వ్యాపారవేత్తనంటూ మహిళలకు టోకరా
న్యూఢిల్లీ: విజయవంతమైన వ్యాపారవేత్తనంటూ వధూవరుల పరిచయ వెబ్సైట్ల ద్వారా మహిళలను మోసం చేస్తున్న ఢిల్లీకి చెందిన ఓ వివాహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన నుంచి 75 వేల రూపాయలు తీసుకుని మోసం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీలో అశోక్ విహార్కు చెందిన మనీశ్ గుప్తా (36).. వెబ్సైట్ల ద్వారా ఆకర్షితమైన బయోడేటాతో మహిళలకు వల వేసేవాడు. తాను విడాకులు తీసుకున్నానని, విజయవంతమైన వ్యాపారవేత్తనని నమ్మించే ప్రయత్నం చేస్తాడు. ఈ వివరాలు తెలుసుకున్న ఓ మహిళ మనీశ్ను సంప్రదించింది. కొంతకాలం తర్వాత మనీశ్ ఆమెను డబ్బు అడిగాడు. ఆయనపై నమ్మకం కలగడంతో 75 వేల రూపాయలు బ్యాంక్ ఎకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసింది. డబ్బులు అందాక మనీశ్ ఆమెతో మాట్లాడటం మానేశాడు. ఆమెకు అనుమానం వచ్చి ఆరా తీయగా, మనీశ్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, విడాకులు తీసుకోలేదని తెలిసింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. వాట్సప్ ద్వారా అతను తరచూ మహిళలను మోసం చేస్తున్నాడని, ఈ జాబితాలో 30 మంది మహిళలు ఉన్నట్టు పోలీస్ ఉన్నతాధికారి చెప్పారు.