duping women
-
‘కిలాడి కపుల్’.. పెళ్లి పేరుతో 35 మందికి ట్రాప్.. కోటికిపైగా వసూల్!
లక్నో: మ్యారేజ్ బ్యూరోల్లో నకిలీ వివరాలతో మోసాలకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. అలాంటి సంఘటనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో వెలుగుచూసింది. నకిలీ మ్యాట్రిమోనియల్ ప్రోఫైల్స్ ద్వారా ఓ కిలాడి జంట ఏకంగా 35 మందిని మోసం చేసింది. వారికి సుమారు రూ.1.6 కోట్లకు టోకరా వేశారు దంపతులు. నకిలీ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న జంటను సైబర్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్‌కు చెందిన మహిళ, జార్ఖండ్‌కు చెందిన వ్యక్తి కలిసి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఇద్దరు కలిసి ఇప్పటి వరకు 35 మందిని మోసగించారు. వారి నుంచి సుమారు రూ.1,63,83,000లు దోచుకున్నారు. ‘వివాహం పేరుతో తన కూతురి వద్ద రూ.27 లక్షలు తీసుకున్నారని ఓ సైనికాధికారి మొరాదాబాద్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సైబర్ సెల్ టీంతో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. దర్యాప్తు చేపట్టిన టీం ఇద్దరిని అరెస్ట్ చేసింది. వారిని కోర్టులో ప్రవేశపెట్టాం. గత ఏడాదిన్నరగా సుమారు 35 మందిని మోసగించినట్లు తేలింది. అందమైన ఫోటోలతో మ్యాట్రిమేనియల్ సైట్స్‌లో ఆకర్షించేలా ప్రోఫైల్స్ పెడతారు. ఎవరైనా వారి కాంటాక్ట్‌లోకి వస్తే వారిని మాటల్లో పెట్టి మచ్చిక చేసుకుంటారు. ఆ తర్వాత వివిధ కారణాలతో డబ్బులు అడుగుతారు. అరెస్ట్ చేసిన వారు జార్ఖండ్‌కు చెందిన బబ్లూ కుమార్, బిహార్‌కు చెందిన పూజా కూమారిగా గుర్తించాం. ఇరువురికి వివాహం జరిగింది ’ అని వివరాలు వెల్లడించారు డీఎస్పీ అనూప్ కుమార్. ఇదీ చదవండి: Squid Game: ఒకేసారి 1415 మంది విద్యార్థుల ఆట.. వీరికి రికార్డులు కొత్తేం కాదు.. -
ఇన్‌స్టాగ్రామ్‌లో పైలట్‌గా ప్రొఫైల్.. 30మంది మహిళలకు టోకరా!
గురుగ్రామ్: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులు సైతం మీతో స్నేహం చేస్తామంటూ ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపిస్తారు. అలా ముక్కు మొహం తెలియని వారిని చాలా మంది ఆహ్వానిస్తారు. అయితే.. ఇదే అదునుగా కొందరు మోసాలకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల పెరిగాయి. 25 ఏళ్ల ఓ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పైలట్‌గా ప్రొఫైల్ పిక్ పెట్టి 30 మంది మహిళలను మోసం చేశాడు. ఈ సంఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లో వెలుగు చూసింది. ఓ యువతి ఫిర్యాదుతో ఢిల్లీ శివారులోని సెక్టార్ 43 ప్రాంతంలో నిందితుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి డెబిట్ కార్డు, మొబైల్ ఫోన్, రెండు సిమ్ములు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు హేమంత్ శర్మగా గుర్తించారు పోలీసులు. బుధవారం సిటీ కోర్టులో హాజరుపరచగా.. జుడీషియల్ కస్టడీకి అప్పగించింది కోర్టు. పోలీసుల వివరాల ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్‌లో పైలట్‌గా చెప్పుకుని తనకు స్నేహితుడిగా మారాడని, మోసపూరితంగా తన ఖాతా నుంచి రూ.1 లక్ష ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఎస్హెచ్ఓ బిజేంద్ర సింగ్ నేతృత్వంలో బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసినట్లు తేలింది. ‘సుమారు 150 మంది యువతులకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపించాడు. విమానయాన సంస్థలో ఉద్యోగిగా చెప్పుకున్నాడు. వారిని మాటల్లో దింపి నిజమైన పైలెట్‌గానే నమ్మించేవాడు. ఆ తర్వాత తన ఖాతాకు డబ్బులు పంపించాలని కోరేవాడు. అలా చేసిన తర్వాత వారి ఖాతాలను బ్లాక్ చేస్తాడు. ఇప్పటి వరకు సుమారు 30 మందిని అలా మోసం చేసినట్లు తెలిసింది. మోసం చేసేందుకు ఇంటర్నెట్లో ఫొటోలు డౌన్లోడ్ చేసి ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకునేవాడు.’ ఏసీపీ ప్రీత్ పాల్ సింగ్ సంగ్వాన్ తెలిపారు. ఇదీ చదవండి: ‘భార్య అలిగి వెళ్లిపోయింది.. సెలవు ఇవ్వండి ప్లీజ్’.. క్లర్క్ లేఖ వైరల్ -
వ్యాపారవేత్తనంటూ మహిళలకు టోకరా
న్యూఢిల్లీ: విజయవంతమైన వ్యాపారవేత్తనంటూ వధూవరుల పరిచయ వెబ్సైట్ల ద్వారా మహిళలను మోసం చేస్తున్న ఢిల్లీకి చెందిన ఓ వివాహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన నుంచి 75 వేల రూపాయలు తీసుకుని మోసం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో అశోక్ విహార్‌కు చెందిన మనీశ్ గుప్తా (36).. వెబ్సైట్ల ద్వారా ఆకర్షితమైన బయోడేటాతో మహిళలకు వల వేసేవాడు. తాను విడాకులు తీసుకున్నానని, విజయవంతమైన వ్యాపారవేత్తనని నమ్మించే ప్రయత్నం చేస్తాడు. ఈ వివరాలు తెలుసుకున్న ఓ మహిళ మనీశ్‌ను సంప్రదించింది. కొంతకాలం తర్వాత మనీశ్ ఆమెను డబ్బు అడిగాడు. ఆయనపై నమ్మకం కలగడంతో 75 వేల రూపాయలు బ్యాంక్ ఎకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేసింది. డబ్బులు అందాక మనీశ్ ఆమెతో మాట్లాడటం మానేశాడు. ఆమెకు అనుమానం వచ్చి ఆరా తీయగా, మనీశ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, విడాకులు తీసుకోలేదని తెలిసింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. వాట్సప్ ద్వారా అతను తరచూ మహిళలను మోసం చేస్తున్నాడని, ఈ జాబితాలో 30 మంది మహిళలు ఉన్నట్టు పోలీస్ ఉన్నతాధికారి చెప్పారు.