చరిత్రలో తొలిసారి... | Within One Year Five Members Got Rajiv Gandhi Khel Ratna Award | Sakshi
Sakshi News home page

చరిత్రలో తొలిసారి...

Published Sat, Aug 22 2020 2:55 AM | Last Updated on Sat, Aug 22 2020 3:02 AM

Within One Year Five Members Got Rajiv Gandhi Khel Ratna Award - Sakshi

న్యూఢిల్లీ: గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడా పురస్కారాల విషయంలో విశాల హృదయం చాటుకుంది. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న’ను ఒకేసారి అత్యధికంగా ఐదుగురికి అందజేయాలని నిర్ణయించింది. 2019 సంవత్సరానికిగాను రోహిత్‌ శర్మ (క్రికెట్‌), వినేశ్‌ ఫొగాట్‌ (మహిళల రెజ్లింగ్‌), రాణి రాంపాల్‌ (మహిళల హాకీ), మనిక బత్రా (మహిళల టేబుల్‌ టెన్నిస్‌), మరియప్పన్‌ తంగవేలు (పారా అథ్లెటిక్స్‌) ‘ఖేల్‌రత్న’ పురస్కారాలకు ఎంపికయ్యారు.
గతంలో 2016లో ఒకేసారి అత్యధికంగా నలుగురికి ‘ఖేల్‌రత్న’ అవార్డును ఇచ్చారు. 2016 రియో ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన షట్లర్‌ పీవీ సింధు, రెజ్లర్‌ సాక్షి మలిక్, నాలుగో స్థానం పొందిన జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్, 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో ఫైనల్‌ చేరిన షూటర్‌ జీతూ రాయ్‌లకు ఈ అవార్డు అందజేశారు. దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ మరణానంతరం ఆయన స్మారకార్థం 1991లో ‘ఖేల్‌రత్న’ అవార్డును ప్రవేశపెట్టారు. గతంలో ‘ద్రోణాచార్య’ అవార్డును ఒకేసారి అత్యధికంగా ఎనిమిది మందికి... ‘ధ్యాన్‌చంద్‌’ అవార్డును అత్యధికంగా ఐదుగురికి ఇచ్చారు.
గత సోమ, మంగళవారాల్లో రిటైర్డ్‌ సుప్రీంకోర్టు జస్టిస్‌ ముకుందకం శర్మ సారథ్యంలోని 12 మంది సభ్యుల అవార్డుల సెలెక్షన్‌ కమిటీ ‘ఖేల్‌రత్న’ కోసం ఐదుగురిని, ఉత్తమ క్రీడాకారులకు అందించే ‘అర్జున’ అవార్డు కోసం 29 మందిని... కోచ్‌లకు ఇచ్చే ‘ద్రోణాచార్య’ అవార్డు కోసం 13 మందిని... ప్లేయర్‌ ఉన్నపుడు, ఆట నుంచి రిటైరయ్యాకా క్రీడాభివృద్ధికి తోడ్పడుతున్న వారికి అందించే ‘ధ్యాన్‌చంద్‌’ జీవితకాల సాఫల్య అవార్డు కోసం 15 మందిని ఎంపిక చేసి కేంద్ర క్రీడా శాఖకు పంపించింది. ఇందులో ‘అర్జున’ అవార్డు కోసం దరఖాస్తు చేసుకున్న 2016 ‘ఖేల్‌రత్న’ అవార్డీ సాక్షి మలిక్‌... 2018 ‘ఖేల్‌రత్న’ అవార్డీ మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్‌) నామినేషన్స్‌ను కేంద్ర క్రీడా శాఖ తిరస్కరించి మిగతా అందరి పేర్లకు ఆమో దం తెలిపింది. ఇప్పటికే అత్యున్నత పురస్కారం ‘ఖేల్‌రత్న’ అందుకున్నందున సాక్షి మలిక్, మీరాబాయి చాను పేర్లను ఉత్తమ క్రీడాకారులకు అందించే ‘అర్జున’ కోసం పరిగణించలేదు.

ఆన్‌లైన్‌లో...
ప్రతి యేటా జాతీయ క్రీడా పురస్కారాలను జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టు 29న రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా నిర్వహిస్తారు. అయితే కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈసారి ఆన్‌లైన్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. 

ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇద్దరికి జాతీయ క్రీడా పురస్కారాలు లభించాయి. యువ బ్యాడ్మింటన్‌ ఆటగాడు సాత్విక్‌ సాయిరాజ్‌కు ‘అర్జున’, మాజీ బాక్సర్‌ నగిశెట్టి ఉషకు ‘ధ్యాన్‌చంద్‌’ జీవితకాల సాఫల్య పురస్కారం లభించాయి.  2019లో షట్లర్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ తన భాగస్వామి చిరాగ్‌ శెట్టి (మహారాష్ట్ర)తో కలిసి విశేషంగా రాణించాడు. థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌–500 టోర్నీలో టైటిల్‌ నెగ్గిన ఈ ద్వయం ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఈ క్రమంలో పురుషుల డబుల్స్‌ ప్రపంచ చాంపియన్‌ జోడీని, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ ర్యాంక్‌లో ఉన్న జంటను సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం ఓడించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement