IND VS ENG 1st Test: టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో రెండోసారి ఇలా..! | IND vs ENG, 1st Test: Tom Hartley Sensational Test Debut Match - Sakshi
Sakshi News home page

IND VS ENG 1st Test: టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో రెండోసారి ఇలా..!

Published Mon, Jan 29 2024 1:51 PM | Last Updated on Mon, Jan 29 2024 2:36 PM

IND VS ENG 1st Test: Tom Hartley Is The Second Player To Take 9 Wickets, After A Hit For A Six On First Ball In A Debut Match - Sakshi

ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ఓలీ పోప్‌ (సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 196 పరుగులు), స్పిన్నర్‌ టామ్‌ హార్ట్లీ (2/131, 7/62) అద్భుతంగా రాణించి టీమిండియా ఓటమికి ప్రధాన కారకులయ్యారు. వీరిద్దరూ అత్యుత్తమంగా రాణించి టీమిండియాకు స్వదేశంలో (100కి పైగా లీడ్‌ సాధించినప్పటికీ) ఓటమి రుచి చూపించారు. 

ఈ మ్యాచ్‌తో టెస్ట్‌ అరంగేట్రం చేసిన హార్ట్లీ.. తన కెరీర్‌ తొలి మ్యాచ్‌లోనే ఓ చెత్త రికార్డును, ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. హార్ట్లీ తాను సంధించిన తొలి బంతికే సిక్సర్‌ సమర్పించుకుని చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. అనంతరం హార్ట్లీ ఇదే మ్యాచ్‌లో ఏకంగా తొమ్మిది వికెట్లు పడగొట్టి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 

టెస్ట్‌ అరంగేట్రంలో  తొలి బంతికే సిక్సర్‌ సమర్పించుకుని అదే మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లతో (3/145, 6/73) చెలరేగిన రెండో ఆటగాడిగా హార్ట్లీ చరిత్ర పుటల్లోకెక్కాడు. ఇతనికి ముందు బంగ్లాదేశ్‌ ఆటగాడు సోహగ్‌ ఘాజీ మాత్రమే ఈ ఘనత సాధించాడు. 2012లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘాజీ కూడా ఇలాగే తొలి బంతికే (అరంగేట్రం) సిక్సర్‌ సమర్పించుకుని, అదే మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.

ఈ ఘాజీ పేరు మీద ఇప్పటికీ చెక్కుచెదరని ఓ ప్రపంచ రికార్డు కూడా ఉంది. ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో సెంచరీ చేసి హ్యాట్రిక్ సాధించిన ఏకైక క్రికెటర్‌గా ఘాజీ నేటికీ చలామణి అవుతున్నాడు. అలాగే ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌తో కలుపుకుని ఈ ఘనత రెండుసార్లు సాధించిన ఏకైక క్రికెటర్‌గా ఘాజీ చరిత్ర పుటల్లో నిలిచాడు. 

ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల భారీ లీడ్‌ సాధించినప్పటికీ ఓటమిపాలైంది. ఓలీ పోప్‌ మూడో ఇన్నింగ్స్‌లో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడి భారత్‌ ముందు ఫైటింగ్‌ టోటల్‌ను ఉంచాడు. 230 పరుగుల లక్ష్య ఛేదనలో​ తడబడిన భారత్‌ 202 పరుగులకు ఆలౌటై, స్వదేశంలో ఘోర అప్రతిష్టను మూటగట్టుకుంది. ఈ సిరీస్‌లోని రెండో టెస్ట్‌ మ్యాచ్‌ విశాఖ వేదికగా ఫిబ్రవరి 2 నుంచి మొదలవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement