గురుగ్రామ్: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులు సైతం మీతో స్నేహం చేస్తామంటూ ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపిస్తారు. అలా ముక్కు మొహం తెలియని వారిని చాలా మంది ఆహ్వానిస్తారు. అయితే.. ఇదే అదునుగా కొందరు మోసాలకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల పెరిగాయి. 25 ఏళ్ల ఓ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పైలట్‌గా ప్రొఫైల్ పిక్ పెట్టి 30 మంది మహిళలను మోసం చేశాడు. ఈ సంఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లో వెలుగు చూసింది. ఓ యువతి ఫిర్యాదుతో ఢిల్లీ శివారులోని సెక్టార్ 43 ప్రాంతంలో నిందితుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి డెబిట్ కార్డు, మొబైల్ ఫోన్, రెండు సిమ్ములు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు హేమంత్ శర్మగా గుర్తించారు పోలీసులు. బుధవారం సిటీ కోర్టులో హాజరుపరచగా.. జుడీషియల్ కస్టడీకి అప్పగించింది కోర్టు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్‌లో పైలట్‌గా చెప్పుకుని తనకు స్నేహితుడిగా మారాడని, మోసపూరితంగా తన ఖాతా నుంచి రూ.1 లక్ష ట్రాన్స్‌ఫర్ చేసుకున్నట్లు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఎస్‌హెచ్‌ఓ బిజేంద్ర సింగ్ నేతృత్వంలో బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసినట్లు తేలింది. ‘సుమారు 150 మంది యువతులకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపించాడు. విమానయాన సంస్థలో ఉద్యోగిగా చెప్పుకున్నాడు. వారిని మాటల్లో దింపి నిజమైన పైలెట్‌గానే నమ్మించేవాడు. ఆ తర్వాత తన ఖాతాకు డబ్బులు పంపించాలని కోరేవాడు. అలా చేసిన తర్వాత వారి ఖాతాలను బ్లాక్ చేస్తాడు. ఇప్పటి వరకు సుమారు 30 మందిని అలా మోసం చేసినట్లు తెలిసింది. మోసం చేసేందుకు ఇంటర్నెట్‌లో ఫొటోలు డౌన్‌లోడ్ చేసి ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకునేవాడు.’ ఏసీపీ ప్రీత్ పాల్ సింగ్ సంగ్వాన్ తెలిపారు.
ఇదీ చదవండి: ‘భార్య అలిగి వెళ్లిపోయింది.. సెలవు ఇవ్వండి ప్లీజ్’.. క్లర్క్ లేఖ వైరల్
Comments
Please login to add a commentAdd a comment