వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమానంగా నిలిచింది. బుమ్రా (9/91), యశస్వి జైస్వాల్ (209), శుభ్‌మన్ గిల్ (104) అద్భుత ప్రదర్శనలతో టీమిండియాకు అపురూప విజయాన్ని అందించారు. స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌పై తొమ్మిది వికెట్లు తీసి ఇంగ్లండ్ ఓటమికి ప్రధాన కారణమైన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ బుమ్రా సహా సహచర ఆటగాళ్లందరిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. సమిష్టి ప్రదర్శనతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించాం. ఈ మ్యాచ్ గెలవడం అంత ఈజీ కాదని తెలుసు. బ్యాటింగ్ వరకు పటిష్టంగా ఉన్నాం. బౌలర్లు మెరుగ్గా రాణించాలని కోరుకున్నా. వారు అది చేసి చూపించారు.
బుమ్రా ఓ ఛాంపియన్ ప్లేయర్. నిమిషాల వ్యవధిలో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు. యశస్వి జైస్వాల్ ఓ అద్భుత బ్యాటర్. ఆటను బాగా అర్థం చేసుకున్నాడు. అతను ఇంకా చాలా దూరం వెళ్లాలి. జట్టు కోసం అతను చేయాల్సింది చాలా ఉంది. ఈ మ్యాచ్‌లో యువ బ్యాటర్లకు మంచి ఆరంభాలు లభించాయి. అయితే వాటిని పెద్ద స్కోర్లుగా మలచలేకపోయారు. అనుభలేమి, ఫార్మాట్‌కు కొత్త కావడంతో వారు తక్కువ స్కోర్లకు ఔటయ్యారు.
టెస్ట్ ఫార్మాట్‌లో కుదురుకోవడానికి వారికి కాస్త సమయం పడుతుంది. ఇది నేను అర్థం చేసుకోగలను. ఇలాంటి సందర్భాల్లోనే యువ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపాలి. జట్టుకు అది చాలా శ్రేయస్కరం. యువ ఆటగాళ్లు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా స్వేచ్ఛగా ఆడాలని కోరుకుంటున్నాను. యువ జట్టుతో ఇంగ్లండ్ లాంటి పటిష్టమైన జట్టును ఓడించడం చాలా గర్వంగా ఉంది. గత రెండేళ్లుగా ఇంగ్లండ్ మంచి క్రికెట్ ఆడుతోంది. ఈ సిరీస్ ఆంత తేలిక కాదని తెలుసు. ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మాలోని అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించి సిరీస్ గెలిచేందుకు ప్రయత్నిస్తామని హిట్‌మ్యాన్ అన్నాడు.
స్కోర్ వివరాలు..
భారత్: 396 & 255
ఇంగ్లండ్: 253 & 292
Comments
Please login to add a commentAdd a comment