ఇంగ్లండ్‌ చేతిలో ఓటమి.. అప్రతిష్టను మూటగట్టుకున్న టీమిండియా | IND vs ENG, 1st Test: Team India Bags Unwanted Record At Home - Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ చేతిలో ఓటమి.. అప్రతిష్టను మూటగట్టుకున్న టీమిండియా

Published Mon, Jan 29 2024 11:05 AM | Last Updated on Mon, Jan 29 2024 11:14 AM

IND VS ENG 1st Test: Team India Bags Worst Record By Getting Defeated While Having 100 Plus Runs Lead At Home - Sakshi

హైదరాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో దారుణ పరాభవాన్ని ఎదుర్కొన్న టీమిండియా మరో చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో 100కు పైగా (190 పరుగులు) లీడ్‌ సాధించినప్పటికీ తొలిసారి (స్వదేశంలో) ఓటమిని ఎదుర్కొంది. ఇప్పటివరకు భారత్‌ స్వదేశంలో 106 సందర్భాల్లో 100కి పైగా లీడ్‌ (తొలి ఇన్నింగ్స్‌) సాధించి, 70 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. 35 సందర్భాల్లో మ్యాచ్‌లు డ్రాగా ముగిసాయి. తొలిసారి టీమిండియా స్వదేశంలో 100కిపైగా లీడ్‌ సాధించి కూడా ఓటమిపాలై అప్రతిష్టను మూటగట్టుకుంది. 

ఓవరాల్‌గా (స్వదేశంలో, విదేశాల్లో) చూసినా టీమిండియా 100కి పైగా లీడ్‌ సాధించి ఓడిన సందర్భాలు చాలా తక్కువ. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో ఓటమిని కలుపుకుని భారత్‌ కేవలం మూడు సందర్భాల్లో మాత్రమే పరాజయంపాలైంది. ఇంగ్లండ్‌ చేతిలో స్వదేశంలో ఓటమి మినహా మిగతా రెండు అపజయాలను భారత్‌ విదేశాల్లో ఎదుర్కొంది.

2015లో గాలే టెస్ట్‌లో భారత్‌ శ్రీలంకపై 192 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించినప్పటికీ.. 63 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 100కిపైగా తొలి ఇన్నింగ్స్‌ సాధించిన సందర్భంలో ఇదే టీమిండియాకు అతి పెద్ద ఓటమి. అనంతరం 2022 బర్మింగ్హమ్‌ టెస్ట్‌లో టీమిండియా 132 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ లీడ్‌ సాధించి కూడా ఇంగ్లండ్‌ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 

ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. భారత స్పిన్‌ త్రయం (అశ్విన్‌, అక్షర్‌, జడేజా) ధాటి​కి తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగుల భారీ స్కోర్‌ చేసిన భారత్‌.. సాధించిన లీడ్‌ను నిలబెట్టుకోవడంలో విఫలం కావడమే కాకుండా చెత్త బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ ప్రదర్శనలతో ఓటమిని కొని తెచ్చుకుంది.

ఓలీ పోప్‌ (196) చెలరేగడంతో ఇంగ్లండ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 420 పరుగులు చేసి భారత్‌ ముందు 231 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో తడబడిన భారత్‌..202 పరుగులకే ఆలౌటై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement