dust bins
-
చెత్తకు చెక్!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో ఇటీవల కాలంలో ఏర్పడిన ఓపెన్ గార్బేజ్ పాయింట్లను తొలగించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ప్రస్తుతం బహిరంగ ప్రదేశాల్లో వేస్తున్న చెత్తను పూర్తిగా తొలగించి, తిరిగి అక్కడ వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోనుంది. ఇందుకు ప్రత్యేకంగా వలంటీర్లను నియమించడం, ఆయా ప్రదేశాల్లో ముగ్గులు వేయడం, మొక్కలు నాటడం తదితర పనులు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ సూచించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లను ఆదేశించారు. నగరంలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త భారీ ఎత్తున్న పోగవుతున్నవి దాదాపు 1,116 ప్రాంతాలున్నట్లు జీహెచ్ఎంసీ గతంలోనే గుర్తించింది. వల్నరబుల్ గార్బేజ్ పాయింట్స్‌గా గుర్తించిన వీటిని పూర్తిగా తొలగించేందుకు బల్దియా ప్రత్యేక ప్రణాళిక రూపొందించి పకడ్బందీగా అమలు చేయడంతో సమస్య తీరింది. అయితే వరుస పండగలు రావడం, భారీ వర్షాలు కురవడంతో తొలగించిన ఈ గార్బేజ్ పాయింట్లలో సగానికి పైగా తిరిగి ఏర్పడ్డాయి. ముఖ్యంగా చౌరస్తాలు, ప్రధాన కూడళ్లు, కమర్షియల్ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని, తిరిగి చెత్త వేస్తే జరిమానాలు విధించాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల జీహెచ్ఎంసీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఓపెన్ గార్బేజ్ పాయింట్లను పూర్తిగా తొలగించాలని కమిషనర్‌ను ఆదేశించారు. ఇదీ ప్రణాళిక... ♦ స్వచ్ఛ ఆటో టిప్పర్ల ద్వారా ఇంటింటి నుంచి చెత్తను మరింత సమర్థవంతంగా సేకరించడం. ♦ బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారికి భారీ జరిమానాలు విధించడం, హెచ్చరికలతో బ్యానర్లు ప్రదర్శించడం. ♦ దుకాణాదారులు, వ్యాపారస్తులు విధిగా చెత్తను ఆటో టిప్పర్లలోనే వేసే విధంగా అవగాహన కల్పించడం. ♦ బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారిని గుర్తించి వారికి సన్మానం చేసి, వారిలో మార్పు తెచ్చేందుకు కృషి చేయడం. ♦ ఈ పాయింట్లలో చెత్త వేయకుండా నివారించేందుకు స్థానిక కాలనీ సంక్షేమ సంఘాలు, వ్యాపార సముదాయాల యజమానులతో మరోసారి ప్రత్యేక సమావేశం నిర్వహించడం. ♦ పారిశుధ్య విభాగం అధికారులు, సిబ్బంది కార్పొరేటర్లు, కాలనీ సంఘాలు, బస్తీ కమిటీలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేయడం. ♦ చెత్తను తొలగించిన తర్వాత తిరిగి ఆయా ప్రదేశాల్లో వ్యర్థాలు వేయకుండా ముగ్గులు వేయడం, బ్యానర్లు ప్రదర్శించడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, జరిమానా విధించడం లాంటి చర్యలు చేపట్టడం. ♦ కాలనీల్లో స్థానిక రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవడం. ♦ ట్రాన్స్ఫర్ స్టేషన్లోనూ గార్బేజ్‌ను పూర్తిగా తొలగించడం. -
చెత్త డబ్బాలకు బైబై!
సాక్షి,సిటీబ్యూరో: నగరంలో బహిరంగ ప్రదేశాల్లోని డంపర్‌బిన్స్(పెద్ద చెత్తడబ్బాలు) క్రమేపీ తగ్గుతున్నాయి. ఇంటింటికీ రెండు రంగుల చెత్త డబ్బాలు పంపిణీ చేసిన జీహెచ్ఎంసీ.. చెత్త సేకరణకు స్వచ్ఛ ఆటోలను కూడా ప్రవేశపెట్టడంతో ఇంటి నుంచి చెత్త సేకరణ గతంలో కంటే మెరుగుపడింది. ఇంతకుముందు ఇళ్ల నుంచి చెత్త సేకరణకు కేవలం రిక్షాలు మాత్రమే ఉండేవి. నగరంలోని చాలా ఇళ్లకు చెత్త సేకరించే వారు వెళ్లేవారు కాదు. దాంతో వివిధ ప్రాంతాల్లో పెద్ద చెత్త డబ్బాలను ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ.. అవి నిండాక ట్రక్కుల ద్వారా తరలించేంది. ‘స్వచ్ఛ నగరం’ అమలులో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో చెత్త లేకుండా చేసేందుకు చెత్త ఉత్పత్తి స్థానంలోనే తడి–పొడిగా వేరు చేయడంతో పాటు ప్రతిరోజూ సేకరణ జరగాలని భావించి రెండు దశల్లో 2500 స్వచ్ఛ ఆటోలను వినియోగంలోకి తెచ్చారు. అవి వచ్చాక ఇళ్ల నుంచి చెత్త సేకరణ పెరిగింది. దాంతో బహిరంగ ప్రదేశాల్లోని చెత్త డబ్బాల అవసరం కూడా దాదాపు తగ్గింది. ఈ క్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో అవసరం లేనిచోట్ల ఉన్న దాదాపు 800 డబ్బాలను తొలగించారు. జీహెచ్ఎంసీలోని మొత్తం చెత్తడబ్బాల్లో ఇవి 25 శాతం. ప్రస్తుతం స్వచ్ఛ హైదరాబాద్– షాన్‌దార్ హైదరాబాద్ కార్యక్రమానికి సిద్ధమైన జీహెచ్ఎంసీ.. అన్ని ఇళ్ల నుంచి ప్రతిరోజూ చెత్త సేకరణ జరిగేందుకు చర్యలకు సిద్ధమైంది. అందుకు ప్రతిరోజూ స్వచ్ఛ ఆటోల నిర్వాహకులు తమ పరిధిలోని అన్ని ఇళ్లకు వెళ్లేదీ లేనిదీ గుర్తించడంతో పాటు, తరలించని వారిపై చర్యలు కూడా తీసుకోనున్నారు. ‘డస్ట్‌బిన్ ఫ్రీ సిటీ’గా మార్చేందుకు చేపట్టిన వివిధ చర్యల్లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో, రోడ్ల వెంబడి చెత్తడబ్బాలను తగ్గించే కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నారు. పెరిగిన జనాభా, కాలనీలతో చెత్త ఉత్పత్తి పెరిగినప్పటికీ, అందుకనుగుణంగా చెత్త తరలించే వాహనాలను పెంచుతున్నారు. గ్రేటర్లో ‘స్వచ్ఛ’ చర్యలు ఇలా.. స్వచ్ఛ ఆటోలు: 2,500 చెత్త రిక్షాలు: 2,600 తడి–పొడి చెత్త వేరు చేసేందుకుపంపిణీ చేసిన డబ్బాలు: 44 లక్షలు వీటికి చేసిన ఖర్చు: రూ.29 కోట్లు -
డస్ట్‌బిన్ మస్ట్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లోని వీధి వ్యాపారులు (స్ట్రీట్ వెండర్స్) తప్పనిసరిగా డస్ట్బిన్లను ఏర్పాటు చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని జీహెచ్ఎంసీ అధికారులను కమిషనర్‌ఎం.దానకిషోర్ ఆదేశించారు. సోమవారం సాఫ్, షాన్‌దార్ హైదరాబాద్, హరితహారం, కోర్టు కేసులు, స్ట్రీట్ వెండింగ్ పాలసీ తదితర అంశాలపై జోనల్, డిప్యూటీ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ దాన కిషోర్ మాట్లాడుతూ నగరంలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నప్పటికీ ఫుట్‌పాత్‌లు, రహదారులకు ఇరువైపులా ఉండే చిరు వ్యాపారులు రాత్రివేళలో పెద్ద ఎత్తున గార్బేజ్‌ను రహదారులపై వదిలి వెళుతున్నారని, తద్వారా స్వచ్ఛ కార్యక్రమాలకు అంతరాయం కలుగుతుందని అన్నారు. ప్రతి వీధి వ్యాపారి విధిగా డస్ట్బిన్లను వారంలోగా ఏర్పాటు చేసుకునేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. నగరంలో గుర్తించిన 161 సమస్యాత్మక ముంపు ప్రాంతాలæ చుట్టూ 500 మీటర్ల విస్తీర్ణంలో ఏవిధమైన హాకర్లు, చిరు వ్యాపారులు లేకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి సర్కిల్‌కు నాలుగు వాహనాలు నగరంలో వచ్చే సోమవారం నుండి సాయంత్ర వేళలోనూ గార్బేజ్‌ను తరలించేందుకు ప్రతి సర్కిల్‌కు నాలుగు వాహనాలు, బాబ్‌కాట్‌లను కేటాయించనున్నట్టు దానకిషోర్ తెలిపారు. గ్రేటర్లో ప్రతిరోజు నగరవాసుల వినియోగార్థం 420 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తుండగా దీనిలో 50 మిలియన్ గ్యాలన్ల నీటిని వృథాగా రోడ్లపై వదులుతున్నారని అన్నారు . ఈ వృథాగా అయ్యే నీరు ప్రస్తుతం చెన్నై నగరానికి అందించే నీటితో సమానమని ఆయన వెల్లడించారు. నీటిని వథాగా రోడ్లపై వదిలేవారిని గుర్తించి పెద్ద ఎత్తున జరిమానాలు విధించాలని, ముఖ్యంగా బహుళ అంతస్తుల భవనాలు, వ్యాపార సంస్థలు, ఎవరు నీటిని వథాగా రోడ్లపైకి వదిలినా భారీ ఎత్తున జరిమానాలు విధించాలని కమిషనర్ స్పష్టం చేశారు. నగరంలో పారిశుధ్య కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించడానికి డిప్యూటి కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు ఉదయం 7గంటలలోపు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ఈ సందర్భంగా గార్బేజ్ పాయింట్లను తొలగించే ప్రక్రియను ఫోటోల ద్వారా నివేదికను సమర్పించాలని దానకిషోర్ అన్నారు. ప్రైవేటు నర్సరీల ద్వారా మొక్కల సేకరణ హరితహారం లక్ష్య సాధనకు కావాల్సిన మొక్కలను ప్రైవేట్ నర్సరీల నుంచి సేకరించడానికి టెండర్ ప్రక్రియలో మార్పు తేవాలని కమిషనర్ అధికారులకు సూచించారు. ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న భవన నిర్మాణ వ్యర్థాలను తొలగించడానికి ప్రస్తుతం 78 వాహనాలను ఉపయోగిస్తున్నామని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లో స్వచ్ఛ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి సాఫ్, షాన్‌దార్ హైదరాబాద్ కార్యక్రమం ప్రారంభించి రెండు నెలలకు పైగా అయ్యిందని, ఈ లొకేషన్లలో మంచి ఫలితాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణ, సాధించిన ఫలితాలు రానున్న కాలంలో చేపట్టే చర్యలపై స్థానిక శాసనసభ్యులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులకు వివరిస్తూ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రూ. 3 కోట్లు.. సాఫ్, షాన్‌దార్ హైదరాబాద్ తొలివిడత కార్యక్రమ నిర్వహణకు దాదాపు మూడు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని కమిషనర్ వెల్లడించారు. ఈ కార్యక్రమ నిర్వహణపై అలసత్వం వహిస్తే సహించేదిలేదని అధికారులను హెచ్చరించారు. న్యాయ స్థానాల్లో జీహెచ్ఎంసీపై ఉన్న కేసులను ప్రతి వారం పర్యవేక్షించాలని జోనల్, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్లు అమ్రపాలి కాట, అద్వైత్ కుమార్ సింగ్, కెనడి, కష్ణ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, చీఫ్ ఇంజనీర్లు సురేష్, శ్రీధర్, జియాఉద్దీన్, సిసిపిలు దేవేందర్‌రెడ్డి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
‘చెత్త’ యోచనకు స్వస్తి..
హైదరాబాద్ సిటీ : ఆస్తి పన్ను బకాయిదారులను దారికి తెచ్చుకునేందుకు వివిధ ప్రాంతాల్లో ఇళ్లు, షాపులు, బ్యాంక్‌ల ముందు జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన చెత్త డబ్బాలను (డంప్ బిన్లు) శుక్రవారం ఉదయం సంబంధిత అధికారులు తొలగించారు. బకాయిదారుల నుంచి పన్నులు రాబట్టేందుకు సర్కిల్-10 అధికారులు గురువారం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సోమాజిగూడలలో 12 చోట్ల చెత్తకుండీలను ఏర్పాటు చేశారు. కాంప్లెక్స్‌ల ముందు, ఇళ్ల గేట్ల మధ్య వీటిని పెట్టడంతో ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ విషయమై సీఎం కేసీఆర్ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో అధికారులు హుటాహుటిన వీటిని తొలగించారు.