌రెడ్డి’ అనే మరో సినిమా చేస్తున్నారు. దర్శకుడు తరుణ్‌భాస్కర్ మరో మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని కథ సిద్ధం చేసుకుంటున్నారు. అనువాదం కూడా అదిరింది స్ట్రయిట్ సినిమాలే కాదండీ... కథే హీరోగా వచ్చిన డబ్బింగ్ సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల దుమ్మ దులిపాయి. సినిమా బాగుంటే చాలు, మాకు భాషాబేధం లేదని ‘ద జంగిల్ బుక్’, ‘బిచ్చగాడు’, ‘మన్యం పులి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. సాధారణంగా హాలీవుడ్ సినిమాలు మెట్రో నగరాల్లో మాత్రమే ఎక్కువగా ఆడుతుంటాయి. ఒకవేళ తెలుగులో డబ్ చేసి విడుదల చేసినా బి, సి సెంటర్లలో చిల్లర తప్ప పెద్ద కలెక్షన్స్ కొల్లగొట్టిన సందర్భాలు తక్కువనే చెప్పాలి. అందుకే తక్కువ మొత్తానికే అనువాద హక్కులు దక్కించుకున్నారు. కానీ, ఎక్కువ లాభాలే చూశాను. ‘ద జంగిల్ బుక్’ భారతీయ సినీ ప్రముఖుల దిమ్మ తిరిగే వసూళ్లు సాధించింది. ఒక్క తెలుగులోనే కాదు.. భారతీయ భాషలన్నిటిలోనూ అనువాదమైన ఈ హాలీవుడ్ చిత్రం హిట్ హిట్ హుర్రే అనిపించుకుంది. చిన్నప్పుడు పుస్తకాల్లో చదివిన, టీవీలో చూసిన మోగ్లీ కథ కావడంతో మన ప్రేక్షకులు సినిమా చూడడానికి ఆసక్తి చూపించారు. తమిళ డబ్బింగ్ ‘బిచ్చగాడు’ అయితే తెలుగులో కళ్లు చెదిరే కలెక్షన్స్ సాధించింది. ఆ సినిమా తెచ్చిన ఇమేజ్‌తో విజయ్ ఆంటోని తర్వాతి సినిమా ‘భేతాళుడు’ తెలుగులో భారీగా విడుదలైంది. 2015 వరకూ మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌కు తెలుగులో పెద్ద మార్కెట్ లేదు. స్ట్రయిట్ తెలుగు సినిమాలు ‘మనమంతా’, ‘జనతా గ్యారేజ్’లతో మన ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత మలయాళ డబ్బింగ్ ‘మన్యం పులి’తో మన ముందుకు వచ్చారు. ఇందులో యాక్షన్ సీన్లు తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాయి. మలయాళంలో 100 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా తెలుగులోనూ మంచి వసూళ్లు సాధించిందంటే కారణం సినిమాలో కథే. ఇప్పుడు మరో మలయాళ హిట్ ‘ఒప్పం’ తెలుగు డబ్బింగ్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి మోహన్‌లాల్ రెడీ అయ్యారు. కొత్త ఏడాదిలోనూ కాలరెగరేస్తుందా? 2016లో రెండు మూడు కోట్లతో తీసిన సినిమాలు భారీ కలెక్షన్లు సాధించి, కాలరెగరేయడంతో ‘చిన్న సినిమా’కి పెద్ద రేంజ్ వచ్చింది. దాంతో పదుల సంఖ్యలో ‘లో–బడ్జెట్’ సినిమాలు ప్రారంభమవుతున్నాయి. 2017లోనూ మరిన్ని ఛోటా సినిమాలు రానున్నాయి. కింగ్‌లాంటి కంటెంట్‌తో తీస్తే.. ఈ ఏడాది కూడా చిన్న సినిమా తొడగొడుతుందని చెప్పొచ్చు. అయితే చిన్న సినిమాల పరిస్థితి బాగుంది కదా అని హడావిడిగా మొదలుపెట్టేసి, ‘మమ’ అనిపిస్తే మాత్రం హిట్ కష్టమే. అందుకే మంచి కథ, సరైన ప్లానింగ్‌తో సినిమాలు తీస్తే హిట్టవుతాయని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. పాయింటే కదా! మీడియమ్... విజయం ఘనం! మంచి కథతో కూడిన డిఫరెంట్ సినిమాలు చేసే యంగ్ హీరోల్లో నిఖిల్ ఒకరు. ‘స్వామి రారా’తో మొదలుకుని ఆ తర్వాత నిఖిల్ చేసిన సినిమాలే అందుకు నిదర్శనం. ప్రేక్షకుల్లో తనకున్న పేరును నిలబెట్టుకుంటూ గతేడాది ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చేశారు. పెద్ద నోట్ల చలామణీ రద్దు చేసిన తర్వాత విడుదలైన ఈ మీడియమ్ బడ్జెట్ సినిమా మంచి హిట్టయింది. కంటెంట్ బాగుంటే ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని నిరూపించింది. ఇక, భారీ చిత్రాలు నిర్మించే గీతా ఆర్ట్స్ తీసిన మీడియమ్ బడ్జెట్ సినిమా ‘శ్రీరస్తు సుభమస్తు’ అల్లు శిరీష్‌కి మంచి హిట్ అందించింది. హ్యాపీ ఎండింగ్ ‘కంటెంట్ ఈజ్ కింగ్’ అని నిరూపించిన మరో సినిమా ‘అప్పట్లో ఒకడుండేవాడు’. 2016 డిసెంబర్ 31కి ఒక్క రోజు ముందు విడుదలైన ఈ సినిమా, ఇప్పుడు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. క్యారెక్టర్ లెంగ్త్ గురించి ఆలోచించకుండా కథపై నమ్మకంతో ఇంతియాజ్ అలీగా నటించిన నారా రోహిత్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అలాగే ఇందులో నటించిన మరో హీరో శ్రీవిష్ణు కూడా మంచి పేరు తెచ్చుకోగలిగారు. దర్శకుడు సాగర్ చంద్రపై ఇండస్ట్రీ దృష్టి పడింది. సుమారు రెండు కోట్లతో నిర్మించిన ఈ సినిమా 15 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద 2016కి ‘అప్పట్లో ఒకడుండేవాడు’ హ్యాపీ ఎండింగ్ ఇచ్చింది. కమెడియన్స్ కేరాఫ్ హిట్ ఫిల్మ్స్! కమెడియన్స్ శ్రీనివాసరెడ్డి, సప్తగిరిలు గతేడాది హీరోలుగా హిట్స్ అందుకున్నారు. అలాగని వీళ్లేమీ ఫుల్ టైమ్ హీరోలుగా మారలేదు. కమెడియన్స్‌గా సినిమాలు కంటిన్యూ చేస్తున్నారు. మంచి కథ, తన బాడీ లాంగ్వేజ్‌కి సూటవుతుందని ఫీలవడంతో ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’తో సప్తగిరి హీరో అయ్యారు. కామెడీతో పాటు డ్యాన్సులు, యాక్షన్ కూడా బాగా చేశారనే పేరు తెచ్చుకున్నారు. హీరోగా ఫస్ట్ మూవీతో మంచి హిట్ అందుకున్నారు. ఆల్రెడీ ‘గీతాంజలి’తో హీరోగా ఓ హిట్ అందుకున్న శ్రీనివాసరెడ్డి, మరోసారి ‘జయమ్ము నిశ్చయమ్మురా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇదీ హిట్ అన్పించుకుంది. కమెడియన్స్‌గా వీళ్ల ఇమేజ్‌తో పాటు కథలో కంటెంట్ ఉండడంతో ప్రేక్షకులు వీళ్లను హీరోలుగా మంచి మార్కులతో పాస్ చేసేశారు. ఈ ఏడాది కూడా కొంతమంది కమెడియన్లు హీరోలుగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే కమెడియన్ షకలక శంకర్ హీరోగా ‘నా కొడుకు పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ’ అనే సినిమా కమిట్ అయ్యారు. ఈ నెల 5న ఈ చిత్రం ఆరంభం కానుంది. – సాక్షి సినిమా డెస్క్