డస్ట్‌బిన్‌ మస్ట్‌ | GHMC Warning to Street Vendors Must Use Dustbins | Sakshi
Sakshi News home page

డస్ట్‌బిన్‌ మస్ట్‌

Published Tue, Jul 9 2019 11:05 AM | Last Updated on Tue, Jul 9 2019 11:53 AM

GHMC Warning to Street Vendors Must Use Dustbins - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ హైదరాబాద్‌లోని వీధి వ్యాపారులు (స్ట్రీట్‌ వెండర్స్‌) తప్పనిసరిగా డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేసేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని జీహెచ్‌ఎంసీ అధికారులను కమిషనర్‌ఎం.దానకిషోర్‌ ఆదేశించారు.  సోమవారం సాఫ్, షాన్‌దార్‌ హైదరాబాద్, హరితహారం, కోర్టు కేసులు, స్ట్రీట్‌ వెండింగ్‌ పాలసీ తదితర అంశాలపై జోనల్, డిప్యూటీ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ దాన కిషోర్‌ మాట్లాడుతూ నగరంలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నప్పటికీ ఫుట్‌పాత్‌లు, రహదారులకు ఇరువైపులా ఉండే చిరు వ్యాపారులు రాత్రివేళలో పెద్ద ఎత్తున గార్బేజ్‌ను రహదారులపై వదిలి వెళుతున్నారని, తద్వారా స్వచ్ఛ కార్యక్రమాలకు అంతరాయం కలుగుతుందని అన్నారు. ప్రతి వీధి వ్యాపారి విధిగా డస్ట్‌బిన్‌లను వారంలోగా ఏర్పాటు చేసుకునేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని ఆదేశించారు. నగరంలో గుర్తించిన 161 సమస్యాత్మక ముంపు ప్రాంతాలæ చుట్టూ 500 మీటర్ల విస్తీర్ణంలో ఏవిధమైన హాకర్లు, చిరు వ్యాపారులు లేకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

ప్రతి సర్కిల్‌కు నాలుగు వాహనాలు
నగరంలో వచ్చే సోమవారం నుండి సాయంత్ర వేళలోనూ గార్బేజ్‌ను తరలించేందుకు ప్రతి సర్కిల్‌కు నాలుగు వాహనాలు, బాబ్‌కాట్‌లను కేటాయించనున్నట్టు దానకిషోర్‌ తెలిపారు. గ్రేటర్‌లో ప్రతిరోజు నగరవాసుల వినియోగార్థం 420 మిలియన్‌ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తుండగా దీనిలో 50 మిలియన్‌ గ్యాలన్ల నీటిని వృథాగా రోడ్లపై వదులుతున్నారని అన్నారు . ఈ వృథాగా అయ్యే నీరు ప్రస్తుతం చెన్నై నగరానికి అందించే నీటితో సమానమని ఆయన వెల్లడించారు. నీటిని వథాగా రోడ్లపై వదిలేవారిని గుర్తించి పెద్ద ఎత్తున జరిమానాలు విధించాలని, ముఖ్యంగా బహుళ అంతస్తుల భవనాలు, వ్యాపార సంస్థలు, ఎవరు నీటిని వథాగా రోడ్లపైకి వదిలినా భారీ ఎత్తున జరిమానాలు విధించాలని కమిషనర్‌ స్పష్టం చేశారు. నగరంలో పారిశుధ్య కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించడానికి డిప్యూటి కమిషనర్లు, మెడికల్‌ ఆఫీసర్లు ఉదయం 7గంటలలోపు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ఈ సందర్భంగా గార్బేజ్‌ పాయింట్లను తొలగించే ప్రక్రియను ఫోటోల ద్వారా నివేదికను సమర్పించాలని దానకిషోర్‌ అన్నారు. 

ప్రైవేటు నర్సరీల ద్వారా మొక్కల సేకరణ
హరితహారం లక్ష్య సాధనకు కావాల్సిన మొక్కలను ప్రైవేట్‌ నర్సరీల నుంచి సేకరించడానికి టెండర్‌ ప్రక్రియలో మార్పు తేవాలని కమిషనర్‌ అధికారులకు సూచించారు. ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న భవన నిర్మాణ వ్యర్థాలను తొలగించడానికి ప్రస్తుతం 78 వాహనాలను ఉపయోగిస్తున్నామని తెలిపారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో స్వచ్ఛ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి సాఫ్, షాన్‌దార్‌ హైదరాబాద్‌ కార్యక్రమం ప్రారంభించి రెండు నెలలకు పైగా అయ్యిందని, ఈ లొకేషన్లలో మంచి ఫలితాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణ, సాధించిన ఫలితాలు రానున్న కాలంలో చేపట్టే చర్యలపై స్థానిక శాసనసభ్యులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులకు వివరిస్తూ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

రూ. 3 కోట్లు..
సాఫ్, షాన్‌దార్‌ హైదరాబాద్‌ తొలివిడత కార్యక్రమ నిర్వహణకు దాదాపు మూడు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని కమిషనర్‌ వెల్లడించారు. ఈ కార్యక్రమ నిర్వహణపై అలసత్వం వహిస్తే సహించేదిలేదని అధికారులను హెచ్చరించారు. న్యాయ స్థానాల్లో జీహెచ్‌ఎంసీపై ఉన్న కేసులను ప్రతి వారం పర్యవేక్షించాలని జోనల్, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్‌ కమిషనర్లు అమ్రపాలి కాట, అద్వైత్‌ కుమార్‌ సింగ్, కెనడి, కష్ణ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటి, చీఫ్‌ ఇంజనీర్లు సురేష్, శ్రీధర్, జియాఉద్దీన్, సిసిపిలు దేవేందర్‌రెడ్డి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement