dulhan
-
అర్హులందరికి దుల్హన్ పథకం వర్తింపు
జిల్లామైనార్టీ సంక్షేమ అధికారి మస్తాన్‌వలి పాములపాడు: జిల్లాలో అర్హులైన లబ్ధిదారులందరికీ దుల్హన్ పథకం వర్తింపజేస్తునట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మస్తాన్‌వలి తెలిపారు. బుధవారం మండలంలోని బానుముక్కల గ్రామ పంచాయతీ భవనంలో విలేకరులతో మాట్లాడుతూ 2016 అక్టోబర్ 10 నాటికి ఆన్లైన్లో నమోదు చేసుకున్న 2431 మంది లబ్ధిదారులకు వారి బ్యాంకు ఖాతాల్లో రూ.12కోట్లు జమ చేసినట్లు చెప్పారు. 2017–18 సంవత్సరానికి గాను తొలి విడతలో రూ.4.56కోట్ల నిధులు మంజూరైనట్లు వివరించారు. ఈ పథకం అమలులో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో ఉందని చెప్పారు. ఈ పథకం ద్వారా లబ్ధిపొందాలంటే మైనార్టీ వర్గానికి చెందిన వారు వివాహమైన 56 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. అమ్మాయి వయస్సు 18, అబ్బాయి వయస్సు 21 సంవత్సరాలుండి ఆధార్, బ్యాంకు ఖాతా, పెళ్లి ఫొటో, కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మండల స్థాయిలో విచారణ అనంతరం జిల్లా కేంద్రానికి ఆన్లైన్లో పంపుతారని చెప్పారు. -
దుల్హన్ పథకానికి రూ.5 కోట్లు
– జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి మస్తాన్‌వలి కర్నూలు(అర్బన్): నిరుపేద వర్గాలకు చెందిన ముస్లిం మైనారిటీలకు దుల్హన్ పథకం ద్వారా 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.5 కోట్లతో ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి మస్తాన్‌వలి తెలిపారు. మంగళవారం స్థానిక బాలాజీ నగర్‌లోని మదీనా ఇంటర్నేషనల్ ఇస్లామిక్ హైస్కూల్లో ఆల్‌మేవా సంయుక్త కార్యదర్శి షంషుద్దీన్ అధ్యక్షతన దుల్హన్ పథకం, ముస్లిం విద్యార్థులకు ఉపకార వేతనాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మస్తాన్‌వలి మాట్లాడుతు అర్హులైన ముస్లిం మైనారిటీలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందాలన్నారు. ఆల్‌మేవా సభ్యుడు ఎస్.అబ్దుల్భారీ మాట్లాడుతు మౌలానా ఆజాద్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లిం విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపకార వేతనాలు అందించనున్నట్లు చెప్పారు. అర్హులైన విద్యార్థినీ, విద్యార్థులు ఈ నెల 30 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9985302570 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం పొందాలన్నారు. షంషుద్దీన్ మాట్లాడుతు ప్రతి ఒక్కరూ విద్యావంతులై సమాజాభివద్ధికి పాటు పడాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం మౌలానా హఫీజ్ఉస్మాన్, ఎస్ఎండీ ఆయూబ్సాబీర్, అబ్దుల్‌సుభాన్, ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు. -
'మైనారిటీల కోసం దుల్హన్'
హైదరాబాద్: మైనారిటీ యువతీ, యువకులకు వివాహ సమయంలో ఆర్థిక సహాయం చేయడానికి దుల్హన్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పౌరసంబంధాలశాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ పథకం కింద 18 ఏళ్లు నిండిన మైనారిటీ యువతీ యువకులకు వివాహ సమయంలో రూ. 50 వేలు ఆర్థిక సహాయం చేయనున్నట్టు మంత్రి చెప్పారు. ముస్లిం విద్యార్థులు, నిరుద్యోగుల కోసం రోషిని ప్యాకేజీ పథకాలు తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్యాకేజీలో భాగంగా తత్కాల్, సూక్ష్మరుణాలు, ఆదరణ, దుకాణ్ మకాన్ పథకాలు అమలు చేస్తామన్నారు. ఈ పథకాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని మైనార్టీలంతా వినియోగించుకోవచ్చని మంత్రి తెలిపారు.