dyanchand
-
భారత హాకీ దిగ్గజంపై సినిమా
ముంబై : క్రికెటర్లు ధోని, సచిన్ టెండూల్కర్... అథ్లెట్ మిల్కా సింగ్... బాక్సర్ మేరీకోమ్... హాకీ ప్లేయర్ సందీప్ సింగ్‌లపై ఇప్పటికే బయోపిక్‌లు వచ్చా యి. మైదానంలో ఆడిన ఆట మలీ్టప్లెక్స్, సినిమా తెరలపై కూడా ఆడింది. కానీ వీరందరికంటే ముందు అసాధారణ ఆటతో భారత్‌ను గెలిపించి, మువ్వన్నెలను మురిపించి, నియంతలనే మెప్పించిన హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ ‘షో’ వెండితెరపై వెనుకబడింది. అయితే ఇప్పుడు ఆ ముచ్చట కూడా త్వరలోనే తీరనుంది. బాలీవుడ్ డైరెక్టర్ అభిషేక్ చౌబే భారత హాకీ లెజెండ్‌పై బయోపిక్ రూపొందించనున్నట్లు మంగళవారం ప్రకటించారు. అన్నట్లు ఈ చిత్రం పేరు మన లెజెండ్ హీరో పేరే... ‘ధ్యాన్‌చంద్’. ఆర్ఎస్వీపీ మూవీస్, బ్లూ మంకీ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రనిర్మాణం చేపట్టినట్లు దర్శకుడు తెలిపారు. వచ్చే ఏడాది సెట్స్‌పై లైట్స్... కెమెరా... యాక్షన్... అంటూ రూపుదిద్దుకోనుంది. 2022లో విడుదల కానుంది. భారత హాకీ చరిత్రనే ‘స్వర్ణ’ అక్షరాలతో లిఖించిన మూడు ఒలింపిక్స్ (1928–అమ్‌స్టర్‌డామ్), (1932 –లాస్ఏంజెలిస్), (1936– బెర్లిన్) ప్రదర్శనలను ఈ చిత్రంలో చూపించనున్నారు. అయితే తెరపై ఎవరా ‘ధ్యాన్‌చంద్’ అంటే కొన్నాళ్లు నిరీక్షించాలి. స్టార్ హీరోతోనే ఈ చిత్రం ఉంటుందని సమాచారం. -
చరిత్రలో తొలిసారి...
న్యూఢిల్లీ: గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడా పురస్కారాల విషయంలో విశాల హృదయం చాటుకుంది. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న’ను ఒకేసారి అత్యధికంగా ఐదుగురికి అందజేయాలని నిర్ణయించింది. 2019 సంవత్సరానికిగాను రోహిత్ శర్మ (క్రికెట్), వినేశ్ ఫొగాట్ (మహిళల రెజ్లింగ్), రాణి రాంపాల్ (మహిళల హాకీ), మనిక బత్రా (మహిళల టేబుల్ టెన్నిస్), మరియప్పన్ తంగవేలు (పారా అథ్లెటిక్స్) ‘ఖేల్‌రత్న’ పురస్కారాలకు ఎంపికయ్యారు. గతంలో 2016లో ఒకేసారి అత్యధికంగా నలుగురికి ‘ఖేల్‌రత్న’ అవార్డును ఇచ్చారు. 2016 రియో ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన షట్లర్ పీవీ సింధు, రెజ్లర్ సాక్షి మలిక్, నాలుగో స్థానం పొందిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఫైనల్ చేరిన షూటర్ జీతూ రాయ్‌లకు ఈ అవార్డు అందజేశారు. దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మరణానంతరం ఆయన స్మారకార్థం 1991లో ‘ఖేల్‌రత్న’ అవార్డును ప్రవేశపెట్టారు. గతంలో ‘ద్రోణాచార్య’ అవార్డును ఒకేసారి అత్యధికంగా ఎనిమిది మందికి... ‘ధ్యాన్‌చంద్’ అవార్డును అత్యధికంగా ఐదుగురికి ఇచ్చారు. గత సోమ, మంగళవారాల్లో రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్ ముకుందకం శర్మ సారథ్యంలోని 12 మంది సభ్యుల అవార్డుల సెలెక్షన్ కమిటీ ‘ఖేల్‌రత్న’ కోసం ఐదుగురిని, ఉత్తమ క్రీడాకారులకు అందించే ‘అర్జున’ అవార్డు కోసం 29 మందిని... కోచ్‌లకు ఇచ్చే ‘ద్రోణాచార్య’ అవార్డు కోసం 13 మందిని... ప్లేయర్ ఉన్నపుడు, ఆట నుంచి రిటైరయ్యాకా క్రీడాభివృద్ధికి తోడ్పడుతున్న వారికి అందించే ‘ధ్యాన్‌చంద్’ జీవితకాల సాఫల్య అవార్డు కోసం 15 మందిని ఎంపిక చేసి కేంద్ర క్రీడా శాఖకు పంపించింది. ఇందులో ‘అర్జున’ అవార్డు కోసం దరఖాస్తు చేసుకున్న 2016 ‘ఖేల్‌రత్న’ అవార్డీ సాక్షి మలిక్... 2018 ‘ఖేల్‌రత్న’ అవార్డీ మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్) నామినేషన్స్‌ను కేంద్ర క్రీడా శాఖ తిరస్కరించి మిగతా అందరి పేర్లకు ఆమో దం తెలిపింది. ఇప్పటికే అత్యున్నత పురస్కారం ‘ఖేల్‌రత్న’ అందుకున్నందున సాక్షి మలిక్, మీరాబాయి చాను పేర్లను ఉత్తమ క్రీడాకారులకు అందించే ‘అర్జున’ కోసం పరిగణించలేదు. ఆన్లైన్లో... ప్రతి యేటా జాతీయ క్రీడా పురస్కారాలను జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టు 29న రాష్ట్రపతి భవన్లో ఘనంగా నిర్వహిస్తారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ఈసారి ఆన్లైన్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి జాతీయ క్రీడా పురస్కారాలు లభించాయి. యువ బ్యాడ్మింటన్ ఆటగాడు సాత్విక్ సాయిరాజ్‌కు ‘అర్జున’, మాజీ బాక్సర్ నగిశెట్టి ఉషకు ‘ధ్యాన్‌చంద్’ జీవితకాల సాఫల్య పురస్కారం లభించాయి. 2019లో షట్లర్ సాత్విక్ సాయిరాజ్ తన భాగస్వామి చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర)తో కలిసి విశేషంగా రాణించాడు. థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–500 టోర్నీలో టైటిల్ నెగ్గిన ఈ ద్వయం ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఈ క్రమంలో పురుషుల డబుల్స్ ప్రపంచ చాంపియన్ జోడీని, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న జంటను సాత్విక్–చిరాగ్ ద్వయం ఓడించింది. -
హాకీ శిఖరం... అత్యున్నత పోరాటం
భారత హాకీ గురించి చెప్పుకోవాల్సి వస్తే ముందుగా ధ్యాన్చందే గుర్తొస్తారు. ఈ మేజర్‌తోపాటు మన హాకీ స్వర్ణయుగంలో మరో దిగ్గజం కూడా ఉన్నారు. ఆయనే బల్బీర్ సింగ్ సీనియర్. స్వతంత్ర భారతావనిలో ధ్యాన్‌చంద్ అంతటి మేరునగధీరుడు బల్బీర్. ధ్యాన్‌చంద్ ఎవరెస్ట్ అయితే... బల్బీర్ కూడా ఎవరెస్టే. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. మైదానంలో ప్రత్యర్థుల ఎత్తుగడల్ని, గోల్‌పోస్ట్ ముందుండే దుర్భేద్యమైన గోడల్ని ఛేదించడంలో ఇద్దరూ ఇద్దరే! బ్రిటిష్ ఇండియా తరఫున హాకీ సమరాల్లో ధ్యాన్‌చంద్ ఎలా పోరాడారో... స్వతంత్ర భారతావని తరఫున బల్బీర్ అలాగే పోరాడారు. ఇద్దరి సంకల్పం ఒకటే... అదే భారత విజయనాదం. వరుస ఒలింపిక్స్ల్లో ఈ ఇద్దరూ పతకం (స్వర్ణం) రంగుమారకుండా అలుపెరగని పోరాటం చేశారు. బల్బీర్ ఆటగాడిగా 1948 లండన్ ఒలింపిక్స్‌లో, వైస్ కెప్టెన్‌గా 1952 హెల్సింకి ఒలింపిక్స్‌లో, కెప్టెన్‌గా 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో భారత్‌ను విజేతగా నిలిపాడు. ఈ మూడు పాత్రలకు అస్త్ర సన్యాసం చేశాక మేనేజర్ కమ్ కోచ్ హోదాలో 1975 ప్రపంచకప్‌లో టీమిండియా విజయానికి మార్గదర్శనం కూడా చేశాడు. హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు ఇదే ఏకైక టైటిల్. తదనంతరం భారత్ అటు ఒలింపిక్స్ పతకానికి దూరమైంది... ఇటు ప్రపంచకప్ టైటిల్ సాధన భారమైంది. చేతల మనిషి బల్బీర్... పంజాబ్‌లోని హరిపూర్ ఖల్సా గ్రామంలో 1924లో జన్మిం చిన బల్బీర్ మృదుభాషి. మాటలు తక్కువగా చేతల్లో ఎక్కువగా తన ప్రతాపం చూపేవాడు. ఇది ఇట్టే గమనించిన ఖల్సా కోచ్ హర్బల్ సింగ్... బల్బీర్‌ను హాకీ వజ్రంగా సానబెట్టారు. గురువు శిక్షణలో ఆటలో ఓనమాలు నేర్చిన బల్బీర్ పెరిగేకొద్దీ ఎదురేలేని యోధుడిగా ఎదిగాడు. భారత హాకీ జట్టులో సెంట్రల్ ఫార్వర్డ్ మెరికగా మారాడు. స్వరాజ్య భారతావనికి ఒలింపిక్స్‌లో తొలిస్వర్ణం అందించడంలో బల్బీర్ సింగ్ కీలకపాత్ర పోషించాడు. దీంతో స్వాతంత్య్రం వచ్చిన మరుసటి ఏడాది లండన్ (1948)లో జరిగిన విశ్వక్రీడల్లో పసిడి భారతమైంది. మరో ఒలింపిక్స్ ఆడే సమయానికి ఫార్వ ర్డ్ లైన్‌కే వన్నె తెచ్చేంత స్థాయికి ఎదిగిపోయాడు. ఇప్పటికీ పదిలం... ఆ రికార్డు అసాధారణ ఆటతీరుతో తర్వాతి ఒలింపిక్స్‌లో జట్టు వైస్ కెప్టెన్‌గా సెంట్రల్ ఫార్వర్డ్‌లో ప్రధాన ఆటగాడిగా ప్రత్యర్థుల ఎత్తుల్ని చిత్తు చేశాడు. 1952లో జరిగిన అంతిమ పోరాటంలో బల్బీర్ చెలరేగాడు. ఆ విశ్వక్రీడల్లో ఈ మాంత్రికుడు ఫైనల్లో తన విశ్వరూపం చూపెట్టాడు. ఆ విశ్వరూపం తాలూకూ బద్దలైన రికార్డు ఇన్నేళ్లయినా పదిలంగా ఉండటం మరో విశేషం. నెదర్లాండ్స్‌తో జరిగిన తుదిపోరులో భారత్ 6–1తో జయభేరి మోగించింది. ఇందులో ఒకే ఒక్క గోల్ ప్రత్యర్థి జట్టు చేసింది. మరో గోల్ తన జట్టు చేయగా... మిగతా 5 గోల్స్ బల్బీర్ ఒక్కడే సాధించడం రికార్డు పుటల్లోకెక్కింది. 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో సారథిగా మరో స్వర్ణం అందించాడు. అలుపేలేని పోరాటంతో ఎదురులేని విజయాలందించిన బల్బీర్ భారత హాకీలో నిజంగా మాంత్రికుడు. మువ్వన్నెల్ని మురిపించిన ఘనాఘనుడు. ఇతని నిరుపమానమైన ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం 1957లో ‘పద్మశ్రీ’తో సత్కరించింది. ఈ పురస్కారం అందుకున్న తొలి క్రీడాకారుడు బల్బీరే కావడం మరో విశేషం. 1975 ప్రపంచకప్‌తో (ఎడమ) -
‘దాయాది’ని గెలిచి... ప్రపంచాన్ని జయించి...
హాకీలో మన గతం ఎంతో ఘనం. ప్రత్యేకించి ఒలింపిక్స్‌లో అయితే భారతే చాంపియన్. ఏ దేశమేగినా... ఎవరెదురైనా... ఎగిరింది మన తిరంగానే. అందుకేనేమో మిగతా జట్లు కసిదీరా ఆడినా పసిడి కోసం మాత్రం కాదు! రజతమో లేదంటే కాంస్యమో వాళ్ల లక్ష్యం అయి ఉండేది. సుమారు మూడున్నర దశాబ్దాల పాటు భారత్‌దే స్వర్ణయుగం. విశ్వక్రీడల్లో ఇంతటి చరిత్ర ఉన్న భారత్‌కు ప్రపంచకప్ మాత్రం అంతగా కలసిరాలేదు. 1975లో ఒకసారి మాత్రమే భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఆ తర్వాత ఎన్నిసార్లు ప్రయత్నించినా టీమిండియా మళ్లీ ప్రపంచాన్ని గెలవలేకపోయింది. ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ సంబరాలెన్ని ఉన్నా... ప్రపంచకప్‌లో అంతగా లేవు. ఈ వెలితి తీరేలా... ‘ప్రపంచ’ పుటలకు ఎక్కేలా భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తు చేసి మరీ ‘కప్’ కొట్టింది. మలేసియా ఆతిథ్యమిచ్చిన మూడో మెగా ఈవెంట్ ఫైనల్ కౌలాలంపూర్‌లో జరిగింది. టోర్నీలోని హేమాహేమీ జట్లను ఓడించి భారత్, పాకిస్తాన్ జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ రెండు జట్లకిది రెండో ప్రపంచకప్ ఫైనల్. 1971లో స్పెయిన్‌పై ఫైనల్లో నెగ్గి పాక్ తొలిసారి ప్రపంచకప్ టైటిల్ సాధించగా... 1973లో నెదర్లాండ్స్‌తో జరిగిన అంతిమ సమరంలో భారత్ షూటౌట్లో ఓటమి చవిచూసి రన్నరప్‌గా నిలిచింది. చిరకాల ప్రత్యర్థిని ఓడించడం... ప్రపంచకప్ సాధించడం... ఈ రెండింటిని రెండు కళ్లతో చూస్తే మాత్రం ఒత్తిడంతా భారత్‌పైనే! మరి టీమిండియా ఏం చేసింది? ఒకేసారి ఇద్దరు ప్రత్యర్థుల్ని (పాక్, ఒత్తిడి) ఎలా జయించింది? పోరు హోరెత్తిందిలా... సరిగ్గా 45 ఏళ్ల క్రితం సంగతి. 1975, మార్చి 15న కౌలాలంపూర్‌లోని మెర్డెకా ఫుట్‌బాల్ స్టేడియం (అప్పట్లో ఆస్ట్రోటర్ఫ్‌పై కాకుండా పచ్చిక మైదానంలో హాకీ మ్యాచ్‌లను నిర్వహించేవారు). దాయాదుల ‘ప్రపంచ’ యుద్ధానికి వేదిక. సహజంగా మలేసియాలో హాకీకి క్రేజ్ ఎక్కువ. పైగా ప్రపంచకప్ ఫైనల్! అందుకే ఆ రోజు జరిగిన మ్యాచ్‌కు ప్రేక్షకులు పోటెత్తారు. మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. ఇరు జట్ల మేనేజర్లు, ప్రేక్షకులే కాదు క్షణాలు, నిమిషాలు కూడా ఎదురుచూస్తున్నాయి... తొలి పైచేయి ఎవరిదని! ఈ ఎదురుచూపుల్లోనే 16 నిమిషాలు గడిచిపోయాయి. ఆ మరు నిమిషమే భారత రణ శిబిరాన్ని నిరాశపరిచింది. బోణీతో దాయాది దరువేసింది. పాక్ స్ట్రయికర్ మహమ్మద్ జాహిద్ షేక్ (17వ నిమిషంలో) సాధించిన గోల్‌తో తొలి అర్ధభాగంలో ప్రత్యర్థి ఆధిక్యంలోకి వెళ్లింది. దీంతో భారత సేనపై మరింత ఒత్తిడి పెరిగింది. ఆట పాక్ ఆధిక్యంతోనే సాగుతూ ఉంది. భారత్ దాడులకు పదును పెట్టినా... ఆ ప్రయత్నాలేవీ ఫలించకుండా 43 నిమిషా ల ఆట ముగిసింది. ఆ తర్వాత నిమిషమే భారత విజయానికి తొలి అడుగు పడేలా చేసింది. డిఫెండర్, పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్ సుర్జీత్ సింగ్ (44వ నిమిషంలో) చక్కని ఏకాగ్రతతో గోల్ చేశాడు. తండ్రికి తగ్గ తనయుడు అశోక్... సుర్జీత్ చేసిన ఒకే ఒక్క గోల్‌తో భారత్ మూడడుగులు ముందుకేసింది. స్కోరు 1–1తో సమమైంది. ఒత్తిడి తగ్గింది. టైటిల్‌పై కన్ను పడింది. సరిగ్గా ఏడు నిమిషాల వ్యవధిలోనే దీనికి సంబంధించిన సానుకూలత ఫీల్డ్‌లో కనిపించింది. ఒకప్పుడు భారత హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ ఒలింపిక్స్ స్వర్ణాలను సాకారం చేస్తే... ఈసారి ఆయన తనయుడు అశోక్ కుమార్ (51వ నిమిషంలో) ప్రపంచకప్ టైటిల్‌ను ఖాయం చేసే గోల్ సాధించి పెట్టాడు. కానీ ఈ గోల్‌పై పాక్ వివాదం రేపినా... బంతి నిబంధనల ప్రకారం గోల్‌పోస్ట్‌లోకి వెళ్లిందని రిఫరీ పాక్ అప్పీల్‌ను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఆధిక్యం 2–1కు చేరిన ఈ దశలో భారత్ కట్టుదిట్టంగా ఆడింది. రక్షణ పంక్తి పాక్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నిరోధించింది. మిగిలున్న నిమిషాలన్నీ పాక్‌ను ముంచేయగా... భారత్ తొలిసారి విజేతగా నిలిచింది. ఆ మురిపెమే... ఇప్పటికీ అపురూపం తొలి ప్రపంచకప్ (1971)లో భారత్ కాంస్యంతో పతకాల బోణీ చేసింది. రెండో ఈవెంట్ (1973)లో రజతం గెలిచింది. మూడో ప్రయత్నంలో పసిడి నెగ్గింది. ఇలా వరుసగా మూడు ప్రపంచకప్‌లలో 3, 2, 1 స్థానాలకు ఎగబాకిన భారత్ చిత్రంగా... ఆ తర్వాత ప్ర‘గతి’ మార్చుకుంది. పతకానికి దూరమైంది. 1975 మెగా ఈవెంట్ తర్వాత 11 సార్లు ప్రపంచకప్ టోర్నీలు జరిగినా... ఇందులో మూడుసార్లు (1982, 2010, 2018లలో) ఈ మెగా ఈవెంట్‌కు భారత్ ఆతిథ్యమిచ్చినా సెమీఫైనల్ చేరలేకపోయింది. -
హిట్లర్ మెచ్చిన భారత క్రీడాకారుడు!
-
ధ్యాన్‌చంద్‌కు భారతరత్న ఇవ్వాలి
కరీంనగర్ స్పోర్ట్స్ : ఒలంపిక్స్‌లో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన హాకి లెజెండ్ ధ్యాన్‌చంద్‌కు భారతరత్న ఇవ్వాలని ప్రజాప్రయోజనాల పరిరక్షణ సమితి నాయకులు కోరారు. తెలంగాణచౌక్‌లో సోమవారం ఈమేరకు ప్రదర్శన నిర్వహించారు. క్రీడాకారుడిగా మూడు, కోచ్‌గా మూడు బంగారు పతకాలు సాధించిన ఘనత ధ్యాన్‌చంద్‌కు మాత్రమే దక్కిందన్నారు. జిల్లా కేంద్రంలో ధ్యాన్‌చంద్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న హామీని మేయర్ నిలబెట్టుకోవాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అమర్, రాజేశ్, ఆనంద్, నాగరాజు, అరుణ్, కిరణ్‌కుమార్, మహేశ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.