duty doctor
-
ఉస్మానియాలో కలకలం: డ్యూటీ డాక్టర్ నెత్తిన పడిన ఫ్యాన్
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిలో సోమవారం ప్రమాదం సంభవించింది. ఓపీలో డెర్మటాలజీ విభాగంలో.. విధులు నిర్వర్తిస్తున్నడాక్టర్ భువనశ్రీపై ఒక్కసారిగా ఫ్యాన్ ఊడిపడింది. దీంతో ఆమె కింద పడిపోయింది. ఈ క్రమంలో భువనశ్రీ తలకి తీవ్ర గాయమైంది. తోటి డాక్టరు వెంటనే ఆమెకు కట్లు కట్టారు. ప్రస్తుతం డాక్టర్ భువనశ్రీకి ఎలాంటి ప్రాణాపాయం లేదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా, ప్రభుత్వ ఆసుపత్రులలో జరుగుతున్న వరుస ప్రమాదాలతో పెషేంట్లు, డాక్టర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఎన్నో అనుమానాలు.. ‘మొహంపై గీతలు, రక్తం, కన్ను గుడ్డు లేదు’ -
ఉస్మానియాలో కలకలం: డ్యూటి డాక్టర్ నెత్తిన పడిన ఫ్యాన్
-
బ్లాక్ ఫంగస్ చికిత్సకు రూ.22 లక్షలు తీసుకున్నారు!
లబ్బీపేట (విజయవాడ తూర్పు): బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రిలో చేరితే, ఇంజక్షన్ల కొరత ఉందంటూ ఓ డ్యూటీ వైద్యురాలు తమ వద్ద నుంచి రూ.22 లక్షలు వసూలు చేసిందని ఓ వ్యక్తి వైద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. తాము చెల్లింపులన్నీ డ్యూటీ డాక్టర్ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాకు జమ చేసినట్లు ఆధారాలతో సహా ఫిర్యాదుకు జత చేయడంతో దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన పొట్టెం విజయలక్ష్మి శరన్ ఈ ఏడాది మే 28న బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేరారు. ఆ సమయంలో ఆ వార్డులో డ్యూటీ డాక్టర్‌గా ఉన్న (కోవిడ్ నియామకం) తోట వాణి సుప్రియ లయోఫిలైజుడ్ యాంఫోటెరిసిన్ బి అనే యాంటి ఫంగల్ ఇంజెక్షన్స్ కొరత ఉందని, డిమాండ్ కూడా ఎక్కువగా ఉందని, ముడుపులు చెల్లిస్తే కానీ ఇంజెక్షన్లు సమకూర్చలేమని చెప్పినట్లు విజయలక్ష్మి భర్త రఘుకులేశ శరన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో విడతల వారీగా తాము రూ.22 లక్షలు డ్యూటీ డాక్టర్ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌కు ఇచ్చిన ఫిర్యాదుతో జత చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం ఉచితంగా యాంటీ ఫంగల్ మందులను ఇస్తుంటే, ఇలా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకోవడం దారుణమని, తమని మోసం చేసిన డ్యూటీ డాక్టర్‌పై చర్యలు తీసుకుని, ఆమె వెనుక ఉన్న సూత్రధారులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. జేసీ సీరియస్.. బ్లాక్ ఫంగస్ రోగి నుంచి రూ.22 లక్షలు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్.శివశంకర్ సీరియస్ అయినట్లు తెలిసింది. ఈ మేరకు ఆస్పత్రి అధికారులను తమ కార్యాలయానికి పిలిపించుకుని బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పాటు, ఇతర వివరాలను సేకరించారు. కాగా ఈ విషయమై బాధితులు వారం కిందటే జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారికి ఫిర్యాదు చేసినా, దానిని ఆస్పత్రి అధికారులకు పంపకుండా వారి వద్దే ఉంచుకున్నట్లు తెలిసింది. ఇప్పుడు ఘటన వెలుగులోకి రావడంతో హడావుడిగా తమకు వచ్చిన ఫిర్యాదును ఆస్పత్రి అధికారులకు పంపారు. విచారణ జరుగుతోంది రోగి నుంచి రూ.22 లక్షలు తీసుకున్నట్లు వచ్చిన ఫిర్యాదుపై జేసీ నేతృత్వంలో విచారణ జరుపుతున్నాం. తమకు ఇచ్చిన ఫిర్యాదు వివరాలు మొత్తం జేసీకి ఇచ్చాము. రోగి ప్రభుత్వాస్పత్రి నుంచి వెళ్లిన తర్వాత ఇంటి వద్ద కూడా ఈ వైద్యురాలు చికిత్స చేసినట్లు తెలిసింది. అన్ని విషయాలు విచారణలో తేలుతాయి. – డాక్టర్ ఎం జగన్మోహనరావు, సూపరింటెండెంట్ -
వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి
సాక్షి, సిద్దిపేటటౌన్: సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పురిట్లోనే పాప మృతిచెందిన ఘటన బుధవారం సిద్దిపేటలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం చేర్యాల మండలం వేచరేణి గ్రామానికి చెందిన లక్ష్మి, లింగయ్యల కుమార్తె రజిత అలియాస్ లక్ష్మిప్రియ (23)కి సికింద్రాబాద్ ఈస్ట్‌మారెడ్‌పల్లికి చెందిన మధుతో ఏడాది క్రితం వివాహం జరిగింది. డెలివరీ కోసం తల్లిగారింటికి వచ్చిన లక్ష్మిప్రియకు మంగళవారం మధ్యాహ్నం పురిటి నొప్పులు రావడంతో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు నొప్పులు ఎక్కువ రావడం లేదని అబ్జర్వేషన్లో ఉంచారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో కొద్దికొద్దిగా పురిటి నొప్పులు రావడంతో మరోసారి పరీక్షించి సాయంత్రం వరకు చూడాలని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈలోగా పురిటినొప్పులు తగ్గడంతో అనుమానం వచ్చిన డాక్టర్లు పరీక్షించి శిశువు ఉమ్మ నీరు తాగిందని, కుటుంబ సభ్యులు సంతకాలు చేస్తేనే ఆపరేషన్ చేస్తామని డ్యూటీ డాక్టర్ స్పష్టం చేయడంతో కుటుంబ సభ్యులు సంతకాలు పెట్టారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆపరేషన్ చేసి పాప కడుపులోనే మృతి చెందిందని డాక్టర్ చెప్పినట్లు బంధువులు ఆరోపించారు. పాప మృతికి డాక్టర్ నిర్లక్ష్యమే కారణమని, పాప మృతికి కారణమైన డాక్టర్‌ను సస్పెండ్ చేయాలని పాప తండ్రి మధు డిమాండ్ చేశారు. పాప మృతిచెందిన విషయం డాక్టర్లు చెప్పగానే సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసామని, అయినా పోలీసులు డాక్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మధు ఆరోపించారు. ఈ విషయంపై వన్ టౌన్ ఎస్సై శ్రీనివాస్‌ను వివరణ కోరగా పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
లోకం చూడకుండానే ప్రాణం పోయింది!
నవమాసాలు మోసి.. పండంటి బిడ్డను కళ్లారా చూడాలనుకున్న ఆ తల్లికి గర్భశోకమే మిగిలింది. పురిటిలోనే బిడ్డను కోల్పోవడంతో తల్లడిల్లిపోయింది. శిశువు మరణానికి ఆస్పత్రి వర్గాల నిర్లక్షమే కారణమంటూ బాధిత కుటుంబీకులు ఆందోళనకు దిగారు. నర్సులు సైతం నిరసనకు దిగి ఆశ్చర్య పరిచారు. ఈ సంఘటన రాజాం సామాజిక ఆస్పత్రి వద్ద గురువారం చోటుచేసుకుంది. విజయనగరం, రాజాం సిటీ : రాజాం సామాజిక ఆస్పత్రికి విజయనగరం జిల్లా బలిజిపేట మండలం గళావళ్లి గ్రామానికి చెందిన గర్భిణి కింజంగి కల్యాణి ప్రసవం కోసం వచ్చి చేరింది. ఈమె అత్త వారు వంగర మండలం కొండచాకరాపల్లి కాగా గర్భిణి కావడంతో కన్నవారి ఇంటి వద్ద ఉండేది. నెలలు నిండడంతో కుటుంబీకులు ఆమెను బుధవారం రాజాం సామాజిక ఆస్పత్రికి తీసుకువచ్చారు. వివిధ పరీక్షలు, స్కానింగ్‌లు చేసిన సిబ్బంది డెలివరీకి సమయం ఉందంటూ నచ్చజెప్పి ఇంటికి పంపించే ప్రయత్నం చేశారు. అయితే కల్యాణికి వంట్లో నలతగా ఉండడంతో భయపడిన కుటుంబీకులు ఆమెను ఆస్పత్రిలోనే ఉంచారు. బుధవారం రాత్రి 11 గంటల నుంచి కల్యాణికి నొప్పులు వచ్చాయి. ఈ విషయాన్ని చెప్పేందుకు డ్యూటీ డాక్టర్ సునీత కోసం కల్యాణి కుటుంబీకులు ఆరా తీశారు. అయితే ఆమె లేకపోవడంతో అక్కడ ఉన్న సిబ్బందికి తెలియజేశారు. దీంతో డ్యూటీలో ఉన్న ఇద్దరు నర్సులు మందులు ఇచ్చి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే ఆ తరువాత కూడా కల్యాణికి నొప్పులు తగ్గకపోవడంతో ఇబ్బంది పడింది. ఈ విషయాన్ని కూడా నర్సుల దృష్టికి కుటుంబీకులు తీసుకెళ్లారు. ఇదే సమయంలో కల్యాణకి రక్త స్రవం అధికం కావడంతో ఆందోళన చెందారు. వైద్యం అందించాలని నర్సులను వేడుకున్నారు. దీంతో గురువారం తెల్లవారు జామున నర్సులు కలుగజేసుకొని ప్రసవం జరిపించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బిడ్డ చనిపోయింది. దీంతో కల్యాణి కుటుంబీకు ఆగ్రహానికి గురయ్యారు. నొప్పులు అధికంగా ఉన్నాయని, బతిమిలాడుకున్నా డ్యూటీ డాక్టర్ రాలేదని, నర్సులే బలవంతంగా వైద్యం చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని కల్యాణి భర్త తిరుపతిరావు ఆరోపించారు. వేరే ఆస్పత్రికి వెళ్లి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని రోదించాడు. చేతులారా పండంటి బిడ్డను కోల్పోయామని కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఆస్పత్రి వద్ద ఆందోళన విషయం తెలుసుకున్న కల్యాణి బంధువులు, కొండచాకరాపల్లి, గళావల్లి గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు గురువారం ఉదయం చేరుకున్నారు. కల్యానికి జరిగిన అన్యాయంపై ఆస్పత్రి వర్గాలను నిలదీశారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. రంగంలోకి సూపరింటెండెంట్... ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌నాయుడు బాధితరాలు కల్యాణి కుటుంబీలతో మాట్లాడారు. పూర్తి వివరాలు సేకరించారు. ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్ లేకపోవడం ఏమిటని, నర్సులు వైద్యం చేయడమేమిటని మండిపడ్డారు. గర్భిణులు, శిశువుల ప్రాణాలతో ఆస్పత్రి సిబ్బంది ఆడుకుంటున్నారని బాధిత కుటుంబీకులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని పట్టబట్టారు. ఆస్పత్రి సిబ్బందితో కూడా సూపరింటెండెంట్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కల్యాణికి వైద్యం చేసిన నర్సులు మాట్లాడుతూ డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతోనే తామే వైద్యం చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కాన్పు కష్టంగా ఉండడంతో తమకు తెలిసిన పద్ధతిలో ప్రయత్నించామని.. అయితే దురదృష్టవశాత్తు బిడ్డ చనిపోయింది పేర్కొన్నారు. సూపరింటెండెంట్ విలేకరులతో మాట్లాడుతూ మృతశిశువే జన్మించిందని..ఇందులో తమ సిబ్బంది తప్పులేదని స్పష్టం చేశారు. డ్యూటీ డాక్టర్ ఎక్కడ? బుధవారం రాత్రి ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్ లేకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. తమ బిడ్డకు బాగోలేదని సమాచారం అందించినా డాక్టర్ రాలేదని.. నర్స్‌లే మొత్తం డ్రామాలు ఆడారని బాధితులు వాపోయారు. సకాలంలో మెరుగైన వైద్యం అందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదికాదన్నారు. నర్సుల నిరసన డ్రామా ఇదిలా ఉండగా తమపైకి ఆరోపణలు రావడంతో ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న నర్సులంతా ఒక్కటయ్యారు. డాక్టర్లు అందుబాటులో ఉండడంలేదని, రాత్రి, పగలు మేమే సేవలందిస్తున్నామని మీడియా ఎదుట చెప్పుకొచ్చారు. కల్యాణకి కష్టపడి వైద్యం అందించామని.. అయితే బిడ్డ చనిపోవడం బాధాకరమన్నారు. తమను ఏమైనా అంటే ఊరుకునేది లేదంటూ నిరసన డ్రామాకు తెరలేపారు. ఈ విషయం చర్చనీయాంశమైంది. భవిష్యత్‌లో డ్యూటీ డాక్టర్లు, సంబంధిత డాక్టర్లు ఉంటేనే రోగులకు సేవలందిస్తామని, లేకుంటే సేవలు చేయలేమని నర్సులంతా స్పష్టం చేశారు.విచారణ..శిశువు మృతిపై పాలకొండ ఆర్డీవో రెడ్డి గున్నయ్యతోపాటు డీసీహెచ్ఎస్ సూర్యారావులు మెజిస్ట్రేటియల్ విచారణ జరిపారు. ముందుగా ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎం సీహెచ్ నాయుడును, డ్యూటీ డాక్టర్ సునీతను, నర్సులు పద్మావతి, రమాదేవిలను రెండు గంటలపాటు విచారించారు. విచారణ నివేదికను కలెక్టర్‌కు సమర్పిస్తామన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదని, ఎంతటి వారైనా శిక్షార్హులేనని డీసీహెచ్ఎస్ సూర్యారావు విలేకరులకు తెలిపారు. -
డ్యూటీ డాక్టర్ తొలగింపు
కోహీర్: విధి నిర్వాహణలో నిర్లక్ష్యం వహించిన కోహీర్ ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ సుధీర్‌కుమార్‌ను విధుల నుంచి తొలగించామని క్లస్టర్ వైద్యాధికారి వెంకట్ రంగారావు తెలిపారు. శనివారం ఆయన కోహీర్ ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం విధులకు హాజరై ఎలాంటి అనుమతి లేకుండా మధ్యాహ్నం నుంచి వెళ్లి పోయారని తెలిపారు. డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ప్రమాద క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందలేదన్నారు. స్థానిక అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా వైద్యాధికారి అధికారి అమర్‌సింగ్ డాక్టర్ సుధీర్‌కుమార్‌ను విధుల నుంచి తొలగించారని తెలిపారు. ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉందని, దీంతో తరుచుగా ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఖాళీగా ఉన్న పోస్తుల భర్తీ కోసం జిల్లా వైద్యాధికారికి నివేదిక పంపిస్తామన్నారు. ఆస్పత్రి పనివేళల్లో అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన సేవలు అందించాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు.