ట్రైన్‌ నం. 2016 ...చిన్న సినిమా ఎక్స్‌ప్రెస్‌ | 2016 movies rewind | Sakshi
Sakshi News home page

ట్రైన్‌ నం. 2016 ...చిన్న సినిమా ఎక్స్‌ప్రెస్‌

Published Tue, Jan 3 2017 12:27 AM | Last Updated on Tue, Sep 5 2017 12:12 AM

ట్రైన్‌ నం. 2016 ...చిన్న సినిమా ఎక్స్‌ప్రెస్‌

ట్రైన్‌ నం. 2016 ...చిన్న సినిమా ఎక్స్‌ప్రెస్‌

రైల్వే స్టేషన్‌ బాగా రద్దీగా ఉంది... 2016 ఎక్స్‌ప్రెస్‌కి బాగా గిరాకీ ఉంది ప్రయాణికులకే కాదు.. సమోసాలకీ, కూల్‌ డ్రింకులకీ సూపర్‌గా వర్కవుట్‌ అయింది.

2016లో చిన్న బడ్జెట్‌ సినిమా ‘చుకు... చుకు’ అంటూ డ.. డ..డ (అంటే డబ్బింగ్‌ సినిమాలని అర్థం) సూపర్‌ ఫాస్ట్‌ ట్రైన్‌ని తలదన్నే ఎక్స్‌ప్రెస్‌ సినిమాగా పేరు తెచ్చుకుంది.


యస్‌... 2016 తెలుగు సినిమా హీరో ఎవరంటే ‘కథే’ అనాలి. బడా బడా స్టార్‌ హీరోలు చేసిన సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర భారీ వసూళ్లు సాధించిన సంవత్సరంలోనే.... కొన్ని ఛోటా మోటా సినిమాలు కంటెంట్‌తో భారీ కలెక్షన్లు రాబట్టాయి. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. స్టార్‌ హీరోల సిన్మాలతో పాటు కథాబలం ఉన్న సిన్మాలను సైతం ఆదరించిన తెలుగు ప్రేక్షకులూ హీరోలనే చెప్పుకోవాలి.

ఒక్కసారి 2016ని రివైండ్‌ చేసుకుంటే... భారీ విజయాలు సాధించిన సినిమాల్లో ‘క్షణం’ ఒకటి. అసలు ‘క్షణం’లో ఏముందండీ... బడా స్టార్స్‌ లేరు, భారీ సెట్స్, హంగామా లేదు, సో కాల్డ్‌ కమర్షియల్‌ ఫార్మాట్‌ సినిమా కానే కాదు. మరి, ఏముంది? క్షణక్షణం ఉత్కంఠ కలిగించే కథ, కథనం ఉన్నాయి. కన్నకూతురి అన్వేషణలో ఓ తల్లి పడే మనోవేదన ప్రేక్షకుల మనసుల్ని తడిమింది. ఆమెకు సహాయం చేయాలని పరితపిస్తున్న మాజీ ప్రియుడి ప్రయత్నాలు ఫలించాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారంటే.. ప్రేక్షకులు సినిమాలో ఎంతగా లీనమయ్యారో అర్థం చేసుకోవచ్చు. జస్ట్‌ రెండు కోట్లతో తీసిన ‘క్షణం’ ఎవరూ ఊహించని విధంగా భారీ వసూళ్లు రాబట్టింది. సినిమా టీమ్‌ అందరికీ మంచి పేరొచ్చింది. ‘క్షణం’ హిట్‌తో మంచి ఇమేజ్‌ తెచ్చుకున్న హీరో అడవి శేష్‌ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న రెండు సినిమాలు డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతున్నవేనట! ఇక, ‘క్షణం’ దర్శకుడు రవికాంత్‌ పేరేపు ఇప్పటివరకూ మరో సినిమా స్టార్ట్‌ చేయలేదు. కారణం ఏంటంటే.. మంచి కథ కోసం వెతుకుతున్నారట!

మళ్లీ మళ్లీ చూశారు
‘క్షణం’ గతేడాది ఫస్టాఫ్‌ ఫిబ్రవరిలో విడుదలైతే... సెకండాఫ్‌ జూలైలో వచ్చిన మరో చిన్న సినిమా ‘పెళ్లి చూపులు’ కూడా భారీ హిట్‌ సాధించింది. నిర్మాతలకు భారీ లాభాలు తీసుకొచ్చింది. అసలు ‘పెళ్లి చూపులు’ కథలో ఉన్నదేంటి? బీటెక్‌ కంప్లీట్‌ చేసి, షెఫ్‌ కావాలనుకునే హీరో... ఫుడ్‌ ట్రక్‌ బిజినెస్‌ స్టార్ట్‌ చేయాలనుకునే హీరోయిన్‌... ‘పెళ్లి చూపులు’కి ఓ ఇంటికి వెళ్లబోయిన హీరో ఆమె ఇంటికి వెళ్లడం... తర్వాత ప్రేమ, వగైరా వగైరా కథ ఇంతే. కానీ, అందులోని పాత్రలు, సందర్భాలతో ప్రేక్షకులు తమను తాము రిలేట్‌ చేసుకున్నారు. దర్శకుడు తరుణ్‌భాస్కర్‌ సహజత్వానికి దగ్గరగా తీయడంతో ప్రేక్షకులు సినిమాని మళ్లీ మళ్లీ చూశారు. ‘పెళ్లి చూపులు’ తర్వాత హీరో విజయ్‌ దేవరకొండకి బడా బడా నిర్మాణ సంస్థల్లో నటించే ఛాన్సులు వచ్చాయి. సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌లో ‘ద్వారక’, గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా, ‘అర్జున్‌రెడ్డి’ అనే మరో సినిమా చేస్తున్నారు. దర్శకుడు తరుణ్‌భాస్కర్‌ మరో మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని కథ సిద్ధం చేసుకుంటున్నారు.

అనువాదం కూడా అదిరింది
స్ట్రయిట్‌ సినిమాలే కాదండీ... కథే హీరోగా వచ్చిన డబ్బింగ్‌ సినిమాలు కూడా బాక్సాఫీస్‌ దగ్గర వసూళ్ల దుమ్మ దులిపాయి. సినిమా బాగుంటే చాలు, మాకు భాషాబేధం లేదని ‘ద జంగిల్‌ బుక్‌’, ‘బిచ్చగాడు’, ‘మన్యం పులి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. సాధారణంగా హాలీవుడ్‌ సినిమాలు మెట్రో నగరాల్లో మాత్రమే ఎక్కువగా ఆడుతుంటాయి. ఒకవేళ తెలుగులో డబ్‌ చేసి విడుదల చేసినా బి, సి సెంటర్లలో చిల్లర తప్ప పెద్ద కలెక్షన్స్‌ కొల్లగొట్టిన సందర్భాలు తక్కువనే చెప్పాలి. అందుకే తక్కువ మొత్తానికే అనువాద హక్కులు దక్కించుకున్నారు. కానీ, ఎక్కువ లాభాలే చూశాను. ‘ద జంగిల్‌ బుక్‌’ భారతీయ సినీ ప్రముఖుల దిమ్మ తిరిగే వసూళ్లు సాధించింది. ఒక్క తెలుగులోనే కాదు.. భారతీయ భాషలన్నిటిలోనూ అనువాదమైన ఈ హాలీవుడ్‌ చిత్రం హిట్‌ హిట్‌ హుర్రే అనిపించుకుంది. చిన్నప్పుడు పుస్తకాల్లో చదివిన, టీవీలో చూసిన మోగ్లీ కథ కావడంతో మన ప్రేక్షకులు సినిమా చూడడానికి ఆసక్తి చూపించారు.

తమిళ డబ్బింగ్‌ ‘బిచ్చగాడు’ అయితే తెలుగులో కళ్లు చెదిరే కలెక్షన్స్‌ సాధించింది. ఆ సినిమా తెచ్చిన ఇమేజ్‌తో విజయ్‌ ఆంటోని తర్వాతి సినిమా ‘భేతాళుడు’ తెలుగులో భారీగా విడుదలైంది. 2015 వరకూ మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌కు తెలుగులో పెద్ద మార్కెట్‌ లేదు. స్ట్రయిట్‌ తెలుగు సినిమాలు ‘మనమంతా’, ‘జనతా గ్యారేజ్‌’లతో మన ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత మలయాళ డబ్బింగ్‌ ‘మన్యం పులి’తో మన ముందుకు వచ్చారు. ఇందులో యాక్షన్‌ సీన్లు తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాయి. మలయాళంలో 100 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా తెలుగులోనూ మంచి వసూళ్లు సాధించిందంటే కారణం సినిమాలో కథే. ఇప్పుడు మరో మలయాళ హిట్‌ ‘ఒప్పం’ తెలుగు డబ్బింగ్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి మోహన్‌లాల్‌ రెడీ అయ్యారు.

కొత్త ఏడాదిలోనూ కాలరెగరేస్తుందా?
2016లో రెండు మూడు కోట్లతో తీసిన సినిమాలు భారీ కలెక్షన్లు సాధించి, కాలరెగరేయడంతో ‘చిన్న సినిమా’కి పెద్ద రేంజ్‌ వచ్చింది. దాంతో పదుల సంఖ్యలో ‘లో–బడ్జెట్‌’ సినిమాలు ప్రారంభమవుతున్నాయి. 2017లోనూ మరిన్ని ఛోటా సినిమాలు రానున్నాయి. కింగ్‌లాంటి కంటెంట్‌తో తీస్తే.. ఈ ఏడాది కూడా చిన్న సినిమా తొడగొడుతుందని చెప్పొచ్చు. అయితే చిన్న సినిమాల పరిస్థితి బాగుంది కదా అని హడావిడిగా మొదలుపెట్టేసి, ‘మమ’ అనిపిస్తే మాత్రం హిట్‌ కష్టమే. అందుకే మంచి కథ, సరైన ప్లానింగ్‌తో సినిమాలు తీస్తే హిట్టవుతాయని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. పాయింటే కదా!


మీడియమ్‌... విజయం ఘనం!
మంచి కథతో కూడిన డిఫరెంట్‌ సినిమాలు చేసే యంగ్‌ హీరోల్లో నిఖిల్‌ ఒకరు. ‘స్వామి రారా’తో మొదలుకుని ఆ తర్వాత నిఖిల్‌ చేసిన సినిమాలే అందుకు నిదర్శనం. ప్రేక్షకుల్లో తనకున్న పేరును నిలబెట్టుకుంటూ గతేడాది ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చేశారు. పెద్ద నోట్ల చలామణీ రద్దు చేసిన తర్వాత విడుదలైన ఈ మీడియమ్‌ బడ్జెట్‌ సినిమా మంచి హిట్టయింది. కంటెంట్‌ బాగుంటే ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని నిరూపించింది. ఇక, భారీ చిత్రాలు నిర్మించే గీతా ఆర్ట్స్‌ తీసిన మీడియమ్‌ బడ్జెట్‌ సినిమా ‘శ్రీరస్తు సుభమస్తు’ అల్లు శిరీష్‌కి మంచి హిట్‌ అందించింది.


హ్యాపీ ఎండింగ్‌
‘కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌’ అని నిరూపించిన మరో సినిమా ‘అప్పట్లో ఒకడుండేవాడు’. 2016 డిసెంబర్‌ 31కి ఒక్క రోజు ముందు విడుదలైన ఈ సినిమా, ఇప్పుడు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. క్యారెక్టర్‌ లెంగ్త్‌ గురించి ఆలోచించకుండా కథపై నమ్మకంతో ఇంతియాజ్‌ అలీగా నటించిన నారా రోహిత్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అలాగే ఇందులో నటించిన మరో హీరో శ్రీవిష్ణు కూడా మంచి పేరు తెచ్చుకోగలిగారు. దర్శకుడు సాగర్‌ చంద్రపై ఇండస్ట్రీ దృష్టి పడింది. సుమారు రెండు కోట్లతో నిర్మించిన ఈ సినిమా 15 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద 2016కి ‘అప్పట్లో ఒకడుండేవాడు’ హ్యాపీ ఎండింగ్‌ ఇచ్చింది.

కమెడియన్స్‌ కేరాఫ్‌ హిట్‌ ఫిల్మ్స్‌!
కమెడియన్స్‌ శ్రీనివాసరెడ్డి, సప్తగిరిలు గతేడాది హీరోలుగా హిట్స్‌ అందుకున్నారు. అలాగని వీళ్లేమీ ఫుల్‌ టైమ్‌ హీరోలుగా మారలేదు. కమెడియన్స్‌గా సినిమాలు కంటిన్యూ చేస్తున్నారు. మంచి కథ, తన బాడీ లాంగ్వేజ్‌కి సూటవుతుందని ఫీలవడంతో ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’తో సప్తగిరి హీరో అయ్యారు. కామెడీతో పాటు డ్యాన్సులు, యాక్షన్‌ కూడా బాగా చేశారనే పేరు తెచ్చుకున్నారు. హీరోగా ఫస్ట్‌ మూవీతో మంచి హిట్‌ అందుకున్నారు. ఆల్రెడీ ‘గీతాంజలి’తో హీరోగా ఓ హిట్‌ అందుకున్న శ్రీనివాసరెడ్డి, మరోసారి ‘జయమ్ము నిశ్చయమ్మురా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇదీ హిట్‌ అన్పించుకుంది. కమెడియన్స్‌గా వీళ్ల ఇమేజ్‌తో పాటు కథలో కంటెంట్‌ ఉండడంతో ప్రేక్షకులు వీళ్లను హీరోలుగా మంచి మార్కులతో పాస్‌ చేసేశారు. ఈ ఏడాది కూడా కొంతమంది కమెడియన్లు హీరోలుగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే కమెడియన్‌ షకలక శంకర్‌ హీరోగా ‘నా కొడుకు పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ’ అనే సినిమా కమిట్‌ అయ్యారు. ఈ నెల 5న ఈ చిత్రం ఆరంభం కానుంది.

– సాక్షి సినిమా డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement